జ్వరంతో ఇద్దరు మహిళల మృతి
Published Fri, Sep 27 2013 3:25 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
కొత్తూరు, న్యూస్‌లైన్ : కొత్తూరులో జ్వరాలు విజృంభించాయి. జ్వరంతో బాధపడుతూ ఇద్దరు మహిళలు మృతి చెందడ ంతో కొత్తూరు వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి పక్కనే గల రెల్లివీధిలో జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. మలేరాయితో రెల్లివీదికి చెందిన కోల పార్వతి (35) బుధవారం, పడాల వీధికి చెందిన వండాన ప్రమీల (21) శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ప్రమీలకు భర్త గోవిందరావు, ఏడాదిన్నర చిన్నారి దీపిశ్రీ ఉన్నారు. పార్వతికి భర్త త్రినాథరావు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
జ్వరాలతో బాధపడుతున్న రెల్లివీధికి చెందిన దూలి రంజిత, కుమారి, కోల ఉషతో పాటు పలువురు జ్వరపీడితులను వారి బంధువులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తీసుకువెళ్లారు. మండల కేంద్రంలో వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వైద్యసిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో ప్రైవేట్ ఆస్పత్రులకు, శ్రీకాకుళంలోని ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందన్నారు.
రక్తకణాలు తగ్గడంతో బుధవారం పార్వతిని మృతి చెందిన తర్వాత కూడా వైద్యసిబ్బంది చికిత్స చేసేందుకు రాలేదని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలతో రెల్లివీధి, పలు వీధుల్లో కాలువలు, రోడ్లపై నీరు, చెత్త నిలిచిపోయిందన్నారు. కుళాయిల ద్వారా కలుషిత నీరు రావడంతో వ్యాధులు ప్రబలాయన్నారు. వైద్యసిబ్బంది స్పందించి వైద్యసేవలందించాలని రెల్లి వీధికి చెందిన బొమ్మాళి బాబూరావు కోరారు. దీనిపై స్థానిక ప్రభుత్వాస్పత్రి ప్రధాన వైద్యాధికారిని ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా, జ్వరాలు ప్రబలిన వీధుల్లో వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.
Advertisement
Advertisement