నానమ్మ నాగమ్మతో పిల్లలు
అనంతపురం, తాడిపత్రి టౌన్: రెండేళ్ల క్రితం వరకు ఆ కుటుంబం ఆనందోత్సాహాలతో గడిపింది. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు... ఎంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో విధి వక్రీకరించింది. ఫలితంగా తల్లిదండ్రుల నీడన ఆడుకోవాల్సిన వయస్సులో ఆ చిన్నారులు అనాథలయ్యారు. ఆదుకునే వారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. అయినవాళ్లందరూ కాదని అంటే ఎటు పోవాలో అర్థం కాలేదు. చివరకు ఏడు పదుల వయస్సులో ఉన్న నానమ్మ అన్నీ తానై ముందుకు వచ్చింది. కాటికి కాళ్లు చాపిన వయస్సులో చిన్నారుల పోషణ భారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా ఉంది. తాను లేకపోతే మరోసారి ఆ పిల్లలు అనాథలుగా రోడ్డున పడతారనే భావన ఆ వృద్ధురాలిని కలిచి వేస్తోంది. అందుకే తాను జీవించి ఉండగానే వారికో ఆసరా కల్పించాలని పరితపిస్తోంది. ఆదుకునే హస్తం కోసం ఎదురు చూస్తోంది.
లక్ష్మి, కళ్యాణ్‌కుమార్
చింతలేని కుటుంబం...
తాడిపత్రిలోని జయనగర్‌కు చెందిన రాజయ్య (రాజ కుళ్లాయప్ప), నాగేశ్వరమ్మ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె లక్ష్మి... స్థానిక చేనేత కాలనీలోని మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కొడుకు కళ్యాణ్‌కుమార్ (కుళ్లాయప్ప), తన అక్కతో పాటు అదే పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కూలి పనులతో కుటుంబాన్ని రాజయ్య పోషించుకుంటూ వచ్చేవాడు. సంపాదన తక్కువే అయినా.. చిన్న కుటుంబం కావడంతో ఎలాంటి చింతలేకుండా సంతోషంగా జీవిస్తూ వచ్చారు.
నెలల తేడాతో తల్లిదండ్రులను కోల్పోయి..
ఎంతో సంతోషంగా జీవిస్తున్నామనుకుంటున్న తరుణంలో నాగేశ్వరమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. పలు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న రాజయ్య ఒక్కసారిగా కుంగిపోయాడు. వచ్చే అరకొర సంపాదనతో కుటుంబాన్ని అతి కష్టంపై లాక్కొస్తున్న తరుణంలో పిడుగులాంటి వార్త అతని జీవితంలో అంధకారాన్ని నింపుతూ వచ్చింది. భార్య ప్రాణాలను దక్కించుకునేందుకు తన శాయాశక్తుల ప్రయత్నించాడు. దాచుకున్న డబ్బు కాస్త ఖర్చయిపోయింది. చివరకు అప్పులు చేయాల్సి వచ్చింది. అయినా భార్య ప్రాణాలు దక్కలేదు. 18 నెలల క్రితం ఆమె మృత్యువాతపడింది. భార్య మృతితో రాజయ్య మానసికంగా చాలా నలిగిపోయాడు. తిండితిప్పలు లేక అనారోగ్యం పాలయ్యాడు. ఆ దిగులుతోనే ఆరు నెలల క్రితం అతనూ గుండెపోటుతో మరణించాడు.
అందరూ ఉన్నా.. అనాథలుగా
తల్లి మరణించిన ఘటన నుంచి చిన్నారులు కోలుకోలేదు. అయిన వారందరూ మాట వరసకు కూడా పలకరించడం మానేశారు. దీంతో ఎవరి ఇంటికి వెళ్లాలన్నా ఒక విధమైన జంకుతో చిన్నారులు నలిగిపోయారు. అదే సమయంలో తండ్రి కూడా మరణించడంతో వారికి దిక్కుతోచలేదు. కంటి ముందు నిర్జీవమై పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూస్తూ కన్నీరు పెట్టడం తప్ప వారికి మరేమీ చేతకాలేదు. కొందరు వస్తున్నారు.... ఏవేవో మాట్లాడుకుంటున్నారు.. వెళ్లిపోతున్నారు. ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎవరిని కలవాలో ఆ చిన్నారులకు దిక్కుతోచలేదు. ఎవరూ చేరదీయకపోవడంతో అనాథలుగా మిగిలారు. కర్మకాండలు ఎలా జరిగాయో కూడా వారికి గుర్తులేదు.
నానమ్మ పంచన చేరి..
చిన్నారుల పరిస్థితి చూసి నానమ్మ నాగమ్మ చలించిపోయింది. అప్పటికే అద్దె ఇంటిలో నివసిస్తూ.. ప్రభుత్వం అందజేసే వితంతు పింఛన్‌తో అతి కష్టంపై జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆమెకు ఆ చిన్నారుల పోషణ తలకు మించిన భారమే. అయినా ఆ వృద్ధురాలు భయపడలేదు. నేనున్నాంటూ ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంది. ఒక పూట పస్తులుండైనా చిన్నారుల కడుపు నింపుతూ.. వారి ఆలనాపాలనా చూసుకుంటూ వస్తోంది. రోజు వారీ క్రమం తప్పకుండా వారిని పాఠశాలకు పంపుతూ చదువు సంధ్యలు చెప్పిస్తోంది. ఇలాంటి తరుణంలోనే ఆమె మదిలో ఓ చిరు ఆలోచన పెనుభూతమై భయపెట్టింది. జీవిత చరమాంకంలో ఉన్న తాను జీవించి ఉండగానే ఆ చిన్నారులకు ఓ ఆసరా కల్పించాలని భావించింది. ఆ దిశగా ఆదుకునే హస్తం కోసం ఎదురుచూస్తోంది. మనసున్న దాతలు ముందుకు వచ్చి ఆర్థికసాయం అందిస్తే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపయోగపడేలా చేయాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రాధేయపడుతోంది.
దాతలు స్పందిస్తే..
పేరు: తలారి నాగమ్మ W/O తలారి పుల్లన్న
బ్యాంక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
ఖాతా నం. : 6213 460 7206
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : SBIN0021066
సంప్రదించాల్సిన ఫోన్ నం. :81439 29401
Comments
Please login to add a commentAdd a comment