కష్టాలు ఉచితం
Published Fri, Apr 1 2016 1:00 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
ఇసుక ఉచితమే అయినా.. ఖర్చులు తడిసిమోపెడు
ఇబ్బందుల పాల్జేస్తున్న నూతన విధానం
చెంతనే గోదావరి ఉన్నా ఇసుక దొరకని పరిస్థితి
అయిన వారికి అడ్డదారిలో లోడింగ్
కిలోమీటర్లకొద్దీ బారులు తీరుతున్న వాహనాలు
ర్యాంపుల్లో బాట ఖర్చుల పేరుతో దోపీడీ
కొవ్వూరు/నిడదవోలు : ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. జిల్లాలో 11 ర్యాంపులకు అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం 6 ర్యాంపులే నడుస్తున్నాయి. సర్కారు ప్రకటించిన నూతన విధానం అమలుపై పర్యవేక్షణ కొరవడటం, లోపభూయిష్టమైన మార్గదర్శకాలు జనం పాలిట శాపంగా మారాయి. పోలవరం నుంచి నిడదవోలు మండలం పందలపర్రు వరకు గోదావరి తీరంలో సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ర్యాంపులు లేకపోవడంతో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. గోదావరి చెంతనే ఉన్న గ్రామాల వారు సైతం దూర ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చుకోవాల్సి రావడంతో రవాణా చార్జీలు భారంగా పరిణమించాయి. కనీసం
అనుమతిచ్చిన ర్యాంపుల్లోకి వెళ్లి ఇసుక తెచ్చుకుందామన్నా.. అనువైన బాటలు లేక అవస్థలు పడుతున్నారు. టీడీపీ నాయకులు దీనిని ఆసరాగా చేసుకుని బాట ఖర్చుల పేరిట సొమ్ములు గుంజుకుంటున్నారు.
ఉచితమే అయినా.. ఖర్చయ్యేది పాత ధరలే
ర్యాంపుల్లో లోడింగ్ చార్జీల పేరిట అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని.. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ధరలపై ఎక్కడా నియంత్రణ లేకుండాపోయింది. ఇసుకను ఉచితంగా ఇస్తున్నప్పటికీ.. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో విక్రయించిన ధరలనే ఇప్పుడు కూడా వెచ్చించాల్సి వస్తోంది. డ్వాక్రా సంఘాల హయాంలో సిద్ధాంతం ర్యాంపు నుంచి పెనుగొండకు ఒక ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు అన్ని ఖర్చులతో కలిపి రూ.2,600 వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నా ట్రాక్టర్ ఇసుకకు లోడింగ్, రవాణా ఖర్చులు కలిపి రూ.2,200 నుంచి రూ.2,400 అవుతోంది. అదే ర్యాంపు నుంచి తణుకు పట్టణానికి ట్రాక్టర్ ఇసుకకు డ్వాక్రా సంఘాల హయాంలో రూ.3,300 ఖర్చయ్యేది. ఇప్పుడు రూ.3 వేలు అవుతోంది.
లోడింగ్ చార్జీల ముసుగులో దోపిడీ
యూనిట్ ఇసుకను లోడింగ్ చేయడానికి రూ.175 చార్జీగా నిర్ధేశించారు. ఆచంట మండలం కరుగోరుమిల్లి ర్యాంపులో యూనిట్‌కు ఏకంగా రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే కూలీలను అధికార పార్టీ నాయకులు తమ చెప్పు చేతల్లో పెట్టుకుని.. వారికి రోజువారీ కూలీ కింద రూ.500 చొప్పున ముట్టజెప్పుతూ అదన పు ధరలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ ర్యాంపునుంచి నిత్యం సుమారు 50 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటివరకూ సుమారు 400 యూనిట్లకు పైగా ఇసుకను విక్రయించారు. ఈ ర్యాంపులో టీడీపీ నేతలు దందాసాగిస్తున్నా రెవెన్యూ, పోలీసులు యంత్రాగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మిగిలిన చోట్లా ఇంతే
పెనుగొండ మండలం సిద్ధాంతంలో వారం రోజుల నుంచి ఉచిత ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ కార్మికుల సంఖ్య వెయ్యికి పైగా ఉండటంతో వారి అదుపాజ్ఞల్లోనే ర్యాంపు నడుస్తోంది. ర్యాంపు నుంచి ఇసుకను బయటకు తెచ్చుకోవడానికి అనువుగా బాటలు నిర్మించడానికి ఎమ్మెల్యే ఓత్తిడి చేసినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కార్మికులు తాత్కాలిక బాటలు వేసుకుని ఎగుమతులు చేస్తున్నారు. బాట ఖర్చును కార్మికులు భరింంచాల్సి రావడంతో యూనిట్ అసుకకు అదనంగా రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. రోజుకు 250 ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి ఎగుమతి అవుతోంది. బాటలు సరిగా లేకపోవడంతో లారీలకు ఎగుమతులు చేయడానికి కార్మికులు నిరాకరిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ ర్యాంపు నుంచి సుమారు 10 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఎగుమతులు జరిగినట్టు అంచనా.
ఇదిలావుంటే.. నిడదవోలు మండలం పందలపర్రు, పెండ్యాల-కానూరు ర్యాంపుల్లో ఉచిత ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కార్మికులు తాత్కాలిక బాటలు వేసి ఎగుమతులు చేస్తున్నారు. కొబ్బరి ఆకుల ఖర్చులు, లేబర్ ఖర్చుల, బాట ఖర్చుల పేరుతో యూనిట్‌కు రూ.500 నుంచి రూ.550 వరకు వసూలు చేస్తున్నారు. ఈ రెండు ర్యాంపుల ద్వారా రోజుకు సుమారు 400 ట్రాక్టర్ల ఇసుక ఎగుమతి అవుతోంది. సుమారు 25వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తరలించినట్టు అంచనా. నాలుగు రోజుల క్రితం కొవ్వూరు మండలం వాడపల్లిలో ర్యాంపు తెరిచినప్పటికీ ఇక్కడి నుంచి కేవలం పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు మాత్రమే ఇసుక తరలిస్తున్నారు.
బాటల్లేక నిరుపయోగంగా ఐదు ర్యాంపులు
జిల్లాలో విలీమైన వేలేరుపాడు మండలం రుద్రమకోట, తిరుమలాపురం, రేపాకగొమ్ము ర్యాంపులతోపాటు కుక్కునూరు మండలం వింజరం, ఇబ్రహీంపట్న(గణవరం), దాచారం ర్యాంపులల్లో ఇసుక తవ్వకాలను అనుమతులున్నాయి. ఈ ర్యాంపుల్లోకి వాహనాలు వె ళ్లేందుకు బాటలు లేవు. ఆ రెండు మండలాల్లో 6 ర్యాంపులు ఉన్నా.. దారులు లేకపోవడంతో ఒక్క రుద్రమకోట ర్యాంపులో మాత్రమే తవ్వకాలు సాగుతున్నాయి. మిగిలిన ఐదు ర్యాంపులు నిరుపయోగం ఉన్నాయి. పైగా కొన్ని ర్యాంపుల నుంచి తెలంగాణ ప్రాంతానికి ఇసుక తరలిస్తున్న సమాచారం.
పందలపర్రు ర్యాంపు వద్ద కిలోమీటర్లకొద్దీ బారులు
పందలపర్రు ర్యాంపు నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు నిత్యం పెద్దఎత్తున వాహనాలు వస్తున్నాయి. ఏ సమయంలో చూసినా ర్యాంపు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరి ఉంటున్నాయి. బయటినుంచి వచ్చిన వాహనాలను క్రమపద్ధతిలో (వరుస సంఖ్యలో) ర్యాంపుల్లోకి అనుమతించడం లేదని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆ గ్రామం నుంచి వచ్చే వాహనాలతోపాటు ఏటుగట్టు మీదుగా వచ్చే కొందరు నాయకుల వాహనాలను అక్రమంగా ర్యాంపుల్లోకి తీసుకెళ్లి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement