అంతా క్షణాల్లోనే.. | Two Man Death Fire Accident pharma Company | Sakshi
Sakshi News home page

అంతా క్షణాల్లోనే..

Published Mon, Aug 12 2019 9:43 AM | Last Updated on Mon, Aug 12 2019 10:44 AM

Two Man Death Fire Accident pharma Company - Sakshi

సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం జిల్లా): ఉపాధి చూపిన పరిశ్రమే ఉసురు తీసింది.. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. నాన్న ఇంటికి వస్తాడని, తినుబండారాలు తెస్తాడని ఎదురుచూస్తున్న పిల్లలకు.. ఇక మీ నాన్న రాడన్న చేదు నిజం ఎలా చెప్పాలో తెలీక బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతి చెందిన కార్మికులిద్దరూ గుర్తు పట్టలేని విధంగా కాలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు అంతే లేదు. పరిశ్రమలోని కార్మికులు, పరిశ్రమ ప్రతినిధులు తెలిపిన వివరాలు ప్రకారం ఆదివారం పైడిభీమవరంలో ఉన్న అరబిందో పరిశ్రమలోని పవర్‌ ప్లాంట్‌లో సబ్‌ కాంట్రాక్ట్‌ అయిన త్రివేణి పవర్‌ కాంట్రాక్ట్‌లో పనిచేస్తున్న సేఫ్టీ ఆపరేటర్‌ రెడ్డి రాహుల్‌ (28), బాయిలర్‌ ఆపరేటర్‌ బొమ్మాలి రాజారావు (35)లు, మరో కార్మికుడు యందువ సన్యాసిరావు ఏ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో బాయిలర్‌ ప్లాంట్‌–3ని మండించేందుకు బొగ్గు సరఫరా చేరే కూలింగ్‌ పైపులను పర్యవేక్షిస్తున్న ముగ్గురిపైకి ఒక్కసారిగా మంటలు వచ్చాయి.

ఈ ప్రమాదంలో రాహుల్, రాజారావు అక్కడికక్కడే గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. యందువ సన్యాసిరావు కిందకు దూకేయడంతో కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. బాయిలర్‌–3లో ఈఎస్‌పీ సమస్య వల్ల టెంపరేచర్‌ పెరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ బాయిలర్‌ ప్లాంట్‌ సాంకేతిక సమస్యలతో గత 20 రోజులుగా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని అక్కడ పనిచేస్తున్న కార్మికులు చెబుతున్నారు. నైపుణ్యం కల్గిన ఇంజినీర్లను పిలిచి బాగు చేయాలని పరిశ్రమ యాజమాన్యానికి చెప్పినా వినిపించుకోలేనదని వారు ఆరోపిస్తున్నారు. రాజారావు అనే కార్మికుడికి అదే బాయిలర్‌ ప్లాంట్, అదే స్థలంలో రెండేళ్ల క్రితం చేయి కాలిపోయిందని, ప్రస్తుతం పూర్తిగా అతనే లేకుండా పోయాడని తోటి కార్మికులు చెబుతున్నారు.

మృతుల పిల్లలంతా పసివారే..
ప్రమాదంలో మరణించిన రెడ్డి రాహుల్‌ది విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వివేకానందకాలనీ. ఇతనికి భార్య గాయత్రి, మూ డేళ్ల బాబు ఉన్నారు. బోమ్మాలి రాజారావుది శ్రీకాకుళం జిల్లా పలాస. ఇతనికి భార్య దేవి, ఇద్దరు చిన్నారి కుమార్తెలు ఉన్నారు. వీరు గత కొన్నేళ్లుగా రణస్థలంలో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. గాయాలపాలైన యందువ సన్యాసిరావుది రణస్థలం మండలంలోని నెలివాడ గ్రామం. సన్యాసికి విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన.. 
చనిపోయిన రాజారావు, రాహుల్‌ కుటుంబాలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాకే మృతదేహాలను ఇక్కడి నుండి శవపంచనామాకు తరలించాలని తొలుత కార్మికులు ఆందోళన చేశారు. పరిశ్రమలోనికి ప్రవేశించిన పోలీసులను, పరిశ్రమ ప్రతినిధులను అడ్డగించారు. శ్రీకాకుళం ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, డీఎస్పీ చక్రవర్తి ఎన్‌.వి.ఎస్‌ చక్రవర్తి నేతృత్వంలో జె.ఆర్‌.పురం సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు, పొందూరు, నరసన్నపేట, రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు, తదితర ఎస్సైలు 150 మంది పోలీసులు కార్మికుల ఆందోళనను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేశారు.

మృతి చెందిన కార్మికులకు రూ.36 లక్షల పరిహారం
రాహుల్, రాజారావుల కుటుంబాలకు రూ. 36 లక్షల వంతున పరిహారం ఇచ్చేందుకు యాజ మాన్యం అంగీకరించింది. పోలీసులు, కుటుం బ సభ్యులు, రెవెన్యూ అధికారులు, కార్మిక సంఘ నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులతోపాటు పలువురు అరబిందో పరిశ్రమ యాజ మాన్యంతో చర్చలు జరిపారు. పరిహారంతోపా టు ఒకరికి ఉద్యోగం, పిల్లలకు ఇంటర్‌ వరకు ఉచిత విద్య యాజమాన్యం అందించనుంది.

చూస్తుండగానే కాలిపోయారు..
బాయిలర్‌లో ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. కాపాడమని ఆర్తనాదాలు చేస్తూనే రాహుల్, రాజారావు కాలిపోయా రు. నేను దిక్కుతోచక 20 అడుగుల పైనుం చి దూకేశాను. మేము పనిచేసే దగ్గర గత నెల రోజులుగా సాంకేతిక సమస్య ఉందని పరిశ్రమ యాజమాన్యానికి బాయిలర్‌ ఆ పరేటర్లు ఎన్నోసార్లు చెప్పారు.  
–గాయపడ్డ కార్మికుడు  సన్యాసిరావు

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌
పోలాకి: రణస్ధలం మండలం పైడిభీమవరం అరబిందో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఫార్మా పరిశ్రమలో ప్రమాదం గురించి మంత్రి ఆరా తీశారు. తక్షణం బాధితులకు అండగా వుండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం పూర్తిస్ధాయిలో అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని సైతం ఆదుకుంటామని చెప్పారు.    

మృతుడు రాజారావు ఇంటి వద్ద విషాదం

కాశీబుగ్గ: అరబిందో ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు బోమ్మాళి రాజారావు ఇంటి వద్ద విషాదం నెలకొంది. అతని స్వస్థలం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉదయపురం. మున్సిపల్‌ కార్యాలయం అవుట్‌గేటు సమీపంలో కామాక్షమ్మ గుడి వద్ద ఉన్న రాజారావు ఇంటి వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు విషాద వదనాలతో దిగాలుగా కూర్చున్నారు. మృతదేహాన్ని పలాసకు ఆదివారం రాత్రి తీసుకువస్తున్నట్టు బంధువులు తెలిపారు. చిన్నమ్మడు, లక్ష్మణరావు దంపతుల ఇద్దరు కుమారులలో పెద్దవాడు రాజారావు. ఈ ఘటనలతో మృతుడి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు దీపిక, రష్మిత అనాథలయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement