దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా కాంట్రాక్టర్లు, ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు కుమ్మక్కయ్యారు. అందిన కాడికి దోచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతకుముందు 20 శాతం తక్కువకు కోట్ చేసిన పనులకు ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ అంచనా వ్యయం భారీగా పెంచారు. ఆ మొత్తంపై 5 శాతం సొమ్మును ఎక్కువ చెల్లించేలా టెండర్లు వేయించారు. నగరపాలక సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా పోటీ లేకుండా ఎక్కడికక్కడ కుమ్మక్కై సింగిల్ టెండర్లతో కోట్లాది రూపాయల పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎక్కడైనా పనులు చేపట్టాలంటే ముందుగా టెండర్లు ఆహ్వానిస్తారు. ఆన్‌లైన్‌లోనే బిడ్ వేస్తారు. ఎవరు తక్కువ ధర కోట్‌చేస్తే వారిని ఎంపిక చేసి పనుల కాంట్రాక్టుల్ని అప్పగిస్తారు. కానీ.. ఘనత వహించిన ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు మాత్రం కాంట్రాకర్లు పోటీపడకుండా ముందస్తుగానే పంచాయితీ చేశారు. ఎవరి స్థాయిలో వారికి పనులు పంచేశారు. కార్పొరేటర్లు సహా అందరికీ సొమ్ములు మిగిలేలా మాట్లాడుకున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతోపాటు నగరపాలక సంస్థ నిధులతో చేపట్టనున్న రూ.10 కోట్ల విలువైన పనులను ఇష్టారాజ్యంగా పంచేశారు.
పంపకాల్లో కొన్ని ఇలా..
నగరంలో నివాసముంటున్న చింతల పూడికి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు రూ.80 లక్షల విలువైన పనులను కట్టబెట్టారు. ఏలూరుకు చెందిన మరో సీని యర్ కాంట్రాక్టర్‌కు రూ.కోటి విలువైన పనులను, టీడీపీ కో-ఆప్టెడ్ సభ్యుడి బినామీకి రూ.40 లక్షల విలువైన పనులను అప్పగించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేసిన 4 పనులు మినహా దాదాపు 50 పనులను సింగిల్ టెండర్లు వేయించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టినట్టు తెలుస్తోంది.
ఐదు శాతం ఎక్సెస్ ఎందుకు
వాస్తవానికి ఇప్పుడు నిర్ధేశించిన పను లు చేసేందుకు మూడేళ్ల కిందటే టెండర్లను ఆహ్వానించారు. అప్పట్లో అంచ నా వ్యయంపై 20నుంచి 25శాతం తక్కువకే కోట్ చేసి కాంట్రాక్టర్లు ఆయా పనులను దక్కించుకున్నారు. కానీ.. అప్పట్లో 13వ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదలకాక కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టలేదు. 2011 నుం చి 2014 వరకు పాలకవర్గం లేకపోవడం.. సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆటంకాలు.. ఆ తర్వాత వరుస ఎన్నికల నేపథ్యంతో పనులు అటకెక్కాయి. ఇటీవల ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా, నగరపాలక సంస్థ సాధారణ నిధులను కలిపి మొత్తం రూ.10 కోట్ల పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఎప్పుడు పనులు మొదలవుతాయా.. ఎప్పుడు కాసులొ స్తాయా అని చూస్తున్న అధికార పార్టీ కార్పొరేటర్లు తమ అనుచరగణానికి పనులు కట్టబెట్టి కాసులు దండుకునేం దుకు తెరలేపారు. గతంలో ఖరారైన టెండర్లను పక్కనపెట్టి అస్మదీయులకు పనులు కట్టబెట్టేలా చర్యలు తీసుకున్నారు. రెండు, మూడేళ్ల కిందట కాం ట్రాక్టర్లు 20శాతం కంటే తక్కువకు కోట్ చేయగా.. ఇప్పుడు అవే పనులకు ముడి సరుకుల ధరలు పెరిగాయంటూ అంచనా వ్యయాలను పెంచారు. దీంతోపాటు ఐదు శాతం ఎక్కువ చెల్లించేలా టెండర్లు రూపొం దించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 18, 19వ తేదీల్లో దాఖలైన టెండర్లకు రేపోమాపో ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది.
దోపిడీకి ఉదాహరణలివిగో
=ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎన్‌ఆర్ పేట మీదుగా జీఎన్‌టీ రోడ్ వరకు అవుట్‌ఫాల్ డ్రెయిన్ నిర్మాణానికి గతంలో రూ.20.10 లక్షల ధర నిర్ణయించగా, ఓ కాంట్రాక్టర్ 20శాతం తక్కువకే టెండర్ వేశారు. సుమారు రూ.16.67లక్షలకే ఆ కాంట్రాక్టు పూర్తి చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు అదే పనిని మరో కాంట్రాక్టర్‌కు రూ.31 లక్షలకు ఇచ్చేలా టెండర్ ఖరారు చేశారు. అంటే దాదాపు రెట్టిం పు ధరకు అన్నమాట.
=టీటీటీ కల్యాణ మంటపం రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్ల నిర్మాణ పనులను మూడేళ్ల కిందట రూ.34.40 లక్షలకు చేపట్టేందుకు ఓ కాంట్రాక్టర్ టెండర్ వేశారు. ఈయన కూడా 20 శాతం తక్కువకే కోట్ చేస్తూ రూ.29.44 లక్షలకే నిర్మాణం పూర్తి చేసేందుకు ముం దుకొచ్చారు. ఇప్పుడు అదే పనిని మరో కాంట్రాక్టర్‌కు రూ.40 లక్షలకు టెండర్ ఖరారు చేశారు.
=19వ డివిజన్‌లోని క్రీస్తు విగ్రహం నుంచి వంగాయగూడెం ఎస్సీ కాలనీ వరకు సీసీ డ్రెయిన్ల నిర్మాణాన్ని గతంలో రూ.23.11 లక్షలతో చేపట్టేలా ఒప్పందం కుదిరింది. అదే పనిని ఇప్పుడు రూ.30 లక్షలకు టెండర్ ఖరారు చేశారు.
=అశోక్ నగర్ మెయిన్ రోడ్‌లోని అశోకా పిల్లర్ జంక్షన్ నుంచి అమీనాపేట ఎస్‌ఆర్ జంక్షన్ వరకు డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు గతంలో రూ.32 లక్షలకు టెండర్ ఖరారు కాగా, ఇప్పుడు ఇదే పనిని రూ.46 లక్షలకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు అప్పగించారు.
ఖజానాకు టెండర్
Published Sat, Jun 27 2015 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM
Advertisement
Advertisement