లారీని ఢీకొన్న వ్యాన్ : ఇద్దరి మృతి | Two died in road accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న వ్యాన్ : ఇద్దరి మృతి

Published Sun, Dec 7 2014 1:09 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

లారీని ఢీకొన్న వ్యాన్ : ఇద్దరి మృతి - Sakshi

లారీని ఢీకొన్న వ్యాన్ : ఇద్దరి మృతి

దివాన్‌చెరువు (రాజమండ్రి రూరల్) :తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి. విదే శాలు చూసి రావాలన్న తపన ఆ ఇద్దరినీ మృత్యుతీరానికి చేర్చింది. జాతీయ రహదారిపై దివాన్ చెరువు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, ఆరుగురు గాయాల పాలయ్యారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, క్షతగాత్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం మండలం వీరభద్రవరానికి చెందిన బచ్చు ఆంజనేయులు(39), జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన చీమకుర్తి మల్లికార్జునరావు(45), అతడి భార్య చీమకుర్తి పద్మావతి, జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడేనికి చెందిన పోతన శ్రీనివాసరావు, అతడి భార్య పోతన శ్రీలక్ష్మి, టి. నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడేనికి చెందిన బోరేపల్లి సాయిసుమంత్, బోరేపల్లి జ్యోతి, బొర్రంపాలేనికి చెందిన జంగాల శ్రీనివాసరావు మొక్కజొన్న పంట పండించే రైతులు, వ్యాపారులు.
 
 విదేశాలకు వెళదామనే ఉద్దేశంతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల ఐదునపాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనకు తేదీ లభించింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ఆస్పాక గ్రామానికి చెందిన గడ్డం వెంకన్నబాబుకు చెందిన వ్యాన్‌ను వీరు కిరాయికి మాట్లాడుకున్నారు. శుక్రవారం విశాఖపట్నానికి వచ్చి, పాస్‌పోర్టు దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన చేయించుకున్నారు. అదేరోజు సాయంత్రం వీరంతా తిరుగు పయనమయ్యారు. ఇలాఉండగా డీజిల్ అయిపోవడంతో జాతీయ రహదారిపై దివాన్‌చెరువు వద్ద రోడ్డు పక్కన ఓ లారీ ఆగిపోయింది. విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు బొగ్గు లోడుతో అది బయలుదేరింది. కాగా తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న వారి వ్యాన్.. ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న బచ్చు ఆంజనేయులు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు.
 
 వ్యాన్‌లో ఉన్న మల్లికార్జునరావు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ గడ్డం వెంకన్నబాబు, చీమకుర్తి పద్మావతి, పోతన శ్రీనివాసరావు, పోతన శ్రీలక్ష్మి, బోరేపల్లి సాయిసుమంత్, జంగాల శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. బోరేపల్లి జ్యోతి సురక్షితంగా బయటపడింది. అటుగా వెళుతున్న వాహనదారులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. అక్కడకు చేరుకున్న పోలీసులు 108లో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మల్లికార్జునరావును పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్టు ధ్రువీకరించారు. సంఘటన స్థలాన్ని బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ బి. సాయిరమేష్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమండ్రి జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. తెల్లవారితే ఇంటికి చేరుతామనుకున్నామని, ఇంతలోనే తమ వారిని కోల్పోయామని బచ్చు ఆంజనేయులు, మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ వెనుక భాగంలో ఎటువంటి డేంజర్ ఇండికేషన్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పొగమంచు అధికంగా ఉండడంతో, దగ్గరకు వచ్చే వరకూ లారీ కనిపించలేదని వ్యాన్ డ్రైవర్ వెంకన్నబాబు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement