తొందరగా వెళ్లిపోయావ్‌ మిత్రమా! | Sportss activites tributes ro bollywood MS Dhoni Sushant Singh Rajput | Sakshi
Sakshi News home page

తొందరగా వెళ్లిపోయావ్‌ మిత్రమా!

Published Mon, Jun 15 2020 4:01 AM | Last Updated on Mon, Jun 15 2020 4:01 AM

Sportss activites tributes ro bollywood MS Dhoni Sushant Singh Rajput - Sakshi

న్యూఢిల్లీ: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బాలీవుడ్‌ నటుడే కానీ క్రికెట్‌ చూసే ప్రతీ ఒక్కరికీ అతనో ‘బాలీవుడ్‌ ఎంఎస్‌ ధోని’. భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘ఎంఎస్‌ ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమాలో మహి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అతను క్రికెట్‌ వర్గాలకు సుపరిచితుడయ్యాడు. డిప్రెషన్‌ కారణంగా 34 ఏళ్ల సుశాంత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో క్రికెట్‌ వర్గాలు విస్తుపోయాయి. పలువురు క్రికెటర్లు సుశాంత్‌ విషాదాంతంపై విస్మయానికి లోనయ్యారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు మిత్రమా అంటూనే... ఈ వార్త అబద్ధమైతే బావుండంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు.  

సుశాంత్‌ మరణం కలిచి వేస్తోంది. అతనో ప్రతిభావంతుడైన యువ నటుడు. వారి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.     
–సచిన్‌ టెండూల్కర్‌

ఈ వార్త విని షాకయ్యా. ఇది జీర్ణించుకోవడం కష్టం. దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్నివ్వాలి.
– కోహ్లి

దీన్ని నమ్మాలనిపించట్లేదు. చాలా బాధగా ఉంది. నీ ఆత్మకు శాంతి కలగాలి బ్రదర్‌.     
–రోహిత్‌ శర్మ

షాకింగ్, నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. సుశాంత్‌ కుటుంబం కోసం ప్రార్థిస్తా.
–శిఖర్‌ ధావన్‌

జీవితం సున్నితమైనది. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందరితో దయతో మెలగండి. ఓం శాంతి.     
–వీరేంద్ర సెహ్వాగ్‌

నిజంగా దీన్ని నమ్మలేను. ఓ ప్రతిభావంతుడైన యువకుడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు. లోపలి సంఘర్షణను ఎవరూ తెలుసుకోలేరు.
    –యువరాజ్‌ సింగ్‌

మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన సందర్భమిది. సుశాంత్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.     
–వీవీఎస్‌ లక్ష్మణ్‌  

నీకు ఇంకా చాలా అందమైన జీవితం ఉంది. చాలా తొందరగా వెళ్లిపోయావు సుశాంత్‌.
    –షోయబ్‌ మలిక్‌ (పాక్‌ క్రికెటర్‌)

షాకింగ్‌. చాలా తొందరగా వెళ్లిపోయావు. ఆన్‌స్క్రీన్‌ ధోనిని కోల్పోయాం.    
–సైనా నెహ్వాల్‌ (స్టార్‌ షట్లర్‌)

సుశాంత్‌ మనం ఇద్దరం కలిసి టెన్నిస్‌ ఆడదామని చెప్పావ్‌. నువ్వున్న చోటల్లా సంతోషం, నవ్వులు పంచావ్‌. చివరకు ఇంత బాధపెడతావ్‌ అనుకోలేదు. హృదయం బద్ధలవుతోంది.                                  –సానియా మీర్జా (టెన్నిస్‌ స్టార్‌)

ఆ అందమైన నవ్వు వెనక ఎంత సంఘర్షణ దాగుందో తెలుసుకోలేకపోయాం. చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు. మేం నిన్ను కోల్పోయాం.             
–మిథాలీ రాజ్‌

ఎవరైనా ఇది అబద్ధమని చెప్పండి. సుశాంత్‌ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.     
–హర్భజన్‌

ఈ విషాదాంతం షాకింగ్‌గా ఉంది. కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం.     
–రవిశాస్త్రి

మనం ఒక అందమైన పిల్లాడిని, విద్యావంతుణ్ని, కష్టపడి విజయాన్ని సాధించిన వ్యక్తిని కోల్పోయాం. ధోని సినిమా కోసం 9 నెలలు ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా ప్రాక్టీస్‌ చేశాడు. హెలికాప్టర్‌ షాట్‌లో పరిపూర్ణత సాధించాడు. ఎన్ని గాయాలు తగిలినా వికెట్‌కీపింగ్‌ కోసం సిద్ధంగా ఉండేవాడు. అద్భుతమైన తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించాడు. నమ్మలేకపోతున్నా.
–కిరణ్‌ మోరే
(ధోని బయోపిక్‌ కోసం భారత మాజీ వికెట్‌ కీపర్‌ మోరే వద్ద సుశాంత్‌ శిక్షణ తీసుకున్నాడు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement