midday meals scheme
-
ఇకపై రుచికరమైన భోజనం..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు మొదలు పెట్టారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలు ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే సదాశయంతో సమూల మార్పులు చేస్తున్నారు. సంబంధిత విషయమై జిల్లాలోని పలు మండలాలకు సంబంధించిన ఎంఈఓ, హెచ్‌ఎంలతోపాటు విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణను తీసుకుంటున్నారు. ఈ నివేదికలను త్వరలో రాష్ట్ర అధికారులకు పంపనున్నారు. త్వరలోనే మధ్యాహ్న భోజనంలో మార్పులు చోటుచేసుకుని పిల్లలకు నాణ్యమైన భోజనం అందనుంది. సాక్షి, కడప ఎడ్యుకేషన్ : పేద విద్యార్థులకు కడుపు నింపేందుకు ప్రారంభించిన మధ్యాహ్న భోజనంలో సమూల మార్పులపై ప్రభుత్వం దృష్టి సారించింది. రుచికి, శుచికి ప్రాధాన్యం ఇస్తూ కమ్మని వంటలను వండి పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని నామమాత్రంగా అమలు చేయడంతోపాటు ఏనాడూ రుచికరంగా అందించలేదనే విమర్శలు ఉన్నాయి. వీటితోపాటు పర్యవేక్షణ కూడా కొరవడి.. వంట నిర్వాహకులు పెట్టిందే మెనూ వండిందే తిను అనే తరహాలో సాగిందనే చెప్పాలి. ఇక మీదట వాటికి స్వస్తి పలికి విద్యార్థులు అర్ధాకలితో కాకుండా కడపునిండా తిని మనస్ఫూర్తిగా చదువుపై దృష్టి సారించే విధంగా.. ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కార్మికులకు గౌరవ వేతనాన్ని మూడింతలు పెంచారు. అలాగే విద్యార్థుల భోజనానికి ఇచ్చే డబ్బులను కూడా పెంచారు. ఫలితంగా జిల్లాలో 2,13,322 మంది విద్యార్థులకు ఇకపై రుచికరమైన భోజనం అందనుంది. నివేదికల కోసం ఆదేశాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంపై సమగ్ర నివేదికలను ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖాధికారులు జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి జిల్లాలోని పలువురు ఎంఈఓలు, హెచ్ఎంలను మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, అందులో చేయాల్సిన మార్పులు చేర్పులపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. మధ్యాహ్న భోజనాన్ని పిల్లలు కడుపు నిండా తింటున్నారా లేక ఇందులో మార్పులనేమైనా తీసుకురావాలా అనే అంశాలపై విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయ సేకరణను తీసుకోనున్నారు. భోజనం చేస్తున్న విద్యార్థులు జిల్లాలో అమలు తీరు జిల్లాలో విద్యాశాఖ ద్వారా 2632 ప్రాథమిక, 335 ప్రాథమికోన్నత, 365 ఉన్నత పాఠశాలల్లో కలుపుకొని 2,13,322 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వీటిలో కడప మండలంలో మాత్రం ఇస్కాన్ సంస్థ పిల్లలకు సరఫరా చేస్తోంది. కడప సమీపంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో ఒకే చోట మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేసి.. మండలంలోని వందకు పైగా స్కూల్స్‌కు వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇస్కాన్ సంస్థ ప్రభుత్వ మెనూను సక్రమంగా అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా పలుమార్లు ఆందోళన చేపట్టాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు. కార్మికులకు పెరిగిన గౌరవ వేతనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కుక్‌లు, హెల్పర్లకు గత ప్రభుత్వం ఇస్తున్న రూ. 1000 నుంచి ఒక్క సారిగా రూ.3000కు పెంచారు. జిల్లా వ్యాప్తంగా 5745 మంది కుక్స్, హెల్పర్లు ఉన్నారు. వీరికి సంబంధించి పెంచిన జీతాన్ని ఆగస్టు నుంచి అమలు చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనానికి ఇచ్చే డబ్బులను పెంచారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి గతంలో ఇస్తున్న 4.35 నుంచి ప్రస్తుతం 4.48కు పెంచడం జరిగింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్కరికి 6.51 నుంచి 6.71 పెంచారు. ఈ పెంచిన డబ్బులను ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు. నివేదిక సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎంఈఓలు, ఉపాధ్యాయులు, పిల్లల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. ఇందులో అందరి అభిప్రాయాల్లో ఎక్కవ మంది చెప్పిన వాటిని క్రోడీకరించి నివేదిక సిద్ధం చేçస్తున్నాం. అందరి అభిప్రాయాలు రాగానే నివేదికను ప్రభుత్వానికి పంపుతాం. – పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి వంట ఏజెన్సీల వివరాలు జిల్లాలో ఉన్న వంట ఏజెన్సీలు : 5745 గతంలో కుక్స్‌కు నెలకు ఇస్తున్న వేతనం : 1000 ప్రస్తుతం ఇస్తున్న వేతనం : 3000 వంట గదులు జిల్లాలోని మొత్తం వంట గదులు: 1687 ఫేజ్–1 లో మంజూరైనవి : 1150 పూర్తి అయినవి : 962 వివిధ కారణాలతో ప్రారంభం కానివి: 188 ఫేజ్– 2లో మంజూరైనవి: 537 పూర్తి అయినవి: 357 వివిధ దశల్లో ఉన్నవి: 11 మొదలు కానివి: 169 -
మీరైతే ఇలాంటి భోజనం చేస్తారా?
నిరుపేదలు... మధ్యాహ్న భోజనం దొరుకుతుందనే ఆశతో సర్కారు బడులకు వెళ్తున్నవారు... ఉన్న ఊళ్లో ఉన్నత విద్య లేక చదువుకోసం పట్టణాల్లోని హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నవారు... అధికారుల నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు. ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందించాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే... జిల్లాలోని కొందరు అధికారులు తమ చర్యలతో సర్కారుకు చెడ్డపేరు తీసుకువస్తున్నారు. పురుగులతో ఉన్న బియ్యం, పప్పు శుభ్రపరచకుండానే అలాగే వండేస్తూ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఆ భోజనం తినలేక ఎంతోమంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు. గత సర్కారు నాణ్యతలేని సరకులు అందించడంతో వాటినే ఇంకా వినియోగిస్తూ పిల్లలపై తమ అక్కసు తీర్చుకుంటున్నారు. సాక్షి, విజయనగరం : జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 25,035 మంది విద్యార్థులున్నారు. నిజానికి జిల్లాలోని అనేక సంక్షేమ వసతి గృహాల్లోనూ, మధ్యాహ్న భోజన పథకంలోనూ విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నమే పెడుతున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో భోజనం అధ్వానంగా ఉంటోంది. జిల్లాలో ఈ పరిస్థితి రావడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. అప్పట్లో అవసరానికి మించి సరఫరా చేసిన నాణ్యత లేని బియ్యం, కందిపప్పునే ఇంకా వాడుతున్నారు. అవి పాడై పురుగులు పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి తూట్లు పేదింట పుట్టి చదువుల కోసం ప్రభుత్వ పాఠశాలకు వెళుతూ, ఉన్నత విద్య కోసం సంక్షేమ హాస్టళ్లలో తలదాచుకుంటున్న విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచిస్తోంది. హాస్టళ్లలో వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడే రాత్రి నిద్రచేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు. కనీసం ఆ పనిచేసినా కొంతవరకైనా హాస్టళ్ల దుస్థితిలో మార్పు వచ్చుండేది. కానీ దీనిపై అధికారులు ఇంత వరకూ పూర్తి స్థాయిలో దృష్టిసారించలేదు. అవసరానికి మించి నాసిరకం సరకుల సరఫరా జిల్లాలోని 2,701 ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 1,84,184 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఒక్కో స్కూల్‌కు ఒక ఏజెన్సీ చొప్పున నిర్వహణ బాధ్యత అప్పగించారు. భోజన నిర్వాహక ఏజెన్సీలలో 5,024 మంది నిర్వహణ సిబ్బందికి ఉపాధి లభిస్తోంది. జిల్లాలో వీరి కోసం సరాసరిన నెలకు రూ. 3 కోట్ల వరకు నిధులు ఖర్చవుతోంది. పౌర సరఫరాల శాఖ ద్వారా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బియ్యం పంపణీ చేస్తున్నారు. గత ఏప్రిల్ వరకు పప్పు రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు ఏజెన్సీ పంపిణీ చేసేది. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాల స్థాయిలోని భోజన నిర్వాహక ఏజెన్సీలే పప్పును కొనుగోలు చేసి బిల్లు పెడుతున్నాయి. అప్పుడు ఇచ్చిన పప్పు నిల్వలే ఇంకా ఉన్నాయి. అవి పురుగులు పట్టాయి. దీంతో ఆ పప్పును వేడినీళ్లల్లో ఉడికించి ఎండబెట్టి భద్రపరిచి మరలా దానినే వండి పిల్లలకు పెడుతున్నారు. ఆ పప్పులో మళ్లీ పురుగులు పట్టేయడంతో పిల్లలకు పెట్టే భోజనంలో అవి కనిపిస్తున్నాయి. ప్రైవేటు ఏజెన్సీ నిర్వాకం విజయనగరం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల పరిధిలోని 240 పాఠశాలలకు నెల్లిమర్ల క్లస్టర్‌గా ఏర్పరచి ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భోజన పంపిణీ చేసే విధానాన్ని గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించారు. మూడు మండలాలకు పంపిణీ చేయలేకపోవడం వల్ల కొద్ది రోజులకే డెంకాడ మండల పాఠశాలలకు మినహాయించారు. ప్రస్తుతం 189 స్కూళ్లలోని 21,703 మంది విద్యార్థులకు ప్రైవేటు సంస్థ భోజనం పంపిణీ చేస్తోంది. ఉదయమే వంట పూర్తి చేసి బాక్సుల్లో పెట్టి స్కూళ్లకు తరలిస్తుండటంవల్ల ఆ భోజనం పాడైపోయి వాసన వస్తూ తినలేని విధంగా మారుతోంది. పార్వతీపురంలో విద్యార్థుల ఆందోళన పార్వతీపురం: పార్వతీపురం గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం అన్నంలో పురుగులు రావడంతో వారు నిరసన తెలియజేశారు. వంట చేసే సమయంలో బియ్యాన్ని కడగకుండా అన్నం ఎసరులో ఉన్నపళంగా పోయడంతో సుంకి పురుగులు అన్నంలో అధిక సంఖ్యలో కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ సభ్యులు వసతి గృహం వద్దకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జయంతి వసతి గృహాన్ని సందర్శంచి వంటకా లను పరిశీలించారు. అన్నంలో ఉన్న పురుగులను పరిశీలించారు. -
బడిలో ఇక అల్పాహారం!
