
ఏవీ..ఆ కాంతులు
- ఆతిథ్యమిచ్చినా.. ఒక్కటే మిగిలింది!
- విజ్ఞాన ప్రదర్శనలో తుస్సుమన్న జిల్లా
- ఇన్‌స్పైర్ చేయలేని విద్యాశాఖ
- ఆ ఒక్క రోజు హడావుడే ముంచిందా?
పథకం : విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచాలి. వారిలో దాగివున్న సృజనాత్మకతను, విజ్ఞానాన్ని వెలికి తీయాలి. సైన్స్ పురోభివృద్ధి వైపు ముందడుగు వేసేలా పోత్సహించాలి. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ఇన్‌స్పైర్ అవార్డుల్ని ప్రవేశపెట్టింది.
నిధులు : ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తోంది. ప్రతి పాఠశాలలో ఒకరిని, ఉన్నత పాఠశాలలయితే ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం వారెంట్(ప్రోత్సాహకం) అందిస్తుంది.
ఫలితం : విద్యార్థుల్ని బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం అంతంతే. ఇటీవల విశాఖ ఎస్‌ఎఫ్‌ఎస్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ ప్రదర్శనలో జిల్లా నమూనాలు తీవ్ర నిరాశ పరిచాయి. ఒకే ఒక నమూనా జాతీయ పోటీలకు ఎంపిక కావడ మే ఇందుకు నిదర్శనం.
సాక్షి, విశాఖపట్నం : ఇన్‌స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా స్థాయిలో 2011లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు ప్రదర్శనలు జరిగాయి. 2011లో నాలుగు నమూనాలు, 2012లో ఆరు నమూనాలు జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. 2012లో దక్షిణ భారత్ స్థాయిలో జతిన్‌వర్మ అనే విద్యార్థి రూపొందించిన రోబో ఎంపికయింది. 2013లో జిల్లాకు చెందిన 16 నమూనాలు అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వెళ్లాయి. అందులో నాలుగు(గబ్బాడ-నర్సీపట్నం, బూరుగుపాలెం-మాకవరపాలెం, దిమిలి-రాంబిల్లి, చీడిగుమ్మల-గొలుగొండ జెడ్పీ హైస్కూళ్ల) ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి.
అయితే అదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఏ ఒక్క నమూనా కూడా జాతీయ స్థాయికి పంపలేకపోయారు. తాజాగా ఈ నెల 20, 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ ప్రదర్శనకు విశాఖ ఆతిథ్యమిచ్చింది. ఇందులో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 506 నమూనాలు ఎంపికగా అందులో 456 రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వచ్చాయి. జిల్లా నుంచి కేవలం 12 నమూనాలు మాత్రమే ప్రదర్శనకు నోచుకోగా అందులో ఒక్కటే(తిమ్మరాజుపేట-మునగపాక) జాతీయ స్థాయికి ఎంపికయింది.
ఎందుకిలా..!
రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా తొలి విడత తిరుపతిలో ఏడు జిల్లాలకు చెందిన నమూనాలు, రెండో విడతగా విశాఖలో ఆరు జిల్లాలకు చెందిన నమూనాలు ప్రదర్శనకు ఉంచారు. ఇందులో జిల్లా నుంచి 12 నమూనాలు మాత్రమే ప్రదర్శనకు నోచుకోవడం వెనుక పాఠశాల స్థాయి నుంచి జిల్లా విద్యాశాఖ వరకు తిలాపాపం తలా పిడికెడు పంచుకున్నారన్న ఆక్షేపణలున్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 1300కు పైగా వారెంట్ల కోసం దరఖాస్తులు గతేడాది జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. అయితే విద్యాశాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ జాబితాను ఎస్‌సీఈఆర్‌టీకి పంపడంలో జాప్యం చేశారు. దీంతో కేవలం 199 స్కూళ్లకు మాత్రమే వారెంట్లు వచ్చాయి. అందులో కూడా అత్యధిక భాగం గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్కూళ్లే కావడం గమనార్హం.
ఆ ‘ఒక్క రోజే’ ముంచిందా?
మరోవైపు జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖామాత్యుల వైఖరి కూడా ఈసారి ఇన్‌స్పైర్ ప్రదర్శనలో జిల్లా చతికిలపడటానికి కారణమన్న ఆక్షేపణలున్నాయి. ఈ ఏడాది జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌ను జూలై 31న ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకు ఒక్క రోజు ముందే మంత్రిగారి ఉత్తర్వులతో హడావుడిగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరూ పూర్తి స్థాయిలో నమూనాలను తయారు చేసుకోలేకపోయారు. సులభంగా పూర్తయ్యే/రెడీమేడ్ నమూనాలనే ప్రదర్శనకు తీసుకొచ్చారు. 199 అంశాల్లో 163 మంది మాత్రమే ప్రదర్శనకు వచ్చారు. దీంతో వీటి నుంచే 12 నమూనాలను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయాల్సి వచ్చింది. నిబంధనల మేరకు వీటినే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో ఉంచారు. దీంతో మిగిలిన జిల్లాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల ముందు విశాఖ విద్యార్థుల నమూనాలు తేలిపోయాయి.