
నీ వెంటే.. నేను..
గోదావరిలో దూకిన తన తమ్ముడి ఆచూకీ ఎంతకీ లభ్యం కాలేదని మనస్తాపంతో అన్నయ్య కూడా అదే ప్రాంతంలో నదిలో దూకడంతో ఇరువురూ గల్లంతయ్యారు. ఈ ఘటన కొవ్వూరులో
కొవ్వూరు : గోదావరిలో దూకిన తన తమ్ముడి ఆచూకీ ఎంతకీ లభ్యం కాలేదని మనస్తాపంతో అన్నయ్య కూడా అదే ప్రాంతంలో నదిలో దూకడంతో ఇరువురూ గల్లంతయ్యారు. ఈ ఘటన కొవ్వూరులో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలో ఇందిరమ్మకాలనీలో ఉంటున్న కొన శ్రీధర్(28) శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో మోటారు సైకిల్‌పై బయలుదేరి రోడ్డు కం రైలు వంతెనకు చేరుకున్నాడు. కారణమేమిటో తెలియదుకాని మోటారు సైకిల్‌ను వంతెనపైనే వదిలేసి గోదావరి నదిలో దూకాడు. అతని బంధువులు, కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని జాలర్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి కూడా తన సోదరుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మనస్తాపానికి లోనైన అతని సోదరుడు కొన మహేంద్ర (48)వంతెనపై నుంచి నదిలోకి దూకాడు.
ఇద్దరి ఆచూకీ కోసం నదిలో రెండు పడవల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. రోడ్డు కం రైలు వంతెన నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకు వెతుకుతున్నారు. సాయంత్రానికి కూడా ఇరువురి ఆచూకీ దొరకలేదు. అన్నదమ్ములిద్దరూ పెయింటర్స్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీధర్‌కు భార్య, పన్నెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఉదయం శ్రీధర్ ఇంట్లో కొత్త దుస్తులు కట్టుకుని గుడికి వెళ్లి వచ్చాడని తర్వాత మోటారు సైకిల్ వేసుకుని బయటకు వెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మహేంద్ర.. వేములూరు పంచాయతీ శివారు దొరయ్య చెరువు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇతని భార్య నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. అన్నదమ్ములు ఇరువురూ నదిలో దూకి గల్లంతవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.