గన్నవరంలోని ఇస్లాంపేటలో భయంతో ఇళ్ల బయటకు చేరుకున్న ప్రజలు
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. భారీ శబ్దంతో భూమి రెండు నుంచి మూడు సెకన్లపాటు కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భూప్రకంపనలు రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 10న భూమి వరుసగా మూడు, నాలుగుసార్లు స్వల్పంగా కంపించింది. ఈ ఘటన మరువక ముందే గురువారం మధ్యాహ్నం 2.59 నిమిషాల సమయంలో భారీ శబ్దంతో భూమి కంపించింది.
గన్నవరంతో పాటు కేసరపల్లి, అప్పా రావుపేట, బుద్ధవరం, దావాజిగూడెం, అల్లాపురం, తెంపల్లి, చిన్నఆవుటపల్లి, కొత్తగూడెం, చిక్కవరం, గొల్లనపల్లి, ముస్తాబాద పలు మెట్ట ప్రాంత గ్రామా ల్లో ప్రకంపనల ప్రభావం కనిపించింది. వీటి ప్రభావంతో ఇళ్లలోని మంచాలు, కుర్చీలు, వస్తువులు కదిలి పోయినట్లు సమాచారం. బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారికి ఈ ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. రేకులతో నిర్మించిన కొన్ని భవనాల గోడలు స్వల్పంగా నెర్రలిచ్చాయి. ఈ భూప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 1.5 పాయింట్లుగా నమోదైన్నట్లు రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో మట్టి, మైనింగ్ తవ్వకాలు అధికంగా జరుగుతున్న కారణంగా ద్రవ్యరాశిలో హెచ్చుతగ్గులు ఏర్పడి ప్రకంపనలు సంభవిస్తున్నాయని భౌతిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment