ఆస్పరి: మండల పరిధిలోని హలిగేరి గ్రామంలో పాతకక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. తలారి వర్గీయులు.. బంగి వర్గానికి చెందిన బంగి శ్రీనివాసులు(50), బంగి మల్లయ్య(40)లను దారుణంగా హత్య చేశారు. ఘటనలో రామాంజినేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జంట హత్యలతో గ్రామం వణికిపోతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బంగి, తలారి వర్గీయుల మధ్య 2011 సంవత్సరం నుంచి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి.
మంగళవారం బంగి శ్రీనివాసులు, బంగి మల్లయ్యలు ఎరువులు తీసుకొచ్చేందుకు రామాంజినేయులు ఆటోలో ఆదోనికి బయలుదేరారు. సాయంత్రం హలిగేరికి తిరిగొస్తుండగా శివారులో తలారి వర్గానికి చెందిన అంజినయ్య, మరికొందరు రాళ్లతో దాడి చేయడంతో డ్రైవర్ ఆటోను ఓ పక్కన నిలిపేశాడు. ఆ వెంటనే ఆటోలోని బంగి శ్రీనివాసులు, బంగి మల్లయ్యలను కత్తులు, వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. డ్రైవర్ భయంతో పరుగు తీయగా వెంబడించి నరికి పరారయ్యారు.
గాయపడిన రామాంజనేయులును బంధువులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన వెంటనే ఆస్పరి ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, కిరణ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, ఆలూరు సీఐ శంకరయ్యలు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హత్యలకు కారణాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత హత్యోదంతాలకు పాత కక్షలే కారణమని తెలిపారు. గ్రామంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హలిగేరిలో ఇద్దరి దారుణ హత్య
Published Wed, Jul 9 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement