వారు అరగంటలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేవారు.. ఇంతలోనే విధి వక్రీకరించింది.. మృత్యువు లారీ రూపంలో ఎదురుపడి ఇద్దరి ప్రాణాలను బలిగొంది..
కోదాడటౌన్, న్యూస్‌లైన్: వారు అరగంటలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేవారు.. ఇంతలోనే విధి వక్రీకరించింది.. మృత్యువు లారీ రూపంలో ఎదురుపడి ఇద్దరి ప్రాణాలను బలిగొంది.. ఈ ఘటన కోదాడ బైపాస్‌రోడ్డులో గుడిబండ ఫైఓవర్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. పోలీ సులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని బ్రాడిపేటకు చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు (28), పునుగుపాటి వెంకటేశ్వరరావు (29)లు కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేటలోని తమ బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తున్నారు. కోదాడ బైపాస్‌రోడ్డు వద్దకు రాగానే ముందున్న లారీడ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వీరికారు వేగంగా వెళ్లి లారీని వెనుకనుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వడ్లమూడి వెంకటేశ్వర్లు, పునుగుపాటి వెంకటేశ్వరరావులు అక్కడికక్కడే మృతిచెందగా వడ్లమూడి వెంకటేశ్వర్లు భార్య విజయకుమారికి తీవ్రగాయాలయ్యాయి. ఈమెను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కాగా కోదాడ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మృతదేహాలకు కోదాడ ప్రభు త్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. వడ్లమూడి వెంకటేశ్వర్లు తండ్రి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు.
లారీ ఢీకొని వ్యక్తి ..
చిలుకూరు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన చిలుకూరులోని హరిజనాడలో శనివారం వెలుగులోకి వచ్చింది. చిలుకూరుకు చెందిన ముదిగొండ కాశయ్య ఆలియాస్ యర్రయ్య (39) శుక్రవా రం హుజుర్‌నగర్‌లో నివాసముంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత లారీలో తిరుగుప్రయాణమై హరిజనవాడలో దిగాడు. నడుచుకుంటూ వస్తుండగా హుజుర్‌నగర్ వైపు నుంచి వస్తున్న లారీ కాశయ్యను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. మృతదేహానికి కోదాడ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిం చారు. మృతుడి భార్య రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
నాలుగేళ్ల క్రితం కొడుకు..
కాశయ్య కుమారుడు వీరబాబు కూడా నాలుగేళ్ల క్రితం చిలుకూరు బస్టాండ్ వద్ద లారీ దిగుతుండగా వెనక నుం చి వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. అదే తరహాలో కాశయ్య కూడా మృతిచెందడంతో కుటుం బ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కాశయ్య మృతదేహానికి పెద్ద కుమార్తె నాగమణి దహన సంస్కారాలు నిర్వహించింది.