సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కింగ్‌జార్జ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంపెనీలోని రెండు రియాక్టర్లు పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు.
ఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. సాహితీ ఫార్మా కంపెనీలోప్రమాదం జరిగిందన్నారు. సమాచారం రాగానే తమ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కంపెనీలో 35 మంది కార్మికులు విధుల్లో ఉండగా.. 28 మంది బయటకు వచ్చేశారని పేర్కొన్నారు. ఏడుగురికి తీవ్ర గాయలవ్వగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో రెండు గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు.
విషమంగానే పరిస్థితి
సాహితీ ఫార్మా కంపెనీలో గాయపడిన వారందరి పరిస్థితి విషమంగా ఉందని కింగ్‌జార్జ్ ఆసుపత్రి సూపరిండెంట్ శివానంద తెలిపారు. మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వారందరికీ దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని చెప్పారు.
మొదట ముగ్గురిని ఆసుపత్రికి తీసుకొచ్చారని తరువాత కిమ్స్ ఐకాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మిగతా నలుగురిని కూడా అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఇక్కడికి షిఫ్ట్ చేశారని తెలిపారు. క్షతగాత్రులను బర్నింగ్ వార్డుకు షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు.
గాయపడిన వారి వివరాలు..
ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన రమేష్ (45),రాంబిల్లి మండలం జనగాలపాలేనికి చెందిన సత్తిబాబు (35), రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెం వాసి నూకి నాయుడు (40), విజయనగరానికి చెందిన తిరుపతికి(40)తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం రెబ్బాకకు చెందిన రాజుబాబు, నక్కపల్లికి చెందిన అప్పారావు (43), అనకాపల్లి జిల్లా కొండకొప్పాకకు చెందిన పిల్లా సంతోష్ కుమార్, గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment