ఉద్విఘ్నం... ఉద్రిక్తం
ఉద్విఘ్నం... ఉద్రిక్తం
Published Wed, Sep 20 2017 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
రోడ్డు ప్రమాదంపై స్థానికుల ఆందోళన
పోలీసుల ఓవరాక్షన్‌కు నిరసనగా రోడ్డుపై బైఠాయింపు
పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన మృతుడి బంధువు
కొవ్వూరు రూరల్:
పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈజీకే (ఏలూరు, గుండుగొలను, కొవ్వూరు) రోడ్డులో కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద గుర్తు తెలియని వాహనం డీకొట్టడంతో అదే గ్రామానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ తూతా రమేష్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతుడి బంధువులు, గ్రామస్థులు స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ముదునూరి నాగరాజు, జెడ్‌పీటీసీ గారపాటి శ్రీదేవి, సొసైటీ అద్యక్షుడు గారపాటి శ్రీరామకృష్ణల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మృతదేహం వద్దే టెంట్లు వేసి ఉదయం 10.30 గంటల నుంచి అక్కడే భైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ పి. ప్రసాదరావు బాధితులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని, రోడ్డు పరిమితికి మించి వాహనాలు వెళుతున్నాయని, కేవలం గామన్‌బ్రిడ్జి టోల్‌గేట్ ఆదాయం కోసం భారీ వాహనాలను ఇటువైపు మళ్లిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో బి. శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించాల్సిందిగా తహసిల్దార్ విజయకుమార్‌ను ఆదేశించడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని వారితో చర్చించారు. అసలు గామన్ వంతెనపై నుంచి వెళ్లడానికి అనుమతులు లేవని, అనధికారికంగా టోల్‌గేట్ వసూలు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే వాహనాల రాకపోకలను అడ్డుకుంటామంటూ స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ముదునూరి నాగరాజు, జెడ్‌పీటీసీ గారపాటి శ్రీదేవిలు కొందరు ఆందోళనకారులతో కలిసి గామన్ వంతెన ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఐరన్ పైపులతో వాహనాలు వెళ్లకుండా కాంక్రీట్‌తో బారికేడ్లను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్‌పీ వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను హెచ్చరించారు. అవసరం అయితే మృతదేహం వద్ద ధర్నా చేసుకోండని, రోడ్డు మార్గాన్ని మూస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో అందరిని అరెస్టు చేయాలంటూ ఆందోళనకారులతో కలిసి జెడ్‌పీటీసీ గారపాటి శ్రీదేవి, ముదునూరి నాగరాజులు రోడ్డుపై భైఠాయించారు. పరిస్థితి అందోళనకరంగా మారుతున్న దశలో ఆర్డీవో శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గుండుగొలను వద్ద నుంచి ట్రాఫిక్ మళ్లించడం జరిగిందని, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా గామన్ వంతెనపైకి భారీ వాహనాలు రాకుండా అక్కడి కలెక్టర్‌తో పశ్చిమ కలెక్టర్ మాట్లాడారని, బుధవారం నుంచి గామ¯Œన్ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఆర్డీవో సూచనతో ఆందోళనకారులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చించి వెంటనే మీకు తెలియజేస్తామని అక్కడి నుంచి గ్రామంలోని మృతదేహం వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, రాజమండ్రి నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఐరన్ పైపులను పోలీసులే తొలగించి ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.
ఆందోళనకారులతో పోలీసుల చర్చలు
ఆందోళనకారులతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పలు ధపాలుగా చేసిన చర్చలు విఫలం అవడంతో ఆందోళన తీవ్రతరమయ్యింది. డీఎస్‌పీ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ విజయకుమార్‌తో ఆర్‌అండ్‌బీ ఈఈ ఆందోళనకారులతో చర్చించారు. మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకోవాలని, ప్రమాదమానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి చంద్రన్న బీమా, ప్రమాదబీమా ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అయితే గామన్ బ్రిడ్జి పైకి భారీ వాహనాల రాకపోకలే ప్రధాన కారణంగా చెబుతూ మృతుడి కుటుంబానికి టోల్‌గేట్ నిర్వాహకుల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని, లేని పక్షంలో మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకోమని హెచ్చరించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి చర్యలు చేపట్టారు.
మృతదేహాన్ని తరలించే సమయంలో ఉద్రిక్తత
ఆందోళనకారులతో చర్చలు సఫలం కాకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో మృతుడి బంధువైన ఓ యువకుడు న్యాయం చేయకుండా మృతదేహాన్ని తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొవ్వూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో సంఘటనా ప్రాంతంలో వేసిన టెంటులను పోలీసులే తొలగించారు. మహిళలని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా మృతదేహం వద్ద నుంచి బలవంతంగా ఈడ్చుకుపోయారు. పోలీసులను అడ్డుకున్నారంటూ మరో ఇద్దరు యువకులను కొట్టి ఈడ్చుకుంటూ లాక్కుపోయారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అదే సమయంలో పోలీసులు బంధువులను చెదరగొట్టి మృతదేహాన్ని ఆటోలో కొవ్వూరు ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు.
న్యాయం చెయ్యమంటే కొడతారా
తమకు న్యాయం చెయ్యమని ఆందోళన చేస్తుంటే పోలీసులు కొడతారా అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Advertisement
Advertisement