దర్శన, బస ఏర్పాట్లపై ఈవో సమీక్ష
అన్నిరకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: జనవరి ఒకటో తేదీన శ్రీవారి దర్శనం, బస ఏర్పాట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం సమాయత్తమైందని ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. మంగళవారం వివిధ విభాగాల అధికారులతో వారు సమీక్షించారు. టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఇతర అన్ని విభాగాలు సమన్వయ సహకారంతో పనిచేయాలని ఆదేశించారు. సర్వదర్శనం, కాలిబాట భక్తుల దివ్యదర్శనం, వీఐపీ దర్శనం, నిర్దేశిత దర్శన సమయాలు, భక్తులను అనుమతించే వేళలను వారు విలేకరులకు వివరించారు.
ఒకటోతేదీ దర్శన ఏర్పాట్లివీ..
ఒకటో తేదీ వీఐపీ దర్శనం వేకువజామున 2గంటల నుంచి ప్రారంభిస్తారు. ప్రతీఒక్క వీఐపీ తరఫున ఆరుగురిని అనుమతిస్తారు. టికెట్టు ధర రూ.1000గా నిర్ణయించారు. ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి. వ్యక్తిగతంగా వస్తేనే అనుమతిస్తారు. సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి.
వీఐపీ టికెట్లను మూడు విభాగాలుగా నిర్ణయించారు. మొదటి విభాగంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సుపథం నుంచి అనుమతిస్తారు. వీరంతా రాంభగీచా వద్ద వాహనాలు పార్క్‌చేసి సుపథం ద్వారా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి ప్రవేశించాలి. రెండో విభాగంలో ఎంపీలు, ఎంఎల్‌ఏలు గోకులం నుంచి మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్, మూడో విభాగం టికెట్లు కలిగిన వారిని లేపాక్షి వద్ద రూ.300 టికెట్ల ప్రవేశం నుంచి అనుమతిస్తారు.
అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మాత్రమే దివ్యదర్శనం టికెట్లు ఇస్తారు. వీరిని అర్ధరాత్రి తర్వాత నారాయణగిరి ఉద్యావనం నుంచి క్యూలోకి అనుమతిస్తారు. 25వేల మందికి దర్శనం కల్పించాలని నిర్దేశించుకున్నారు.
సర్వదర్శనం భక్తులను డిసెంబర్ 31న సాయంత్రం 5గంటల నుంచి అనుమతిస్తారు.
పలు సేవలు రద్దు
వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లిదండ్రుల దర్శనాన్ని రద్దు చేశారు.
ఒకటో తేదీ, రెండో తేదీ ఆర్జిత సేవలు రద్దు చేశారు.
భక్తుల రద్దీవల్ల రూ.300 టికెట్లను పూర్తిగా రద్దు చేశారు.
ఇప్పటికే రూ.50 సుదర్శనం టికెట్లు పొందిన 4,800 మందిని నిర్ణీత వేళల్లో దర్శనానికి అనుమతిస్తారు.
బస ఏర్పాట్లు
డిసెంబరు 31న గదుల కోసం సిఫారసులు స్వీకరించరు
సాధారణ భక్తులకే సీఆర్‌వోలో గదులు కేటాయిస్తారు.
దాతలు నేరుగా వస్తేనే గదులు ఇస్తారు. వారి సిఫారసుకు గదులు కేటాయించరు.
ప్రత్యామ్నాయంగా సేవా టికెట్ల కేటాయింపు
జనవరి ఒకటవ తేదీ, 11వ తేదీ వైకుంఠ ఏకాదశి, 12వ తేదీ ద్వాదశి, ఫిబ్రవరి 6న రథసప్తమి రోజుల్లో సుప్రభాతం, అర్చన, తోమాల, కల్యాణోత్సవం, అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లను రద్దు చేశామని జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆయా తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా పొరపాటున 1496 మందికి సేవా టికెట్లు కేటాయించారన్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా ఆయా సేవా టికెట్లను 2014, ఏప్రిల్ 1వ తేది నుంచి జూన్ 30వ తేదీ మధ్య తేదీల్లో కేటాయిస్తామన్నారు. ఈ టికెట్లను డిసెంబర్ 25 నుంచి 30వ తేదీలోపు భక్తులు పొందవచ్చన్నారు. అన్ని వివరాలు టీటీడీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు.
తిరుమలలో తరగని రద్దీ
మూడు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. మంగళవారం సైతం భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడింది. వరుస సెలవులు, ఏడాది చివరి వారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 40,423 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
కొత్త సంవత్సరానికి టీటీడీ సిద్ధం
Published Wed, Dec 25 2013 3:32 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement