ట్రిక్ షీట్‌లు | trick sheets | Sakshi
Sakshi News home page

ట్రిక్ షీట్‌లు

Published Wed, Feb 25 2015 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

trick sheets

సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్నదాత కష్టం దళారుల పాలు కాకూడదు. అందుకే దళారీ వ్యవస్థను నిర్మూలించాలనే ధాన్యం కొనుగోలు చేపడుతున్నాం. అంటూ ఊదరగొట్టిన అధికారులే ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో అక్రమాలకు ఆజ్యం పోశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు.. అడ్డదారులు తొక్కేందుకు మిల్లర్లకు మార్గాలను ఉపదేశించినట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో వడ్డించేవాడు మనోడైతే కడబంతిలో కూర్చున్నా.. అన్న చందాన మిల్లర్లు కూడా రెచ్చిపోయారు. అక్రమాలకు అధికారులే గేట్లెత్తారా? ట్రక్‌షీట్ల మాయాజాలంతో కోట్లాది రూపాయలు చేతులు మారా యా? అంటే జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలే బలపడుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 167 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేపట్టారు.
 
 మహిళలకే ఈ కొనుగోలు బాధ్యతలు అప్పగించామని చెబుతున్న అధికారులు చూసీ చూడనట్టు వదిలేయడంతో పాటు మిల్లర్లే ధాన్యం కొనుగోలు చేయడానికి వారికి అనువైన పరిస్థితులు కల్పించారు. దీంతో కొనుగోలులో అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది.ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినప్పటినుంచి మిల్లర్‌కు పంపించి డబ్బులు రైతులకు అందేందుకు కీలకమైన ట్రక్ షీట్ల వ్యవహారాన్ని సంతల్లో చీటీల్లా నచ్చినట్టు పంచేశారు. దీంతో పలువురు  మిల్లర్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వాస్తవానికి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమ ఉత్పత్తులను విక్రయించాలంటే ముందుగా తమ గుర్తింపు కార్డును తీసుకుని కొనుగోలు కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. రైతు తెచ్చిన గుర్తింపు కార్డును నమోదు చేసుకుని ఎంత మేర ధాన్యం తెస్తాడో తెలుసుకుని  ఆ మేరకు రైతుకు గోనెసంచులు ఇస్తారు.
 
 అనంతరం ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఐకేపీ, రెవెన్యూ, సివిల్‌సప్లైస్ సిబ్బంది ట్రక్ షీట్‌ను రాస్తారు. ట్రక్ షీట్ ప్రకారం ధాన్యాన్ని సంబంధిత మిల్లుకు కేటాయిస్తారు. ఆ మిల్లు యజమాని ధాన్యాన్ని అన్‌లోడ్‌చేసుకుని ఏసీకే(ఎకనాలెడ్జ్‌మెంట్)ఇస్తారు. దీంతో పాటు ట్రక్‌షీట్‌ను,  పట్టాదారు పాసు పుస్తకం రశీదు, బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్సు కాపీలు తీసుకుని కొనుగోలు కేంద్రం సిబ్బంది జిల్లా కార్యాలయానికి తీసుకువెళ్తే అక్కడ బల్క్‌గా జిల్లా మేనేజర్ చెక్ రాసి బ్యాంకుకు ఇస్తారు. ఆ తరువాత బ్యాంకులో రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. (దీనిని ఇప్పుడు మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాల్లోనే ఆన్‌లైన్ చేస్తూ మార్పులు తీసుకువచ్చారు.) అయితే ధాన్యం కొనుగోలు ఈ విధంగా డ్వాక్రా మహిళలు చేస్తే పారదర్శకంగా జరిగి ఉండేదేమో!
 
 సంతల్లో చీటీల్లా..
 పటిష్టమయిన వ్యవస్థతో ట్రక్ షీట్లను ముద్రించి లెక్క ప్రకారం కొనుగోలు కేంద్రాలకు అందించి అక్కడ సక్రమ పద్ధతి ద్వారా ట్రక్ షీట్లను రాయాల్సి ఉంది. కానీ ట్రక్‌షీట్‌లను సీరియల్ నంబర్లు లేకుండానే ముద్రించారు. అంతటితో ఆగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన  ట్రక్ షీట్ల పుస్తకాలను మిల్లర్ల చేతికి అందించినట్టు తెలిసింది. సీరియల్ నంబర్లు లేవన్న విషయం తెలుసుకుని వాటి ముసుగులో కొందరు మిల్లర్లు మరికొన్ని పుస్తకాలను ఇష్టారీతిన ముద్రించి వాడుకున్నట్టు తెలిసింది.  ఇలా ట్రక్ షీట్లు మిల్లర్ల చేతికి వెళ్లిపోవడంతో మిల్లర్లు బయట ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు జరిపినట్టు నకిలీ బిల్లులు తయారు చేసి వాహనాలతో పాటు పంపించేస్తే సంబంధిత అధికారులు వాటిపైనే సంతకాలు చేసి నకిలీ రైతుల పేరున బిల్లులు చేసేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
 మరికొంత మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడేస్తే వాటిని తీసుకుని లాభాలను దిగమింగి కొంత నగదును రైతుల చేతుల్లో పెట్టారు. మరికొందరు మిల్లర్లు  తమ బంధువుల పేరున ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు సేకరించి కౌలు రైతులంటూ ఖాతాల్లో డబ్బులు వేయించుకున్నారు. ఇలా జిల్లాలో దాదాపు రూ.330 కోట్ల లావాదేవీలు జరగ్గా దొంగ ట్రక్‌షీట్ల ద్వారా నాలుగో వంతు మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతో అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. సీరియల్ నంబర్లు లేకుండా ట్రక్‌షీట్లు ఎలా ముద్రించారు? ముద్రించిన ట్రక్‌షీట్లు మిల్లర్ల చేతికి ఎలా వెళ్లాయి? సీరియల్ నంబర్ లేదన్న ముసుగులో అనధికారికంగా ఎన్ని ట్రక్‌షీట్ల పుస్తకాలు ముద్రించారన్నది తేలాల్సి ఉంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement