ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
Published Thu, Oct 17 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
పెనుబల్లి, న్యూస్‌లైన్: ద్విచక్రవాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పెనుబల్లి పంచాయతీ పరిధిలోని వీఎంబంజర వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం ముగ్గువెంకటాపురం పంచాయతీ పరిధిలోని చైతన్య నగర్ ఎస్సీ కాలనీకి చెందిన కలేపల్లి బాబూరావు (40) కలప నరికే పనులకు వీఎంబంజర వచ్చాడు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో తెచ్చిన కలపను రోడ్డు పక్కనే దింపారు. అనంతరం ఆటో రోడ్డు అవతలి వైపు ఉన్న వే బ్రిడ్జి వద్దకు వెళ్లింది.
ఈ క్రమంలో బాబూరావు ఆటో వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా టేకులపల్లి నుంచి పెనుబల్లి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో బాబూరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తోటి కూలీలు పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ విషయాన్ని తోటి కూలీలు బాబూరావు కుటుంబానికి తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలివచ్చారు. బాబూరావు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని వీఎంబంజర ఎస్సై ఇ. చంద్రమౌళి పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement