మంగళ వారం పురుగులతో పెట్టిన భోజనాన్ని పరిశీలిస్తున్న ఎసై జయంతి
నిరుపేదలు... మధ్యాహ్న భోజనం దొరుకుతుందనే ఆశతో సర్కారు బడులకు వెళ్తున్నవారు... ఉన్న ఊళ్లో ఉన్నత విద్య లేక చదువుకోసం పట్టణాల్లోని హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నవారు... అధికారుల నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు. ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందించాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే... జిల్లాలోని కొందరు అధికారులు తమ చర్యలతో సర్కారుకు చెడ్డపేరు తీసుకువస్తున్నారు. పురుగులతో ఉన్న బియ్యం, పప్పు శుభ్రపరచకుండానే అలాగే వండేస్తూ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఆ భోజనం తినలేక ఎంతోమంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు. గత సర్కారు నాణ్యతలేని సరకులు అందించడంతో వాటినే ఇంకా వినియోగిస్తూ పిల్లలపై తమ అక్కసు తీర్చుకుంటున్నారు.
సాక్షి, విజయనగరం : జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 25,035 మంది విద్యార్థులున్నారు. నిజానికి జిల్లాలోని అనేక సంక్షేమ వసతి గృహాల్లోనూ, మధ్యాహ్న భోజన పథకంలోనూ విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నమే పెడుతున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో భోజనం అధ్వానంగా ఉంటోంది. జిల్లాలో ఈ పరిస్థితి రావడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. అప్పట్లో అవసరానికి మించి సరఫరా చేసిన నాణ్యత లేని బియ్యం, కందిపప్పునే ఇంకా వాడుతున్నారు. అవి పాడై పురుగులు పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి తూట్లు
పేదింట పుట్టి చదువుల కోసం ప్రభుత్వ పాఠశాలకు వెళుతూ, ఉన్నత విద్య కోసం సంక్షేమ హాస్టళ్లలో తలదాచుకుంటున్న విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచిస్తోంది. హాస్టళ్లలో వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడే రాత్రి నిద్రచేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు. కనీసం ఆ పనిచేసినా కొంతవరకైనా హాస్టళ్ల దుస్థితిలో మార్పు వచ్చుండేది. కానీ దీనిపై అధికారులు ఇంత వరకూ పూర్తి స్థాయిలో దృష్టిసారించలేదు. అవసరానికి మించి నాసిరకం సరకుల సరఫరా జిల్లాలోని 2,701 ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 1,84,184 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఒక్కో స్కూల్‌కు ఒక ఏజెన్సీ చొప్పున నిర్వహణ బాధ్యత అప్పగించారు.
భోజన నిర్వాహక ఏజెన్సీలలో 5,024 మంది నిర్వహణ సిబ్బందికి ఉపాధి లభిస్తోంది. జిల్లాలో వీరి కోసం సరాసరిన నెలకు రూ. 3 కోట్ల వరకు నిధులు ఖర్చవుతోంది. పౌర సరఫరాల శాఖ ద్వారా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బియ్యం పంపణీ చేస్తున్నారు. గత ఏప్రిల్ వరకు పప్పు రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు ఏజెన్సీ పంపిణీ చేసేది. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాల స్థాయిలోని భోజన నిర్వాహక ఏజెన్సీలే పప్పును కొనుగోలు చేసి బిల్లు పెడుతున్నాయి. అప్పుడు ఇచ్చిన పప్పు నిల్వలే ఇంకా ఉన్నాయి. అవి పురుగులు పట్టాయి. దీంతో ఆ పప్పును వేడినీళ్లల్లో ఉడికించి ఎండబెట్టి భద్రపరిచి మరలా దానినే వండి పిల్లలకు పెడుతున్నారు. ఆ పప్పులో మళ్లీ పురుగులు పట్టేయడంతో పిల్లలకు పెట్టే భోజనంలో అవి కనిపిస్తున్నాయి.
ప్రైవేటు ఏజెన్సీ నిర్వాకం
విజయనగరం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల పరిధిలోని 240 పాఠశాలలకు నెల్లిమర్ల క్లస్టర్‌గా ఏర్పరచి ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భోజన పంపిణీ చేసే విధానాన్ని గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించారు. మూడు మండలాలకు పంపిణీ చేయలేకపోవడం వల్ల కొద్ది రోజులకే డెంకాడ మండల పాఠశాలలకు మినహాయించారు. ప్రస్తుతం 189 స్కూళ్లలోని 21,703 మంది విద్యార్థులకు ప్రైవేటు సంస్థ భోజనం పంపిణీ చేస్తోంది. ఉదయమే వంట పూర్తి చేసి బాక్సుల్లో పెట్టి స్కూళ్లకు తరలిస్తుండటంవల్ల ఆ భోజనం పాడైపోయి వాసన వస్తూ తినలేని విధంగా మారుతోంది.
పార్వతీపురంలో విద్యార్థుల ఆందోళన
పార్వతీపురం: పార్వతీపురం గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం అన్నంలో పురుగులు రావడంతో వారు నిరసన తెలియజేశారు. వంట చేసే సమయంలో బియ్యాన్ని కడగకుండా అన్నం ఎసరులో ఉన్నపళంగా పోయడంతో సుంకి పురుగులు అన్నంలో అధిక సంఖ్యలో కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు వసతి గృహం వద్దకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జయంతి వసతి గృహాన్ని సందర్శంచి వంటకా లను పరిశీలించారు. అన్నంలో ఉన్న పురుగులను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment