ఎన్నో ఆశలతో పంటసాగు చేసిన పసుపు రైతుకు ధరాఘాతం తగులుతోంది. మార్కెట్‌లో క్వింటాలు పసుపు పంటకు రూ. 6,200 ధర మాత్రమే లభిస్తుండడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. కనీసం రూ. 8 వేలు పలికితేనే పెట్టుబడులు తిరిగి వస్తాయని, లేకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోర్తాడ్, న్యూస్‌లైన్ : ఆర్మూర్ సబ్‌డివిజన్‌లోని మోర్తాడ్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, నం దిపేట్ మండలాల్లో పసుపు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 25 వేల హెక్టార్లలో పసుపు సాగు చేశారు. గతేడాది పసుపు క్వింటాలుకు కనిష్ట ధర రూ.6500, గరిష్ట ధర రూ.10 వేలు లభించింది. ఈ ఏడాది అధిక వర్షాలు కురియడంతో పంటకు దుంపకుళ్లు సోకి నష్టం వాటిల్లింది. దిగుబడి తగ్గినందున మార్కెట్‌లో పసుపు పంటకు కొరత ఉంటుందని, దర పెరుగుతుందని రైతులు ఆశించారు.
అయి తే పసుపు ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేక పోవడం, మార్కెట్‌లోని వ్యాపారుల చేతిలోనే ధర నిర్ణయాధికారం ఉండటంతో రైతులకు లా భం కలగడం లేదు.
పసుపు పంటకు మద్దతు ధర లేనందున మార్కెట్ ఇన్‌వెన్షన్ స్కీంను వర్తింప చేసి ప్రభుత్వమే పసుపు పంటను కొనుగోలు చేసే అధికారాన్ని తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మద్దతు ధర కోసం స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో రైతులు పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. అయితే పసుపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
ప్రస్తుతం పసుపు పంట చేతికి వస్తోంది. దీంతో రైతులు నిజామాబాద్ మార్కెట్‌కు పం టను తరలిస్తున్నారు. అక్కడికి వెళ్లిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. క్వింటాలు పసుపు పం టకు రూ. 6,200 ధర లభిసోంది. జాతీయ మార్కెట్ ఆయిన మహారాష్ట్రలోని సాంగ్లీలో మాత్రం నిలువ ఉంచిన పసుపు పంటకు కొద్ది గా ఎక్కువ ధర లభిస్తోంది. క్వింటాలు పసుపు గరిష్టంగా రూ. 7,500 పలుకుతోంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పసుపు రైతుల సమస్యలను ప్రస్తావించకపోవడం రైతులను కుంగదీస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే పసుపు రైతులు కష్టాలు పడుతున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించాం. మా విన్నపాలన్నింటినీ పాలకులు బుట్టదాఖలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలి. పసుపు పంటకు మద్దతు ధర కోసం ఆర్మూర్‌లో త్వరలో జాతీయ స్థాయి రైతు నాయకులతో బహిరంగ సభ నిర్వహించనున్నాం.
-కోటపాటి నర్సింహనాయుడు, స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర కోకన్వీనర్
పసుపు రైతుకు ధరాఘాతం
Published Sat, Dec 21 2013 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement