ఆయనకు సెంటు పొలం లేదు. ఆస్తిపాస్తులు లేని నిరుపేద కుటుంబం. ఈ నేపథ్యంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తూ, వచ్చే అరకొర ఫలసాయంతో బతుకుబండి లాగిస్తున్నాడు.
సీతారామపురం : ఆయనకు సెంటు పొలం లేదు. ఆస్తిపాస్తులు లేని నిరుపేద కుటుంబం. ఈ నేపథ్యంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తూ, వచ్చే అరకొర ఫలసాయంతో బతుకుబండి లాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనను కరెంట్ కాటేసింది. కానరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. విద్యుదాఘాతానికి గురై పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సీతారామపురంలోని పడమటివీధికి చెందిన ఆకుల రామయ్య(49)కు భార్య నాగేశ్వరమ్మ, పదహారేళ్ల కుమారుడు ఉన్నారు.
వీరికి సెంటు పొలం కూడా లేకపోవడంతో రామయ్య నాలుగేళ్లుగా 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. రూ.17 వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం ఆ భూమిలో కొంత మేర సజ్జ, వరి పంట సాగు చేస్తుండగా, మిగిలిన భూమిని సాగుకు సిద్ధం చేస్తున్నాడు.
ఈ క్రమంలో పొలంలోని విద్యుత్ మోటారు మరమ్మతులకు గురైంది. దానికి మరమ్మతులు చేయించేందుకు మంగళవారం మెకానిక్‌ను పొలంలోకి తీసుకెళ్లాడు. మరమ్మతుల నేపథ్యంలో పొలం పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపారు. పని పూర్తయిన తర్వాత రామయ్య ట్రాన్స్‌ఫార్మర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే ఆన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు వైర్లు త గలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సీతారాంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.