సాంబారులో కనీసం పప్పు కనిపించని వైనం
వేడి నీళ్ళను తలపించే సాంబారు... రుచీ పచీ లేని అన్నం.. కనీసం తాలింపు కూడా లేని కూరలుతినలేక విద్యార్థులు నరకం చూస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నందున పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు క్యారేజీ పెట్టకుండా పంపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తీరు చూసి కొందరు విద్యార్థులు అన్నం తినకుండానే ఆకలితో ఉండిపోతున్నారు.
పశ్చిమగోదావరి, నిడదవోలు: ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణా లోపాలు పిల్లలకు శాపంగా పరిణమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 33 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 7,361 మంది విద్యార్థులకు ప్రభుత్వం భోజనం అందిస్తోంది. ఆశయం మంచిదే అయినప్పటికీ పథకం నిర్వహణ తీరు మాత్రం అగమ్యగోచరంగా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ నిబంధనలు : ఇంటర్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 996 క్యాలరీల ఆహారం మధ్యాహ్న భోజనంలో అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు కేటాయించింది. ఈ మేరకు కళాశాలల సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి మ«ధ్యాహ్న భోజన పథకం వంట ఏజన్సీల నిర్వాహకులు వండి పెట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇంటర్ విద్యార్థులకు కూడా అక్కడే తయారు చేసి కళాశాలలకు అందించాలని సూచించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పెడుతున్న మెనూ ప్రకారం రోజుకు రూ.6.18 పైసలుమధ్యాహ్న భోజనానికి ఖర్చు చేస్తున్నారు. అయితే జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా హైస్కూల్ విద్యార్థికి కేటాయించిన 150 గ్రాముల బియ్యాన్ని కేటాయించడంతో వారికి భోజనం సరిపోవడం లేదని అంటున్నారు. ఏజన్సీ నిర్వాహకులు కూడా ఒక్కో విద్యార్థికి పావు కేజీ బియ్యాన్ని అందించాలని కోరుతున్నారు. అసలు ఇంటర్ విద్యార్థులకు ఎంత కేటాయించాలో నిర్దిష్టమైన విధి విధానాలు ఇప్పటి వరకు అధికారులకు అందలేదు. మరో వైపు కళాశాలల ప్రిన్సిపల్స్ రోజూ విద్యార్థుల హాజరు సేకరించి వారి వివరాలను పంట చేసే స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అందించాలి. హెచ్‌ఎంలు నిర్వాహకులచే వంట వండించి కళాశాలలకు చేరవేయాలి.
నాణ్యతకు తిలోదకాలు
మ«ధ్యాహ్న భోజన పథకం వంట ఏజన్సీల ద్వారా పంపిస్తున్న ఆహారం నాణ్యతగా ఉండటం లేదని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. నాసిరకం బియ్యంతో అన్నం వండితే అది చిమిడి ముద్దయిపోతోంది. వారానికి మూడు రోజులు గుడ్డు, సాంబారు, మూడు రోజులు పప్పుతో ఆకుకూరలు పెట్టాలని ఆదేశించారు. ఏజెన్సీలు మాత్రం గుడ్డును తూతూ మంత్రంగా ఉడికీ ఉడకనట్టు పంపించేస్తున్నారు. గుడ్డును ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేసి పంపించాల్సి ఉండగా ఎక్కడా పాటించటం లేదు. దీంతో గుడ్డును తిన్న విద్యార్థులకు కడుపు నొప్పి వస్తోందని వాపోతున్నారు. సాంబారులో కనీసం 10 గ్రాముల కందిపుప్ప కూడా కనిపించకుండా నీళ్ళను తలపించే సాంబారును పంపిస్తున్నారు. సాంబారును చూస్తే వేడి నీళ్ళా అని సందేహం రాకమానదు. సాంబారు కాసేటప్పుడు కనీస నాణ్యత, రుచి ఉండకుండా తక్కువ పప్పుతో తయారు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇది తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు
కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలల్లో వండించడం భారంగా ఉందని పలువురు హెచ్‌ఎంలు వాపోతున్నారు. అంతే కాకుండా సరైన గదులు, వంట పాత్రలు లేకపోవడం, గ్యాస్ కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు కాకపోవడం, వంట సరుకులు కొనుగోలు కోసం పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని వంట ఏజన్సీ నిర్వాహకులు హెచ్‌ఎంలపై ఒత్తిడి పెంచుతున్నారు. సకాలంలో బిల్లులు అందక , కిరాణా షాపుల్లో అప్పులు చేసి పథకాన్ని నిర్వహించడం వల్ల తమకు నష్టమే కానీ ఎటువంటి లాభదాయకం కాదని నిర్వాహకులు చెబుతున్నారు.
సాంబారు రుచిగా ఉండటం లేదు
మా కళాశాలలో ఆగస్టు నుంచి మధ్యాహ్న సమయంలో భోజనం పెడుతున్నారంటే ఎంతో ఆనందపడ్డాం. ఇంటి నుండి బాక్సులు తీసుకువచ్చే పనిలేదని అనుకున్నాం. భోజనం చాలా అధ్వానంగా ఉంటోంది. సాంబారు నీళ్ళుగా ఉంటుంది. రుచి లేకుండా ఎలా తినాలి.– కె.కరుణ, ఇంటర్ సెకండియర్, నిడదవోలు
ఉడకని గుడ్డు పెడుతున్నారు
భోజనాలు చేసేటప్పుడు ఇచ్చే గుడ్లు ఉడ కటం లేదు. అన్నం చిమిడి పోతోంది. గుడ్లు వేయించకుండా ఉడకబెట్టి మాకు ఇస్తున్నారు. అన్నం సాంబారు కనీసం నోట్లో కూడా పెట్టబుద్ది కావడంలేదు. రుచిగా ఉన్న ఆహారం ఎప్పుడూ పెట్టలేదు. భోజనాలకు మాకు ఫ్లేట్లు కూడా ఇవ్వడం లేదు.– పి.జ్యోతిర్మయి, ఇంటర్ సెకండియర్, నిడదవోలు
Comments
Please login to add a commentAdd a comment