- అనివార్యమే... అయినా అనువైన చోటుకోసం యత్నం
- ఎన్నికలయ్యాక మళ్లీ వచ్చేందుకు ముందస్తు ఒప్పందం!
- మూణాళ్ల ముచ్చటగా జెడ్పీ సీఈవో పోస్టు
సాక్షి, మచిలీపట్నం : ఎన్నికల నేపథ్యంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ అనివార్యమైంది. ఇదే సమయంలో జిల్లాను వదిలి వెళ్లలేక.. నిబంధనలను కాదని ఇక్కడే ఉండలేక వారు మధనపడుతున్నారు. గత్యంతరంలేని స్థితిలో ఎన్నికల తంతు ముగిశాక మళ్లీ జిల్లాకు వద్దామనుకునే లోపాయికారీ ఒప్పందాలతో వారు బదిలీకి సిద్ధపడుతున్నారు.
ఇదే సమయంలో తమకు పొరుగు జిల్లాల్లోనూ పదిలమైన చోటు కోసం అన్వేషణ మొదలెట్టారు. ఎన్నికల బదిలీని తమకు అనుకూలమైన ప్రాంతానికి చేసుకునేలా రాజధాని స్థాయిలో కొందరు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఏఎస్‌వో పద్మ బదిలీని నిలుపుదల చేసేందుకు ఒక కీలక అధికారి పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అనేక వివాదాల నడుమ జెడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు పరిస్థితి మూణ్ణాళ్ల ముచ్చటగానే మారిపోవడం గమనార్హం.
ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలో మూడేళ్లు నిండిన ఉద్యోగులు, సొంత జిల్లా ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో, తహ శీల్దార్, పోలీసుల బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తిచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో ఎన్నికల బదిలీలకు తెరలేచింది. కాగా, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తున్న కీలక అధికారులకు బదిలీ తప్పనిసరి అయ్యింది.
దీంతో నందిగామ, మైలవరం, అవనిగడ్డ, తిరువూరు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తున్న డీఆర్‌డీఏ పీడీ కె.శివశంకర్, జడ్పీ సీఈవో బి.సుబ్బారావు, ఉడా భూసేకరణ విభాగాధికారిణి మనోరమా, పోలవరం ప్రొజెక్టు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఝాన్సీలక్ష్మి, డీఆర్‌డీఏ ఏపీడీ విజయకుమారిని బదిలీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరంతా మూడున్నరేళ్లకుపైగా ఇక్కడే ఉండటం, అందులోనూ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిండంతో బదిలీ అనివార్యమైంది. దీంతో పొరుగున్న ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తమకు అనుకూలమైన చోటు కోసం వారి స్థాయిల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కుర్చీలాటలో సుబ్బారావు గెలిచినా....
జెడ్పీలో జరిగిన కూర్చీలాటలో గెలిచి సీఈవో కుర్చీని అధిరోహించిన బి.సుబ్బారావు మూడు నెలలు తిరగకుండానే బదిలీకావడం చర్చనీయాంశమైంది. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో నూజివీడు ఆర్డీవోగా పనిచేసిన సుబ్బారావు గత ఏడాది నవంబర్ 19న జెడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే జెడ్పీ సీఈవో, డెప్యూటీ సీఈవో పోస్టుల భర్తీ నిబందనలకు విరుద్దంగా జరిగిందని ఇద్దరు ఉద్యోగులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించిన సంగతి తెల్సిందే. సుబ్బారావు నియామకం చెల్లదని ట్రిబ్యూనల్ తీర్పు వస్తుందని ప్రతివాదులు ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన ఇలా బదిలీ అయ్యారు. సీఈవోగా మూడు నెలల వ్యవధిలోనే ఆయనపై ఇలా బదిలీవేటు పడటంతో కుర్చీలాటలో గెలిచినా ఓడినట్టే అయ్యింది.
పద్మ బదిలీ కాకుండా కీలక అధికారి ప్రయత్నాలు...
జిల్లాలోని సివిల్ సప్లైస్ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారిణి బదిలీ చర్చనీయాంశమైంది. విజయవాడలో ఏఎస్‌వో-1(రూరల్)గా పనిచేస్తున్న కోమలి పద్మ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. దీంతో ఆమెకు బదిలీ అనివార్యమని అధికారులు నిర్ధారించారు. ఇదే సమయంలో ఆమె బదిలీని నిలుపుదల చేసేందుకు కుటుంబ సన్నిహితుడు, కీలక అధికారి ఉన్నతస్థాయిలో వత్తిడి తెచ్చినట్టు సమాచారం. కోమలి పద్మకు శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయినట్టు చెబుతున్నారు. ఆ బదిలీని నిలుపుదల చేసేలా ఉన్నతస్థాయి ప్రయత్నాలు ఊపందుకున్నాయి.