సదాశివనగర్ (కామారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మరింత పటిష్ట పరచడానికి ప్రభుత్వం వినూత్నంగా అడుగులు వేస్తోంది. విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ముందుకు సాగుతోంది. పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం సమస్యను తీర్చడంతో పాటు, పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి తోడు ఉదయం పూట అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్)ను ఇవ్వాలని యోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకం అమలు చేస్తుండడంతో కొన్నేళ్లుగా విద్యార్థుల హాజరుశాతం కూడా పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు పిల్లల్లో పౌష్టికాహారలోపం సమస్య కూడా కొంత వరకు తీర్చగలుగుతున్నారు. ఉదయం పూట అల్పాహారం కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో జిల్లాలోని లక్షా 45 వేల 443 విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మధ్యాహ్న భోజనం వల్ల విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం సమస్య తీర్చడానికి తోడు విద్యార్థుల హాజరుశాతం పెరిగేందుకు దోహదపడుతుంది. ఆయా పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లేమితో బాధ పడుతున్నారు. ఒకపూట ఆహారం అందించడం వల్ల కొంత సమస్య తగ్గింది. రెండుపూటలా ఆహారం అందిస్తే వారిలో పౌష్టికాహార లేమి చాలావరకు దూరం చేయవచ్చు. ఉచితంగా ఆహారం అందించడం వల్ల పేదకుటుంబాల పిల్లలు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంటుంది. అల్పాహారంలో భాగంగా విద్యార్థులకు పాలు, పండ్లు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. అల్పాహారం అందించడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 718 ప్రాథమిక పాఠశాలలు, 213 ప్రాథమికోన్న త పాఠశాలలు, 321 ఉన్నత పాఠశాలలున్నాయి. కాగా ఈ పాఠశాలల్లో సుమారు లక్షా 45వేల 443 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పెరిగిన భోజనం ధరలు ఇలా.. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు ఒక్కొక్కరికి మధ్యాహ్నభోజనం కోసం రూ. 4.13 ఇచ్చే వారు. దానిని రూ. 4.35లకు పెంచారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు రూ. 6.18 ఇచ్చేవారు ప్రస్తుతం రూ. 6.51కి పెంచారు. విద్యార్థులకు వారంలో రెండు రోజుల పాటు గుడ్డును అందిస్తున్నారు. గతంలో ఒక్కో గుడ్డుకు రూ. 4 చెల్లించగా, ఇప్పుడు రూ. 2 పెంచి రూ. 6 చెల్లించనున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు సన్న బియ్యం భోజనం అందిస్తున్నారు. పెరిగిన ధరలతో విద్యార్థులందరికి నాణ్యమైన భోజనం అందనుంది. రేటు పెంపుతో భోజనం మెరుగు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నభోజనం మెనూ చార్జీలు పెరిగాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందనుంది. గతంలో భోజనం ధరలు తక్కువగా చెల్లించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం నిర్వాహకులకు కష్టంగా మారేది. అంతే కాకుండా రోజు రోజుకు కూరగాయల ధరలు పెరిగిపోతుండడం, దానికి అనుగుణంగా మధ్యాహ్నభోజన ధరలు పెరగక పోవడంతో నాణ్యమైన ఆహారాన్ని అందించలేని పరిస్థితి ఉండేది. ఉత్తర్వులు రాలేదు ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ మరింత మెరుగవుతుంది. పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అనే యోచన చేస్తుంది. ఇది అమలయితే మరింత బాగుంటుంది. అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఒకవేళ వస్తే అమలు చేస్తాం. –యోసెఫ్, ఎంఈవో, సదాశివనగర్ -
పరిగడుపు.. చదువులు!
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు పరిగడుపుతోనే ప్రత్యేక క్లాస్‌లకు హాజరవుతున్నారు. విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ప్రతి ఏటా 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా పాఠశాల ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఈ సందర్భాల్లో విద్యార్థులకు ఆకలివేయకుండా ఉండేందుకు స్నాక్స్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈసారి దాతలు కొరవడడంతో పరిగడుపుతోనే విద్యార్థులు ప్రత్యేక క్లాసులకు హాజరవుతున్నారు. 2018–19 విద్యాసంవత్సరానికి సంబంధించి అక్టోబర్ మాసం నాటికే సిలబస్ పూర్తయ్యింది. దీంతో రివిజన్ కార్యక్రమాలు చేపడుతూ ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులను నిర్వహిస్తూ పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 230 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 13,989 మంది విద్యార్థులుపదవ తరగతి చదువుతున్నారు. అందులో బాలురు 6,528 మంది, బాలికలు 7,461 మంది ఉన్నారు. పాఠశాలల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధిం చాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉదయం తరగతులకు హాజరయ్యే సందర్భం లోనే టిఫిన్, ఇతర స్నాక్స్ పెడుతుండడంతో బాక్స్ తెచ్చుకొని పాఠశాలలో తింటున్నారు. కానీ గ్రామాలనుంచి వచ్చే వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8.30 గంటలకే తరగతులు ప్రారంభమవుతుండడంతో ఇంటివద్ద నుంచి 6గంటలకే బయలుదేరుతున్నారు. అప్పటికి ఇంట్లో వంట అయితే సరి. లేదంటే తినకుండానే తరగతులకు హాజరవుతున్నారు. ఆకలి మంటతో తరగతులు వింటుండడంతో చదువు వంట పట్టని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం భోజనం పెట్టే వరకు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రేయర్‌లోనే కిందపడిపోతున్న వైనం రోజూ ఉదయం ప్రేయర్ సందర్భంలో బాలురు, బాలికలు కింద పడి పోతున్నారు. ప్రేయర్ దాదాపు 20 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఆ సందర్భంలో కొందరు కింద పడిపోతున్నా రు. ఆ విషయం ఉపాధ్యాయులు ఆరా దీసిన సందర్భంలో అన్నం తినిరాలేదు అంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయంటూ ఓ విద్యాశాఖ అధికారి పేర్కొంటున్నారు. గతేడాది స్నాక్స్ ఏర్పాటు గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే వారి కోసం స్నాక్స్ ఏర్పాటు చేశారు. కానీ ఈ సారి దాతలు ముందుకు రాకపోవడంతో ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. గత సంవత్సరం కూడా స్నాక్స్ విషయంలో 60 శాతం మా త్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయి. కొన్ని పాఠశాలలో హెడ్మాస్టర్లు జేబు ల్లోనుంచి ఖర్చు చేశారు. వారికి ఇంత వరకూ బిల్లులు అందని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో 20, 30 మందే ఉంటారు. కానీ పెద్ద పాఠశాలల్లో 100మందికి పైనే ఉన్నారు. అలాంటి సమయంలో స్నాక్స్ విషయంలో అధికంగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కలెక్టర్ చొరవ చూపాలి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే వారి విషయంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని పలువురు కోరుకుంటున్నారు. దాతల నుంచి స్నాక్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తినకుండానే వస్తున్నా... ఉదయమే ప్రత్యేక తరగతులు ఉంటున్నాయి. చందనపల్లి నుంచి బస్సుకు రావాలంటే నేను ఉదయం ఆరు ఆరున్నరకే బయలుదేరాలి. ఆ సమయానికి ఇంట్లో వంట కావడం లేదు. తినకుండానే స్కూల్‌కు వస్తున్నా. చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం భోజనం పెట్టే వరకు ఆకలి బాగా అవుతుంది. సాయంత్రం 6గంటల వరకు క్లాసులు జరుగుతున్నాయి. ఇంటికి వెళే వరకే 7 గంటలు అవుతుంది. ఆకలి వేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. – దివ్య, చందనపల్లి తినొస్తే లేటవుతుంది.. తిప్పర్తి మండలం సర్వాయిగూడెం మాది. రోజూ తిని స్కూల్‌కు రావాలంటే ఆలస్యం అవుతుంది. తినకుండా వస్తే మధ్యాహ్నం వరకు ఆకలి బాగా అవుతుంది. నా ఒక్కడి కోసం ఇంట్లో వండాలంటే ఇబ్బంది అవుతుంది. ఆకలిని ఓర్చుకోక తప్పడంలేదు. చదువుకోవాలి కాబట్టి ఇబ్బందైతే తప్పడంలేదు. – మహేశ్, సర్వాయిగూడెం -
మధ్యాహ్నం.. అర్ధాకలి
వేడి నీళ్ళను తలపించే సాంబారు... రుచీ పచీ లేని అన్నం.. కనీసం తాలింపు కూడా లేని కూరలుతినలేక విద్యార్థులు నరకం చూస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నందున పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు క్యారేజీ పెట్టకుండా పంపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తీరు చూసి కొందరు విద్యార్థులు అన్నం తినకుండానే ఆకలితో ఉండిపోతున్నారు. పశ్చిమగోదావరి, నిడదవోలు: ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణా లోపాలు పిల్లలకు శాపంగా పరిణమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 33 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 7,361 మంది విద్యార్థులకు ప్రభుత్వం భోజనం అందిస్తోంది. ఆశయం మంచిదే అయినప్పటికీ పథకం నిర్వహణ తీరు మాత్రం అగమ్యగోచరంగా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవీ నిబంధనలు : ఇంటర్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 996 క్యాలరీల ఆహారం మధ్యాహ్న భోజనంలో అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు కేటాయించింది. ఈ మేరకు కళాశాలల సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి మ«ధ్యాహ్న భోజన పథకం వంట ఏజన్సీల నిర్వాహకులు వండి పెట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇంటర్ విద్యార్థులకు కూడా అక్కడే తయారు చేసి కళాశాలలకు అందించాలని సూచించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పెడుతున్న మెనూ ప్రకారం రోజుకు రూ.6.18 పైసలుమధ్యాహ్న భోజనానికి ఖర్చు చేస్తున్నారు. అయితే జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా హైస్కూల్ విద్యార్థికి కేటాయించిన 150 గ్రాముల బియ్యాన్ని కేటాయించడంతో వారికి భోజనం సరిపోవడం లేదని అంటున్నారు. ఏజన్సీ నిర్వాహకులు కూడా ఒక్కో విద్యార్థికి పావు కేజీ బియ్యాన్ని అందించాలని కోరుతున్నారు. అసలు ఇంటర్ విద్యార్థులకు ఎంత కేటాయించాలో నిర్దిష్టమైన విధి విధానాలు ఇప్పటి వరకు అధికారులకు అందలేదు. మరో వైపు కళాశాలల ప్రిన్సిపల్స్ రోజూ విద్యార్థుల హాజరు సేకరించి వారి వివరాలను పంట చేసే స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అందించాలి. హెచ్ఎంలు నిర్వాహకులచే వంట వండించి కళాశాలలకు చేరవేయాలి. నాణ్యతకు తిలోదకాలు మ«ధ్యాహ్న భోజన పథకం వంట ఏజన్సీల ద్వారా పంపిస్తున్న ఆహారం నాణ్యతగా ఉండటం లేదని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. నాసిరకం బియ్యంతో అన్నం వండితే అది చిమిడి ముద్దయిపోతోంది. వారానికి మూడు రోజులు గుడ్డు, సాంబారు, మూడు రోజులు పప్పుతో ఆకుకూరలు పెట్టాలని ఆదేశించారు. ఏజెన్సీలు మాత్రం గుడ్డును తూతూ మంత్రంగా ఉడికీ ఉడకనట్టు పంపించేస్తున్నారు. గుడ్డును ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేసి పంపించాల్సి ఉండగా ఎక్కడా పాటించటం లేదు. దీంతో గుడ్డును తిన్న విద్యార్థులకు కడుపు నొప్పి వస్తోందని వాపోతున్నారు. సాంబారులో కనీసం 10 గ్రాముల కందిపుప్ప కూడా కనిపించకుండా నీళ్ళను తలపించే సాంబారును పంపిస్తున్నారు. సాంబారును చూస్తే వేడి నీళ్ళా అని సందేహం రాకమానదు. సాంబారు కాసేటప్పుడు కనీస నాణ్యత, రుచి ఉండకుండా తక్కువ పప్పుతో తయారు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇది తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలల్లో వండించడం భారంగా ఉందని పలువురు హెచ్ఎంలు వాపోతున్నారు. అంతే కాకుండా సరైన గదులు, వంట పాత్రలు లేకపోవడం, గ్యాస్ కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు కాకపోవడం, వంట సరుకులు కొనుగోలు కోసం పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని వంట ఏజన్సీ నిర్వాహకులు హెచ్‌ఎంలపై ఒత్తిడి పెంచుతున్నారు. సకాలంలో బిల్లులు అందక , కిరాణా షాపుల్లో అప్పులు చేసి పథకాన్ని నిర్వహించడం వల్ల తమకు నష్టమే కానీ ఎటువంటి లాభదాయకం కాదని నిర్వాహకులు చెబుతున్నారు. సాంబారు రుచిగా ఉండటం లేదు మా కళాశాలలో ఆగస్టు నుంచి మధ్యాహ్న సమయంలో భోజనం పెడుతున్నారంటే ఎంతో ఆనందపడ్డాం. ఇంటి నుండి బాక్సులు తీసుకువచ్చే పనిలేదని అనుకున్నాం. భోజనం చాలా అధ్వానంగా ఉంటోంది. సాంబారు నీళ్ళుగా ఉంటుంది. రుచి లేకుండా ఎలా తినాలి.– కె.కరుణ, ఇంటర్ సెకండియర్, నిడదవోలు ఉడకని గుడ్డు పెడుతున్నారు భోజనాలు చేసేటప్పుడు ఇచ్చే గుడ్లు ఉడ కటం లేదు. అన్నం చిమిడి పోతోంది. గుడ్లు వేయించకుండా ఉడకబెట్టి మాకు ఇస్తున్నారు. అన్నం సాంబారు కనీసం నోట్లో కూడా పెట్టబుద్ది కావడంలేదు. రుచిగా ఉన్న ఆహారం ఎప్పుడూ పెట్టలేదు. భోజనాలకు మాకు ఫ్లేట్లు కూడా ఇవ్వడం లేదు.– పి.జ్యోతిర్మయి, ఇంటర్ సెకండియర్, నిడదవోలు -
మధ్యహ్న భోజన పథకంలో గుడ్ల కుంభకోణం
-
అప్పు చేసి.. కోడి కూర!
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ‘సంక్షేమం’ గుర్తుకొస్తోంది. ఇది అందరూ అనుకుంటున్న మాట. అందులోభాగంగా జూలై 1వ తేదీ నుంచి హాస్టల్ విద్యార్ధుల డైట్ బిల్లులను పెంచారు. కొత్త మెనూను అమలు చేస్తున్నారు. ఆ ప్రకారం మెనూలో భాగంగా విద్యార్ధులకు వారానికి మూడుసార్లు కోడి కూరను వడ్డిస్తున్నారు. అయితే నెలల తరబడి బిల్లులు అందకపోవడంతో కొత్త మెనూ అమలు కష్టతరంగా మారింది. వార్డెన్లు అప్పులు చేసి ఖర్చుపెట్టాల్సి రావడంతో ఇబ్బందులుపడుతున్నారు. కడప నగరంలోని ఒక హాస్టల్లో 100మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఆ హాస్టల్ హెచ్‌డబ్ల్యూఓ (వార్డెన్)కు దాదాపుగా నాలుగు నెలలకు సంబంధించిన రూ 3.50లక్షలకు పైగా డైట్ బిల్లులు అందలేదు. దీంతో ఆయన అప్పులు చేసి హాస్టల్‌ను నెట్టుకొస్తున్నారు. రాయచోటిలోని ఓ హాస్టల్లో 150మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న హెచ్‌డబ్ల్యూఓకు ఎంత లేదన్న ఒక నెలకు రూ.1.35లక్షలకుపైగా డైట్ బిల్లులు రావాలి. ఈ బిల్లులు రాకపోవడంతో అతను తెలిసిన వారినల్లా అప్పులడుగుతున్నారు. కష్టంగా మెనూ అమలు చేస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్న 139 మంది ప్రభుత్వ ఎస్సీ, బీసీ హాస్టల్ హెచ్‌డబ్ల్యూఓలు ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమందికి అప్పులు పుట్టక అవస్థలు పడుతున్నారు. పౌష్టికాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లు ముందస్తుగా నిధులు, ఏర్పాట్లు చేయాల్సిన విషయం మరిచిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప రూరల్: జిల్లావ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో (3 నుంచి 10వ తరగతి వరకు) 81 హాస్టళ్లు ఉన్నాయి. వీటిల్లో 8వేలమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 58 హాస్టళ్లలో 5వేలమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టళ్లలో ప్రవేశాలు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా గడిచిన ఏడాది కూడా ఇంచుమించు ఇదే సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. తాజాగా విద్యార్థుల డైట్ బిల్లులు రాకపోవడంతో వారికి మెనూను అమలుచేయాలంటే హెచ్‌డబ్ల్యూఓలకు తలనొప్పిగా మారింది. మార్చి నుంచి అందని బిల్లులు పాత తేదీ బిల్లుల ప్రకారం (జూలై 1వ తేదీకి ముందు) ఒక విద్యార్థికి 3 నుంచి 8వ తరగతి వరకు ఒక నెలకు రూ.750 ప్రకారం మెనులో భాగంగా చెల్లించేవారు. అలాగే 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు రూ.850 కేటాయించారు. గడిచిన జూలై 1వ తేదీ నుంచి కొత్త డైట్ బిల్లులు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ఒక నెలకు 3, 4వ తరగతి విద్యార్థులకు రూ.1,000, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,200 చొప్పున చెల్లిస్తున్నారు. మెనూలో భాగంగా ఒకవారంలో బియ్యంతో కలిపి మొత్తం 23రకాల నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి, విద్యార్థులకు వడ్డించాలి. ఈ మెనూలో చేసిన మార్పుల కారణంగా విద్యార్థులకు ప్రధానంగా ఒక వారంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం చికెన్ కూరను వడ్డించాలి. అంతవరకు బాగానే ఉంది. సాధారణంగా విద్యార్థులకు మెనూను సక్రమంగా అమలుచేయాలంటే క్రమంతప్పకుండా బిల్లులు అందాలి. అలా అందినప్పుడు పౌష్టికాహరం సక్రమంగా అందుతుంది. అయితే గడిచిన మార్చి నుంచి నేటి వరకు డైట్ బిల్లులు హెచ్‌డబ్ల్యూఓలకు అందలేదు. విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు ఆధారంగా హెచ్డబ్ల్యూలకు బిల్లులు అందుతాయి. కొందరికి మాత్రమే మార్చిలో బిల్లులందాయి. చాలామందికి ఏప్రిల్ నెల నుంచి బిల్లులు అందాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఒక హాస్టల్లో 100మంది విద్యార్థులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక హస్టల్లో 50 మంది విద్యార్థులు ఉన్నారనుకుంటే, ఒక నెలకు ఆ హాస్టల్ హెచ్‌డబ్ల్యూఓకు దాదాపు రూ.50 వేలకుపైగానే రావాలి. రాయచోటి, పులివెందుల తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య విపరీతంగా ఉంది. కొన్ని హాస్టళ్లలో 150మందికిపైగా ఉంటున్నారు. ఇలాంటి చోట ఒక నెలకు రూ.లక్షకు పైగా బిల్లు రావాల్సి ఉంటుంది. సీఎఫ్ఎంఎస్ విధానం కారణంగా... బిల్లుల చెల్లింపులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్స్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ నూతన విధానం కారణంగా మెనూకు సంబంధించిన ప్రతి బిల్లును సీఎఫ్ఎంఎస్ ఆన్లైన్లో పొందుపరచాలి. ఇది కష్టతరంగా మారింది. విజయవాడ స్థాయిలోనే ఈ నూతన విధానం పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో తిప్పలు తప్పడంలేదు. దీంతో హెచ్‌డబ్ల్యూఓలకు బిల్లులు పాస్ కావడం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.2.78కోట్లకుపైగా డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు చికెన్ ముక్కలు..ఆరు గెరిటల పులుసు...! దాదాపు 1987 వరకు హాస్టళ్లలో ఆదివారం మధ్యాహ్నం మాంసంను వడ్డించేవారు. ఒక కిలో మాంసంను 10మంది విద్యార్థులకు పెట్టేవారు. ఈ మాంసం వంటకం కారణంగా అప్పుడు హాస్టల్ సిబ్బంది వంటగదిని బార్లుగా మార్చారు. దీనికి తోడు పిల్లలకు సరిగా ముక్కలు పడేవి కావు. తదితర ఆరోపణలు కారణంగా నాడు మెనూ నుంచి మాంసంను తీసి వేశారు. దీనిపై విమర్శలు వచ్చాయి. పిల్లలకు బలమైన పౌష్టికాహారం అందడం లేదని ఆరోపణలు వచ్చాయి. మరి కొన్నాళ్లకు కొద్దిరోజుల పాటు చికెన్‌ను వడ్డించారు. కొద్దిరోజులకే అది కూడా మెనూ నుంచి వైదొలగింది. తాజాగా ప్రభుత్వం చికెన్‌ను తీసుకొచ్చింది. కాగా ఒక కిలో చికెన్‌ను ఎంతమంది విద్యార్థులకు వడ్డించాలనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. మెనూలో మాత్రం ఒక విద్యార్థికి ఒకసారికి 80 గ్రాములను వడ్డించాలని ఉంది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని హెచ్‌డబ్ల్యూఓలు అంటున్నారు. సాధారణంగానే మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త మెనూలోని ‘కోడి కూర’కు బిల్లుల గండం ఎదురైంది. కొంతమంది హెచ్‌డబ్ల్యూఓలు అప్పులు చేసి చికెన్‌తో పాటు ఇతర ఆహారాన్ని అందిస్తున్నారు. మరి కొంతమంది మూడు చికెన్ ముక్కలు..ఆరు గెరిటెల పులుసు అనే తరహాలో సర్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్లులు పాస్ కాని కారణంగా చాలామంది హెచ్‌డబ్ల్యూఓలకు సరుకులు సరఫరా చేసే దుకాణదారులే అప్పు ఇచ్చి ఆదుకుంటున్నారు. మొత్తం మీద బిల్లులు అందకపోవడంతో అప్పు చేసి పప్పుకూడును అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో మెనులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ ఉంది.. డైట్ బిల్లులకు పుష్కలంగా నిధులు ఉన్నాయి. కొత్త విధానం కారణంగా బిల్లులు పాస్ కావడంలో కాస్త జాప్యం జరుగుతోంది. కొంతమందికి రెండు నెలల బిల్లులు మాత్రమే అందాల్సి ఉంది. మా హెచ్‌డబ్ల్యూఓలు మెనూను సక్రమంగా అమలుచేస్తున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటు పడుతున్నారు. –సరస్వతి, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ -
పిల్లల తిండికి ‘ఆధార్’ అడ్డంకి
సంక్షేమ పథకాలకూ, ఆధార్ కార్డులకూ ముడిపెట్టొద్దని సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు చెప్పినా మన ప్రభుత్వాలకు లక్ష్యం లేదు. రేషన్ ఇవ్వడం దగ్గరనుంచి ఉపాధి హామీ పథకం వరకూ... పెన్షన్ల మొదలుకొని ఆరోగ్యపథకాల వరకూ అన్ని టికీ దాన్ని ముడిపెట్టడం ఆగలేదు. తాజాగా మధ్యాహ్న భోజన పథకం కూడా అందులో చేరింది. ఆధార్ కార్డు వివరాలు అందజేయలేని పిల్లలకు జూన్ 30 తర్వాత బడుల్లో మధ్యాహ్న భోజనం పెట్టొద్దంటూ కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి మంత్రిత్వ శాఖ వారం రోజులక్రితం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ చర్య ద్వారా కుటుంబం ఆధార్ తెచ్చుకునేలా ఒత్తిడి తీసుకొచ్చే భారాన్ని ప్రభుత్వం పిల్లలపై మోపింది. అయితే ఆధార్ లేనంతమాత్రాన మధ్యాహ్న భోజనం నిరా కరించబోమని కేంద్రం వివరణనిస్తోంది. పిల్లలకు ఆధార్ నంబర్ వచ్చేవరకూ దీన్ని అమలు చేస్తామంటోంది. ఆధార్ నమోదుకు వివరాలు అందజేసినట్టు స్లిప్ ఇచ్చినా, వేరేచోట ఈ పథకాన్ని వినియోగించుకోవడం లేదని తల్లిదండ్రులు హామీ పత్రం ఇచ్చినా దీన్ని కొనసాగిస్తామంటోంది. మధ్యాహ్న భోజన పథకం వల్ల దేశంలో 10 కోట్లమందికి పైగా పిల్లలు లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల ఇతరత్రా ఎలాంటి సత్ఫలితాలు వస్తున్నాయో అందరికీ తెలుసు. పథకం అమలు ప్రారంభించాక గ్రామసీమల్లోని నిరుపేద కుటుంబాల వారు తమ సంతానాన్ని బడిబాట పట్టిస్తున్నారు. అంతక్రితం పిల్లల్ని కూలి పనులకు పంపడం, జీతగాళ్లుగా ఉంచడం, తమతోపాటు పనులకు తీసుకెళ్లడం లాంటివి చేసిన ఆ కుటుంబాలు కనీసం ఒక్క పూటైనా పిల్లలకు కడుపుకింత తిండి దొరుకుతుందని సంతోషపడ్డారు. ఈ పథకం వల్ల ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. అంతవరకూ అక్షరానికి దూరంగా ఉన్న పిల్లలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ చదువుపై ధ్యాస పెడుతున్నారు. వారికి పౌష్టికాహారం అందుతోంది. ఇందువల్ల వ్యాధులబారిన పడే స్థితి తగ్గుతుంది. వారు శారీరకంగా, మానసికంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. భిన్న కులాల, వర్గాల పిల్లలు రోజూ సహపంక్తి భోజనం చేయడం వల్ల వారి మధ్య స్నేహం, సుహృద్భావం ఏర్ప డతాయి. మన జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారమైనా, 2001లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పయినా మధ్యాహ్న భోజనం పొందడం పిల్లల హక్కు అని చెబుతు న్నాయి. ఆధార్ మెలిక ఈ రెండింటి స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది. ఈ నోటిఫికేషన్ ఇచ్చినవారికి ఆధార్ కార్డులేని పిల్లల పరిస్థితేమిటన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. తోటి పిల్లలంతా కడుపు నిండా తింటుంటే తాము పస్తు ఉండాల్సిరావడం లేత మనసులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వారికి తట్టలేదు. అంతంతమాత్రం ఆదాయంతో అమ్మానాన్నలు పిల్లలకు మంచి తిండి పెట్టలేరు. వారికి రోజూ మెరుగైన ఆహారం లభ్యమయ్యేది కేవలం మధ్యా హ్నం పూట బడిలో దొరికే భోజనం వల్లనే. ఇది నిజంగా వారికి దక్కుతున్నదా అన్న అనుమానం పాలకులకు వచ్చినట్టుంది. అది తెలుసుకోవడానికి ఇతరేతర మార్గాలు చాలా ఉన్నాయి. బడులకు అందాల్సిన ఆహారపదార్థాలు సరిగా అందు తున్నాయో లేదో... పాఠశాలల్లో పిల్లల సంఖ్యకూ, హాజరుపట్టీల్లోని సంఖ్యకూ పొంతన ఉందో లేదో... నిర్దేశించిన పరిమాణంలో, ప్రమాణాల్లో పిల్లలకు ఆహారం అందుతున్నదో లేదో ఆరా తీయడం అవసరమే. తరచు జరిపే ఆకస్మిక తనిఖీల ద్వారా ఇవన్నీ నెరవేరతాయి. ఎప్పటికప్పుడు కఠిన చర్యలకు ఉపక్రమిస్తుంటే పరి స్థితి మెరుగవుతుంది. నిధుల దుర్వినియోగం ఆగుతుంది. పిల్లల కడుపు కొడదా మని చూసే స్వాహారాయుళ్ల ఆటలు సాగకుండా ఉంటాయి. నిజానికి ఈ పథకం అమలులో పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి ఆధార్ వల్ల దారికొచ్చేవి కాదు. వంట చేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్న కనీస ఆలోచన ప్రభు త్వాలకు ఉండటం లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మినహా మిగిలిన రాష్ట్రాలు ఈ సంగతిని పట్టించుకోవడం లేదు. వంట గదులు లేని బడులు, మంచినీరు సమ కూర్చలేని బడులు ఇప్పటికీ ఉన్నాయి. ఇతరత్రా మౌలిక సదుపాయాల గురించి, పరిశుభ్రత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. పిల్లలకు ఆధార్ తప్పనిసరి చేయడంవల్ల వచ్చే ఇతరత్రా సమస్యలున్నాయి. పదిహేనేళ్ల వయసు వచ్చేవరకూ వేలిముద్రలు సరిగా అభివృద్ధి కావు. కనుక సేక రించిన బయోమెట్రిక్ వివరాలు నిలకడగా ఉండవు. పెరిగే వయసుకు తగినట్టు అవి మారిపోతాయి. ఇలా మారినప్పుడల్లా వారికి తిండి పెట్టాలో, లేదో అర్ధంకాని స్థితి ఏర్పడుతుంది. పాఠం చెప్పే టీచర్‌కు ఆ విద్యార్థి తెలుస్తాడు. కానీ బయో మెట్రిక్ యంత్రం గుర్తించదు. అలాంటి సందర్భంలో ఆ విద్యార్థి చేతికి కంచం ఇవ్వాలో లేదో తేల్చేదెవరు? పైగా ఆధార్ వల్ల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలుగుతుందన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎదుట విచారణ సాగుతోంది. ఆ పథకం పూర్తిగా స్వచ్ఛందమైనదని, పౌరుల అంగీకారంతోనే వివ రాలు సేకరిస్తున్నామని,వాటిని వినియోగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పిల్లలు ఆధార్ తెచ్చుకోవాలంటూ పెట్టిన తాజా నిబంధన సుప్రీంకోర్టుకిచ్చిన ఈ హామీని ఉల్లంఘించడం లేదా? మైనారిటీ తీరని పిల్లలు స్వచ్ఛందంగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలుగుతారా? వారు తమంత తామే అందుకు సిద్ధపడ్డారని చెబితే అసలు చెల్లుతుందా? వీటి సంగతలా ఉంచి ఆధార్ అను సంధానం వల్ల ఆ పథకానికి కొత్తగా ఏర్పడే పారదర్శకత, అదనంగా వచ్చే సామర్థ్యం ఏముంటాయి? ఒకపక్క ఆధార్‌ను రేషన్ అందజేయడానికి, గ్యాస్ సిలెండర్ల పంపిణీకి మాత్రమే వినియోగించాలని 2015లో సుప్రీంకోర్టు నిర్దేశించినప్పుడు సరేనన్న ప్రభుత్వం ఆ తర్వాత స్కాలర్షిప్లు మొదలుకొని పెన్షన్ల వరకూ ఎన్నిటికో వర్తింపజేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా వాటికి మరో 30 పథకాలను జత చేసింది. ప్రభుత్వాలే ఇలా న్యాయస్థానాలకిచ్చిన హామీలను ఉల్లంఘించడం తగునా? జాబితా నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని తొలగిం చడం తక్షణావసరం. ఆ పథకాన్ని మరింత సమర్థవంతంగా, మెరుగ్గా అమలు చేయడం ముఖ్యం.