నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు పరిగడుపుతోనే ప్రత్యేక క్లాస్‌లకు హాజరవుతున్నారు. విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ప్రతి ఏటా 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా పాఠశాల ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఈ సందర్భాల్లో విద్యార్థులకు ఆకలివేయకుండా ఉండేందుకు స్నాక్స్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈసారి దాతలు కొరవడడంతో పరిగడుపుతోనే విద్యార్థులు ప్రత్యేక క్లాసులకు హాజరవుతున్నారు. 2018–19 విద్యాసంవత్సరానికి సంబంధించి అక్టోబర్ మాసం నాటికే సిలబస్ పూర్తయ్యింది. దీంతో రివిజన్ కార్యక్రమాలు చేపడుతూ ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులను నిర్వహిస్తూ పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 230 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 13,989 మంది విద్యార్థులుపదవ తరగతి చదువుతున్నారు.
అందులో బాలురు 6,528 మంది, బాలికలు 7,461 మంది ఉన్నారు. పాఠశాలల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధిం చాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉదయం తరగతులకు హాజరయ్యే సందర్భం లోనే టిఫిన్, ఇతర స్నాక్స్ పెడుతుండడంతో బాక్స్ తెచ్చుకొని పాఠశాలలో తింటున్నారు. కానీ గ్రామాలనుంచి వచ్చే వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8.30 గంటలకే తరగతులు ప్రారంభమవుతుండడంతో ఇంటివద్ద నుంచి 6గంటలకే బయలుదేరుతున్నారు. అప్పటికి ఇంట్లో వంట అయితే సరి. లేదంటే తినకుండానే తరగతులకు హాజరవుతున్నారు. ఆకలి మంటతో తరగతులు వింటుండడంతో చదువు వంట పట్టని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం భోజనం పెట్టే వరకు ఆకలితో అలమటిస్తున్నారు.
ప్రేయర్‌లోనే కిందపడిపోతున్న వైనం
రోజూ ఉదయం ప్రేయర్ సందర్భంలో బాలురు, బాలికలు కింద పడి పోతున్నారు. ప్రేయర్ దాదాపు 20 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఆ సందర్భంలో కొందరు కింద పడిపోతున్నా రు. ఆ విషయం ఉపాధ్యాయులు ఆరా దీసిన సందర్భంలో అన్నం తినిరాలేదు అంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయంటూ ఓ విద్యాశాఖ అధికారి పేర్కొంటున్నారు.
గతేడాది స్నాక్స్ ఏర్పాటు
గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే వారి కోసం స్నాక్స్ ఏర్పాటు చేశారు. కానీ ఈ సారి దాతలు ముందుకు రాకపోవడంతో ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. గత సంవత్సరం కూడా స్నాక్స్ విషయంలో 60 శాతం మా త్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయి. కొన్ని పాఠశాలలో హెడ్‌మాస్టర్లు జేబు ల్లోనుంచి ఖర్చు చేశారు. వారికి ఇంత వరకూ బిల్లులు అందని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో 20, 30 మందే ఉంటారు. కానీ పెద్ద పాఠశాలల్లో 100మందికి పైనే ఉన్నారు. అలాంటి సమయంలో స్నాక్స్ విషయంలో అధికంగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
కలెక్టర్ చొరవ చూపాలి
గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే వారి విషయంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని పలువురు కోరుకుంటున్నారు. దాతల నుంచి స్నాక్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
తినకుండానే వస్తున్నా...
ఉదయమే ప్రత్యేక తరగతులు ఉంటున్నాయి. చందనపల్లి నుంచి బస్సుకు రావాలంటే నేను ఉదయం ఆరు ఆరున్నరకే బయలుదేరాలి. ఆ సమయానికి ఇంట్లో వంట కావడం లేదు. తినకుండానే స్కూల్‌కు వస్తున్నా. చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం భోజనం పెట్టే వరకు ఆకలి బాగా అవుతుంది. సాయంత్రం 6గంటల వరకు క్లాసులు జరుగుతున్నాయి. ఇంటికి వెళే వరకే 7 గంటలు అవుతుంది. ఆకలి వేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. – దివ్య, చందనపల్లి
తినొస్తే లేటవుతుంది..
తిప్పర్తి మండలం సర్వాయిగూడెం మాది. రోజూ తిని స్కూల్‌కు రావాలంటే ఆలస్యం అవుతుంది. తినకుండా వస్తే మధ్యాహ్నం వరకు ఆకలి బాగా అవుతుంది. నా ఒక్కడి కోసం ఇంట్లో వండాలంటే ఇబ్బంది అవుతుంది. ఆకలిని ఓర్చుకోక తప్పడంలేదు. చదువుకోవాలి కాబట్టి ఇబ్బందైతే తప్పడంలేదు. – మహేశ్, సర్వాయిగూడెం
Comments
Please login to add a commentAdd a comment