- తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ మహిళలకు
- తిరుపతి జనరల్ మహిళ, చిత్తూరు బీసీ మహిళ
- జిల్లా రాజకీయాల్లోకి కొత్త ముఖాలు
- తిరుపతి రేసులో డాక్టర్లు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో రాజకీయ ముఖ చిత్రం మారనుంది. ఇక మహిళలు స్థానిక సంస్థల పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. రాజకీయ పార్టీ ఏదైనా అంతి మంగా మహిళలే మేయర్లుగా రాజ్యమేలనున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ రిజర్వేషన్లలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు జనరల్ మహిళ, చిత్తూ రు కార్పొరేషన్ బీసీ మహిళకు రిజర్వేషన్ అయింది. ఈ క్రమంలో జిల్లా రాజ కీయాల్లోకి కొత్త ముఖాలు అరంగేట్రం చేయనున్నాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. డివిజన్లు, వార్డుల్లోనూ సగం మహిళల కు రిజర్వేషన్లు ఉండడంతో మహిళల భాగస్వామ్యం మున్సిపల్ పాలనలో పెరగనుంది.
తిరుపతి బరిలోకి డాక్టర్లు..
తిరుపతిలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీల తరఫున కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా అవకాశం వస్తే రంగంలోకి దిగాలని కొందరు మహిళా డాక్టర్లు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. రెండు సంవత్సరాలుగా ఓసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు, ముగ్గురు మహిళా డాక్టర్లు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, ఉద్యమాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రజలకు, మీడియాకు సుపరిచితులుగా ఉన్నారు. వీరిలో ఎవరినైనా ప్రధాన రాజకీయ పార్టీలు మేయర్ అభ్యర్థులుగా పరిగణ నలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో తిరుపతి రాజకీయ చిత్రపటం పైకి కొత్త ముఖాలు రానున్నాయి.
చిత్తూరులో రాజకీయ నాయకుల భార్యలు
చిత్తూరు కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో రాజకీయం మారనుంది. ఇప్పటివరకు పురుషులే చైర్మన్లుగా ఉంటూ వచ్చిన ఈ మున్సిపాల్టీకి గతంలో ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి సీకే లావణ్య పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్, టీడీపీలో ప్రముఖ నాయకులందరూ ఓసీకి చెందినవారు కావడంతో బీసీకి చెందిన నాయకులు భార్యలను రంగంలోకి దింపాల్సి ఉం టుంది. ఈ క్రమంలో ఏ పార్టీలో చేరనప్పటికీ బీసీ సంక్షేమ సంఘం తరఫున చురుకుగా వ్యవహరిస్తున్న ఒక నాయకుడు తన భార్యను మేయర్ అభ్యర్థిగా రంగంలోకిదింపే అవకాశాలులేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.