ప్రత్తిపాడు/సంజామల: అప్పుల బాధకు రాష్ట్రంలో ఇద్దరు కౌలు రైతులు బలయ్యారు. అప్పులు తీర్చలేమన్న బెంగతో గుంటూరు జిల్లాలో వరి రైతు, కర్నూలు జిల్లాలో పత్తి రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామానికి చెందిన వరగాని సురేష్ (35) నాలుగేళ్లుగా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని వరిపంట సాగు చేస్తున్నాడు.
సాగు కోసం మూడేళ్ల నుంచి వరుసగా అప్పులు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా వేజెండ్లలో పది ఎకరాల్లో వరి పైరును సాగు చేశాడు. ఇప్పటివరకు మొత్తం రూ.2.50 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఇంకా పెట్టుబడులకు అప్పులు ఎక్కడా పుట్టకపోవడం, పైరు సైతం ఆశాజనకంగా లేకపోవడంతో సురేష్ రెండు మూడు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రత్తిపాడు వెళ్లి పొలానికి పురుగు మందులు కొనుక్కుని వస్తానని చెప్పి మార్గమధ్యంలో ఉన్న పొలంలోకి వెళ్లి జమ్మి చెట్టుకు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని తల్లి సామ్రాజ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడేళ్లుగా పంట నష్టాలతో..
కర్నూలు జిల్లా సంజామల మండలం ఆల్వకొండ గ్రామానికి చెందిన కౌలురైతు దూదేకుల ఉసేన్‌వలి(25) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉసేన్‌వలి ఐదేళ్ల పాటు రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సీడ్‌పత్తి సాగు చేశాడు. మూడేళ్లుగా వరుస పంట నష్టాలొచ్చాయి. ఈ మూడేళ్లలో పంటల సాగు, ఇతరత్రా అవసరాలకు చేసిన అప్పులు రూ.3 లక్షలకు చేరాయి.
కౌలు గుర్తింపు కార్డు లేకపోవడంతో పంటరుణాలేవీ పొందలేకపోయాడు. ఏడాది క్రితం వ్యవసాయం మానేసి ఓ కాంట్రాక్టరు వద్ద పనిలో చేరాడు. ఆ డబ్బులు కుటుంబపోషణకే సరిపోయేవి. దీంతో ఇక అప్పులు తీర్చలేనన్న బెంగతో శుక్రవారం విషపు గుళికలు మింగాడు. అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఇతనికి భార్య ఉస్సేనమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం భార్య 8 నెలల గర్భిణి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment