ట్రిపుల్ ఐటీ ‘గ్రేట్’
నూజివీడు, న్యూస్‌లైన్ : ఇంజినీరింగు విద్యార్థుల భవిష్యత్ కేరీర్‌ను నిర్దేశించే కీలకపరీక్ష గేట్ పరీక్ష. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలోని ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగు కోర్సు పూర్తిచేసుకోబోతున్న మొదటి బ్యాచ్‌కు చెందిన ఇంజినీరింగు విద్యార్థులు గేట్ పరీక్షరాసి జాతీయ స్థాయిలో పలు ర్యాంకులు తెచ్చుకుని ప్రతిభచాటారు.
దాదాపు 120మంది విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకుని ఐఐటీలకు క్వాలిఫై కాగా, వెయ్యిలోపు ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు 20లోపు ఉన్నారు. ఎలాంటి అదనపు కోచింగ్ లేకుండా ఫ్యాకల్టీలు చెప్పే విషయాలను క్షుణ్ణంగా విని సాధన చేసి జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు. వీరిని ట్రిపుల్‌ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ అభినందించారు. వందలోపు ర్యాంకులు సాధించిన వారి మనోగతమిలా...
లక్ష్యాన్ని సాధించా...
ఫ్యాకల్టీలు చెప్పే వివరాలను శ్రద్ధగా వింటూ ప్రిపేర్ అయ్యా . గేట్ ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో... ఓ వైపు క్యాంపస్ సెలక్షన్లు జరుగుతున్నా పట్టించుకోలేదు. పదో తరగతిలో 561మార్కులొచ్చాయి. రోజుకు 8గంటల పాటు చదివేవాడిని. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా . గేట్ సిలబస్‌కు అనుగుణంగా ట్రిపుల్‌ఐటీ విద్యావిధానం ఉండటం కొంతమేరకు లాభించింది. 25వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది.గొరిజాల మహేష్, 25వ ర్యాంకు, ఈసీఈ, తుళ్లూరు, గుంటూరు జిల్లా.
నూతన ఆవిష్కరణలు చేస్తా...
ట్రిపుల్ ఐటీలోని ఫ్యాకల్టీలు చెప్పే వాటిని శ్రద్ధగా వినేవాడిని. రోజుకు 12గంటలు చదివా. గేట్ పరీక్ష రాసిన రోజు వంద లోపు ర్యాంకు వస్తుందని అనుకున్నా. 30వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాన్న సూర్యనారాయణ వ్యవసాయ కూలి. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అమ్మ ఏమీ చదవుకోలేదు. పదో తరగతిలో 502మార్కులొచ్చాయి. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ఆఫ్ సెన్సైస్‌లో చేరి రోబోటిక్స్‌లో పరిశోధనలు చేయాలని లక్ష్యం.
-గొర్లె శ్రీరాములునాయుడు, 30వ ర్యాంకు, ఈసీఈ, విజయనగరం జిల్లా
రక్షణ రంగంలో సైంటిస్ట్‌నవుతా..
రోజుకు పదిగంటలు పాటు ప్రిపేర్ అయ్యా. ఫ్యాకల్టీ వీర శ్రీను గెడైన్స్ గేట్‌లో ర్యాంకు రావడానికి బాగా ఉపయోగపడింది. నాన్న హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఉంటూ టీవీ సీరియల్స్‌కు స్క్రిప్టు రాస్తారు. బాబా అటామిక్‌అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఎంటెక్ చేసి రక్షణరంగంలో సైంటిస్ట్ అవ్వాలన్నదే లక్ష్యం. పదోతరగతిలో 502మార్కులొచ్చాయి.
లింగిశెట్టి కార్తీక్, 75వ ర్యాంకు, ఎంఎంఈ, కృష్ణానగర్, హైదరాబాద్