కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: బదిలీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా ఎన్నికలతో సంబంధం కలిగిన అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ ఏడాది ఎంపీడీవోలను సైతం సొంత జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు పంపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
ముఖ్యంగా రెవెన్యూ శాఖలోని అధికారులకే ఎన్నికలతో సంబంధం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం వీఆర్వో మొదలుకొని అన్ని స్థాయిల అధికారులు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ నెల 31వ తేదీతో ప్రక్రియ పూర్తి కానుండటంతో అప్పటి వరకు ఎవరినీ కదిలించే పరిస్థితి లేదని తెలుస్తోంది.
ఫిబ్రవరి 1 తర్వాత రెవెన్యూ శాఖలో ఎన్నికలతో సంబంధం ఉన్న తహశీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు.. పంచాయతీరాజ్‌లో ఎంపీడీవోలు.. హోమ్ శాఖలో ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు స్థానచలనం కలగనుంది. వీరి స్థానంలో అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన అధికారులు రానున్నారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో దాదాపు 10 మండలాల తహశీల్దార్లు బదిలీ కానున్నారు. జిల్లాలో ముగ్గురు ఆర్డీఓలు పని చేస్తుండగా.. వీరి పదవీ కాలం ఆయా ప్రాంతాల్లో మూడేళ్లు పూర్తి కానందున బదిలీ అయ్యే అవకాశం లేదు. శ్రీశైలం స్పెషల్ కలెక్టర్ రహంతుల్లా కూడా ఇటీవలనే జిల్లాకు రావడంతో ఆయన కూడా బదిలీ పరిధిలోకి రారని తెలుస్తోంది. ఇక జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లకు కూడా మూడేళ్ల పదవీకాలం పూర్తి కానందున వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.
అయితే రిటర్నింగ్ అధికారులుగా పనిచేసే డిప్యూటీ కలెక్టర్లు దాదాపు బదిలీ కానున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు దాదాపుగా బదిలీ కావచ్చని సమాచారం. మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న దృష్ట్యా జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ వెంకటృష్ణుడులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంది. ఇదిలాఉండగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 30వ తేదీలోగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది.
బదిలీల కాలం
Published Thu, Jan 23 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement