రవాణా పన్ను అంగీకరించేది లేదు | Transportation tax would not | Sakshi
Sakshi News home page

రవాణా పన్ను అంగీకరించేది లేదు

Published Thu, Jul 31 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

రవాణా పన్ను అంగీకరించేది లేదు

రవాణా పన్ను అంగీకరించేది లేదు

సాక్షి, విజయవాడ బ్యూరో : రవాణ రంగంపై భారంమోపుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటిం చిన రవాణా పన్నును రద్దుచేయాలని కృష్ణా జిల్లా లారీ ఓనర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ట్రాన్స్‌పోర్టు వాహనాలపై త్రైమాసిక పన్ను విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా జిల్లా  లారీ ఓనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.వి. రమేష్, ప్రధాన కార్యదర్శి ఎన్.రాజా, కార్యదర్శులు పి.అప్పలరాజు, పి.వి.ఎస్.ప్రకాశరావు విజయవాడలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ఏర్పాటుతో రెండు రాష్ట్రాల్లో పన్ను  చెల్లించడం భారమని, పదేళ్లపాటు ఏదో ఒకచోట పన్ను చెల్లించే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర విభజన సమయంలో తాము గవర్నర్‌ను కలిసి విన్నవించామని తెలి పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏ రాష్ట్రానికి చెందిన రవాణా వాహనమైనా 20015 మార్చి వరకు ఒకచోట పన్ను చెల్లిస్తే సరిపోతుందని మినహాయింపు ఇస్తూ గవర్నర్ ఆదేశంతో జూన్ ఒకటో తేదీన జీవో 43 జారీ అయిందన్నారు.

ఈ జీవోను కాదని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 28న సర్కులర్ నంబర్ 586ను జారీ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణకు వచ్చే రవాణ వాహనాలపై వారం, నెల, మూడు నెలల గడువు పేరుతో పన్నులు విధిం చాలని సర్కులర్ ఇవ్వడం తమపై అదనపు భారం మోపడమేనన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే తెలంగాణ వాహనాలు తక్కువేనని, అదే ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్లే వాహనాలు అధికంగా ఉంటాయని అన్నారు.

విజయవాడ నుంచి ప్రైవేటు బస్సు టిక్కెట్ రూ.500 ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో సీటుకు రూ.300పన్ను విధిం చడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం మూడు నెలలకి ఆరు చక్రాల లారీకి రూ.3,320, పది చక్రాల లారీకి రూ.5,750, 12చక్రాల లారీకి రూ.7,450, నేషనల్ పర్మిట్ ఏడాదికి రూ.16,500 చొప్పున చెల్లిస్తున్నట్టు వివరించారు.

ఇవే పన్నులను ఒకే లారీకి రెండు రాష్ట్రాల్లో చెల్లించాల్సి రావడం భారమేనని అన్నారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలపై ఇలా పన్నుల భారం వేయడం వల్ల ప్రజలపై చార్జీల భారం, నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయాన్ని తెలంగాణలోని లారీ ఓనర్ల అసోసియేషన్‌తో మాట్లాడితే గురువారం సీఎం కేసీఆర్‌ను కలిసి పన్ను మినహాయింపు విషయం చర్చిస్తామని చెప్పారని కృష్ణా జిల్లా లారీ అసోసియేషన్ నాయకులు తెలిపారు.
 
భవిష్యత్ కార్యాచరణపై ఆగస్టు 4న నిర్ణయం
 
ట్రాన్స్‌పోర్టు వాహనాలపై పన్ను విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈ నెల 4న ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగే ఏపీలారీ ఓనర్ల అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో చర్చించనున్నట్టు వారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం విధించిన పన్నులను రద్దు చేసి ఇతర రాష్ట్రాల్లోలా కౌంటర్ సిగ్నేచర్ పద్ధతి పెట్టినా పర్వాలేదని, లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామని వారు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement