వెంకన్న భక్తులకు లడ్డూల కోత
తిరుమల: శ్రీకల్యాణ వెంకన్న లడ్డూలకు తిరుమల తిరుమతి దేవస్థానం(టీటీడీ) కోత విధించనుంది. ఇప్పటి వరకూ భక్తులకు ఇస్తున్న నాలుగు లడ్డూలను రెండుకు తగ్గించనుంది. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు రెండు లడ్డూలు ఇవ్వాలన్న ప్రతిపాదనను నేటి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక మొత్తంలో ఆదాయం వచ్చిపడుతున్నా, లడ్డూలపై కోత విధించడంపై విమర్శలకు తావిస్తోంది.
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూల కోసం తిరుమల వెళ్లి వచ్చిన ప్రతివారినీ ఇతరులు అడుగుతుంటారు. అలా పదిమందికీ ప్రసాదం పంచిపెట్టినా కూడా పుణ్యమేనని తిరుమల వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరూ వీలైనన్ని లడ్డూలు తీసుకొచ్చి, అందరికీ పంచుతుంటారు. అలాంటిది ఇప్పుడు కోత పెట్టడంపై పలు విమర్శలు వస్తున్నాయి. బ్లాకులో కావాలంటే మాత్రం ఎన్ని లడ్డూలైనా దొరుకుతున్నాయని, నిజమైన భక్తులకే అందట్లేదని మండిపడుతున్నారు.