గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం | Tribal woman to commit suicide | Sakshi
Sakshi News home page

గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం

Published Sat, Mar 5 2016 2:43 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం - Sakshi

గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం

నర్రవాడ పీహెచ్‌సీలో అందని వైద్యం
ఉదయగిరిలో మృత్యువుతో
పోరాడి ఓడిన వైనం

 
 ఉదయగిరి : భర్తకు తెలియకుండా అప్పు చేసిన ఓ గిరిజన మహిళ భర్త మందలిస్తాడని భయపడి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాణాపాయంతో నర్రవాడ పీహెచ్‌సీకి వస్తే వైద్యం అందక మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టకు తార్కాణంగా మిగిలిన విషాద ఘటన శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. కలిగిరి మండలం నరసారెడ్డిపాళెంకు చెందిన కావేటి నాగరాజు, భార్య చెంచమ్మ(23) నాలుగు నెలల క్రితం పచ్చిశనగ పైరు వద్ద కాపలా కోసం దుత్తలూరు మండలం కమ్మవారిపాళెం వచ్చారు. పొలాల్లోనే కాపలా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చెంచమ్మ భర్తకు తెలియకుండా తన సోదరుడికి వేరే వారి వద్ద కొంత నగదు అప్పు ఇప్పించింది.

ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శుక్రవారం ఆమె వద్దకు వచ్చి కూతురిని మందలించారు. ఈ విషయం తెలిస్తే తన భర్త మందలిస్తాడన్న భయంతో పొలానికి పిచికారీ చేసేందుకు తెచ్చిన మోనోక్రొటోపాస్ పురుగు మందు తాగింది. అప్పుడే పొలం నుంచి వచ్చిన భర్త అపస్మారక స్థితిలో ఉన్న భార్యను గుర్తించి సమీపంలో ఉన్న నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తీసుకువచ్చాడు. అక్కడ ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉన్నా ఒక్కరూ లేరు. ఉన్న ఏఎన్‌ఎంలు కూడా ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయలేదు. కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లే స్థోమత లేని ఆ గిరిజనులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గంటకుపైగా వైద్యశాల ముందే ప్రాణం కాపాడాలంటూ ప్రాధేయపడ్డారు. కానీ వారిని కనికరించిన వైద్య సిబ్బంది లేరు.

అక్కడున్న వారు 108కు సమాచారం అందించడంతో రెండు గంటల ప్రాంతంలో 108 వచ్చింది. వారు సెలైన్ కట్టి వాహనంలో 2.50కి ఉదయగిరి సీహెచ్‌సికి తీసుకుచ్చారు. సీహెచ్‌సీలో వైద్యుడు సంధాని బాషా చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న మరో దంత వైద్యురాలి సాయంతో ఆమె ప్రాణాలు కాపాడేందుకు శతధా ప్రయత్నించారు. అప్పటికే పరిస్థితి విషమించిపోవడంతో 3.45 గంటల ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయింది. సరైన సమయంలో వైద్యం అందక ఆ పేద మహిళ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. మృతురాలికి ఏడాదిన్నర బిడ్డ ఉంది.

 సూపర్‌వాస్మోల్ తాగిన మరో మహిళ..
గిరిజన మహిళ ఓవైపు మృత్యువుతో పోరాడుతుండగానే సీతారామపురం మండలం నారాయణప్పపేటకు చెందిన మరో మహిళ షేక్ జానీ సూపర్‌వాస్మోల్ తాగడంతో 108 ద్వారా వైద్యశాలకు తీసుకుచ్చారు. వైద్యుడు ఒక్కరే ఉండటంతో ఇద్దరికీ ఒకేసారి చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. సహాయం చేసేందుకు ఏఎన్‌యంలు ఎవరూ లేకపోవడంతో వైద్యం అందించడంలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఆమెను ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు 108 ద్వారా తరలించారు. డ్యూటీలో ఉండవలసిన ఏఎన్‌ఎం తమ పై అధికారికి సమాచారం ఇవ్వకుండానే విధులకు గైర్హాజరు కావడంపై జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ సుబ్బారావును సాక్షి అడగ్గా విధులపట్ల నిర్లక్ష్యం వహించే వారిని క్షమించేది లేదన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యాధికారి నివేదిక ఇస్తే ఆమెపై చర్య తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement