ట్విట్టర్ సీఈవో రేసులో విజయవాడ మహిళ
ముగ్గురితో పోటీ పడుతున్న పద్మశ్రీ వారియర్
మాంటిస్సోరి, మేరీస్ స్టెల్లా కళాశాలలో విద్యాభ్యాసం
మోటరోలా, సిస్కో సంస్థల్లో విశేషానుభవం
ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో స్థానం
విజయవాడ: ప్రముఖ సోషల్ వెబ్‌సైట్ ట్విట్టర్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా విజయవాడకు చెందిన ఎల్లెపెద్ది పద్మశ్రీ వారియర్ పేరు పరిశీలనలో ఉంది. తమ సంస్థ సీఈఓగా మొత్తం నలుగురి పేర్లను ట్విట్టర్ యాజమాన్యం పరిశీలి స్తోంది. ఇందులో పద్మశ్రీ పేరు కూడా ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ పేరు తెరపైకి వచ్చింది. పద్మశ్రీ విజయవాడ గాంధీనగర్‌లో 1961లో జన్మించారు. నగరంలోని మాంటిస్సోరి పాఠశాల, మేరీస్ స్టెల్లా కళాశాలలో విద్యనభ్యసించారు. ముంబై ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో పీజీ చేశారు. మోహన్‌దాస్ వారియర్‌ను వివాహమాడారు.
వారికి కర్నా వారియర్ అనే కుమారుడు ఉన్నారు. 1984 నుంచి 2007 వరకు 23 ఏళ్లపాటు మోటరోలా ఎనర్జీ సిస్టమ్స్‌లో పద్మశ్రీ పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కృషి ఫలితంగా కంపెనీ 2004 సంవత్సరంలో నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును పద్మశ్రీ అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా అందుకున్నారు. 2007లో సిస్కో ఎనర్జీ సిస్టమ్స్‌లో సీటీవోగా చేరి 2015 జూన్ వరకు ఆ సంస్థలో కొనసాగారు. ఫోర్బ్స్ సంస్థ 2014లో విడుదల చేసిన 100 మంది ‘ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా’లో ఆమె 71వ స్థానంలో నిలిచారు.