ప్రమాదం నుంచి బయట పడిన సుమలత, దీక్షిత్
సాక్షి, మహబూబాబాద్/కేసముద్రం/ఇల్లెందు: వాళ్లంతా గిరిజనులు.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నారు. చదువుకున్న కొడుకుకు ఉపాధి కల్పించేందుకు కొత్త లారీ కొన్నారు. తనతోపాటు తన బంధువు కూడా లారీ కొనడంతో ఆ సంబురంలో బంధువులతో కలసి దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. డ్రైవర్, తల్లి, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు లచ్చీరాం తండా సమీపంలో చోటుచేసుకుంది.
కారు అదుపుతప్పడంతో...: మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన బానోత్ భద్రునాయక్ (39) తన దూరపు బంధువు జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి తండాకు చెందిన మధు కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా వద్ద పండుగ చేశారు. పండుగకు భద్రునాయక్, భార్య హచ్చాలి (35), కుమార్తె సుమలతతోపాటు 18 నెలల మనవడు దీక్షిత్‌తో కలసి టేకులపల్లికి చెందిన తన బావమరిది గుగులోత్ బిక్కి నాయక్ కారులో వెళ్లారు.
అన్నారం షరీఫ్ దర్గాలో బంధువులతో కలసి దర్శనం చేసుకున్నారు. భోజనాలు చేశారు. తిరిగి టేకులపల్లికి వస్తుండగా అదే పండుగకు వచ్చిన మహబూబాబాద్ పట్టణం భవానీ నగర్ తండాకు చెందిన గుగులోత్ లలిత (45), ఆమె కుమారుడు సురేష్ (15) లిఫ్ట్ అడిగి కారులో ఎక్కారు. అయితే కారు కేసముద్రం మండల కేంద్రం లచ్చీరాం తండా సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది.
ఈ ప్రమాదంలో భద్రునాయక్, అతని భార్య హచ్చాలి, లలిత, ఆమె కుమారుడు సురేష్ నీటిలో మునిగి మరణించారు. ముందు సీట్లో ఉన్న డ్రైవర్ బిక్కు, భద్రునాయక్ కుమార్తె సుమలత, ఆమె 18 నెలల కుమారుడు దీక్షిత్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద వార్త తెలియగానే మహబూబాబాద్ డీఎస్పీ సైదయ్య ఆధ్వర్యంలో పోలీసులు, గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకొని రెండు గంటలపాటు శ్రమించి క్రేన్ సాయంతో బావిలోంచి కారును బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
బావిలో పడిన కారును బయటకు తీస్తున్న దృశ్యం
నీటిలో అరగంట తేలుతూ..
కేసముద్రం బైపాస్ రోడ్డును కొత్తగా వేస్తున్నారు. కంకర పోసి ఉండటంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే నిండు కుండలా ఉన్న వ్యవసాయ బావిలో పడింది. అయితే కారు అద్దాలు మూసి ఉండటంతో దాదాపు అరగంటపాటు బావిలో కారు తేలుతూ ఉంది. క్రమంగా లోపలకు నీరు చేరుతుండటంతో కారులో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కారు బావిలో పడిన శబ్ధం రావడంతో అటువైపు మూత్ర విసర్జనకు వెళ్తున్న ఎస్‌వీవీ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు బుర్రి రంజిత్, నూనావత్ సిద్దూలు ప్రాణాలకు తెగించి బావిలోకి దూకారు.
కారు అద్దాన్ని పగలగొట్టి సుమలత, ఆమె కుమారుడు దీక్షిత్‌ను, డ్రైవర్ బిక్కును కాపాడారు. అప్పటికే కారులోకి నీరు ప్రవేశించి కారు మునిగిపోతుండగా హచ్చాలిని, భధ్రులను స్థానికుల సాయంతో బయటకు తీశారు. కానీ అప్పుటికే భద్రు మృతి చెందగా కొనఊపిరితో ఉన్న హచ్చాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. వెనుక సీట్లో ఉన్న లలిత, ఆమె కుమారుడు సురేష్‌లు కారులోనే మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment