డేంజర్ లైన్ | Travel on the highway on danger | Sakshi
Sakshi News home page

డేంజర్ లైన్

Published Sun, Nov 16 2014 1:23 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

హైవేపై ప్రయాణం క్షణక్షణం భయం భయంగా ఉంటుంది.

నక్కపల్లి : హైవేపై ప్రయాణం క్షణక్షణం భయం భయంగా ఉంటుంది. ముఖ్యంగా వేంపాడు నుంచి పాయకరావుపేట బైపాస్‌రోడ్డు వరకు నాలుగులైన్ల జాతీయరహదారి పేరు చెబితే దడపుడుతుంది. వాహన చోదకులు బెంబేలెత్తిపోతారు. పదిహేను కిలోమీటర్ల ఈ రహదారిపై నిత్యం ఎక్కడో ఒక చోట రక్తసిక్తమవుతోంది.ముఖ్యంగా వేంపాడనుంచి గొడిచర్ల వరకు ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. గడచిన మూడేళ్లలో వేంపాడు, ఉద్దండపురం, గొడిచర్ల,నామవరం, సీతారాంపురం, పాయకరావుపేట,తదితరప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డుప్రమాదాల్లో సుమారు 30 మంది చనిపోయారు. 80 మంది వరకు క్షతగాత్రులయ్యారు.

రెండేళ్లక్రితం నామవరం పెట్రోలు బంక్‌సమీపంలో ఆగిఉన్న లారీని ఐషర్‌వ్యాన్ ఢీకొని తూర్పుగోదావరి జిల్లాకు చెంది 10మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నెల రోజుల్లో ఇదే పెట్రోలు బంక్‌వద్ద లారీ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. గుంటపల్లి నుంచి నామవరం జాతీయరహదారి పైకి వచ్చేటప్పుడు కూడా పలుమార్లు ప్రమాదాలు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. ఏడాదిక్రితం ఉద్దండపురం వద్ద ట్రాక్టర్‌ను ఢీకొట్టి  మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మరణించారు.

గతేడాది గొడిచర్ల వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఒకరు, టూవీలర్‌పై వెళ్తున్న ఒకరు లారీలు ఢీకొట్టి మరణించారు. అక్కడే గతేడాది లారీ బోల్తాపడి ఒకరు చనిపోగా ఇద్దరు గాయాలపాలయ్యారు. ఒడ్డిమెట్ట సమీపంలో వ్యాన్‌బోల్తాపడి ఒకరు మరణించగా ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఇదేప్రాంతంలో టాటాఏసీ వ్యాన్ బోల్తాపడి పలువురు గాయాలయ్యాయి. ఉద్దండపురంలోనే ఒక చిన్నారి బస్సుఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది.తాజాగా శనివారం గొడిచర్ల సమీపంలో ఆగిఉన్న లారీని ఇన్నోవా ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. ఇలా చెప్పుకుంటూపోతే గొడిచర్ల, ఉద్దండపురం, నామవరం ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలుకోల్పోయిన వారే అధికం.

ఇక ఆటోలు బోల్తాపడటం, ఆగిన ఆటోను లారీ ఢీకొట్టడం వంటి సంఘటనలయితే చెప్పక్కర్లేదు. గొడిచర్ల, ఉద్దండపురం నూకాలమ్మ గుడిప్రాంతం, వేంపాడు,ఉద్దండపురం మధ్య, చర్చివద్ద మలుపులు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన వేగంతో ప్రయాణించేవారు, మద్యం సేవించి వాహనాలునడిపేవారి వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయరహదారి పక్కనే ఉన్న డాబాలు, కాఫీ హోటళ్ల వద్ద, ఎక్కడి పడితే అక్కడ రాత్రిళ్లు ఇష్టాను సారం లారీలను నిలిపివేస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేసినప్పటకీ ప్రయోజనం లేకుండాపోతోంది. వాహనాలను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన ప్రమాదానికి పొగమంచుతోపాటు, డ్రైవింగ్‌చేస్తున్న వ్యక్తి మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే కారణంగా తెలుస్తోంది. రోడ్డుప్రమాదాల నివారణకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌పోలీసులు తరచూ గస్తీ ఏర్పాటుచేసి మితిమీరిన వేగంతోప్రయాణించే వాహనాలను గుర్తించి తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement