నవాబుపేట: బంధువుల ఇంట్లో జరిగే పూజకు వెళ్లొద్దని భార్య చెప్పడంపై క్షణికావేశానికి గురైన భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కామారంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కామారం గ్రామానికి చెందిన సూర్యనారాయణ (36) ఈనెల 18న తమ బంధువుల ఇంట్లో పూజకు వెళ్దామని తన భార్య నాగమణికి చెప్పగా.. ఆమె ఒప్పుకోలేదు.
మరుసటి రోజు వెళ్దామని చెప్పడంతో క్షనికావేశానికి గురైన సూర్యనారాయణ.. ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ ఆనంద్ తెలిపారు.
వరికోత యంత్రం కింద పడి వ్యక్తి మృతి
చిన్నంబావి: వరికోత యంత్రం కింద పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని వెలగొండలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరంగాపూర్ మండలంలోని జానంపేటకి చెందిన నరేష్(26) వరి పంటను కోత కోసేందుకు మండలంలోని వెలగొండకి వచ్చాడు.
వరి కోత యంత్రం చెడిపోవడంతో దానిని మరమ్మతు చేసేందుకు యంత్రం కిందికి దిగిడు. మరమ్మతు చేస్తున్న క్రమంలో యంత్రం పైభాగం మీద పడి యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై స్థానిక ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డిని వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని, తమ దృష్టికి వచ్చిందని, పూర్తి స్థాయిలో విచారించి కేసు నమోదు చేస్తామన్నారు.
బస్సులో నుంచి కిందపడి వ్యక్తి దుర్మరణం
చారకొండ: బస్సులో నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని మర్రిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవి కథనం మేరకు.. మర్రిపల్లికి చెందిన గండికోట అంజయ్య (55) గురువారం వ్యక్తిగత పని నిమిత్తం దేవరకొండకు వెళ్లి రాత్రి గ్రామానికి చేరుకొని నడుస్తున్న బస్సులో నుంచి దిగే ప్రయత్నం చేసి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో గ్రామస్తులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. శుక్రవారం అంజయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు..
కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి మండలంలోని ఎల్లికట్టకు చెందిన గీత కార్మికుడు చంద్రయ్యగౌడ్ (60) శుక్రవారం తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. కులవృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్న చంద్రయ్యగౌడ్.. రోజు మాదిరిగానే కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు.
కల్లు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. అతడిని కుటుంబ సభ్యులు కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రమేష్ యాదవ్ తెలిపారు.
అనారోగ్యంతోయువకుడి ఆత్మహత్య
మల్దకల్: అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతిచెందాడు. ఈ సంఘటన మల్దకల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్‌కి చెందిన వడ్ల మోనాచారి(31) కొంత కాలంగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు.
దీంతో జీవితంపై విరక్తి చెంది గ్రామ సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రాధమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment