తిరుమలాయపాలెం/ముదిగొండ, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన వర్షాలతో పంటలన్నీ దెబ్బతిన్నాయని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు, ముదిగొండ మండలం రాఘవాపురంలో దెబ్బతిన్న పంటలను సోమవారం ఆయన పరకాల ఎమ్మెల్యే బిక్షపతితో కలిసి పరిశీలించారు.
పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాలలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ వివరాలను పరిశీలించేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లాల్లో పర్యటిస్తున్నారని, తమ నివేదికను ముఖ్యమంత్రికి అందజేసి, పరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. గతంలో నీలం, జల్ తుపాన్‌లు, వడగండ్ల వానలు కురవడంతో నష్టపోయిన పంటలకు నేటికీ పైసా కూడా అందజేయలేదని విమర్శించారు. 2011 నుంచి 2013 వరకు రావల్సిన నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున చెల్లించాలని కోరారు. ఆంధ్రాతో సమానంగా ఈ ప్రాంత రైతులకు కూడా పరిహారం చెల్లించాలని, వరదల్లో కొట్టుకుపోయి మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అన్నారు. పంటల బీమా పథకం అమలు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. తడిసిన ధాన్యం, పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నాయకులు గోపగాని శంకర్‌రావు, రామారావు, బత్తుల సోమయ్య, బొమ్మెర రామ్మూర్తి, కంచర్ల చంద్రశేఖర్‌రావు, కాసాని నాగేశ్వరరావు గౌడ్, తదితరులు ఉన్నారు.
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
Published Tue, Oct 29 2013 3:45 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM
Advertisement