కంపెనీకి సంబంధించిన డబ్బులను హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తున్న ఉద్యోగి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 6 లక్షల రూపాయలు దోచుకున్నారు.
కంపెనీకి సంబంధించిన డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న ఉద్యోగి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 6 లక్షల రూపాయలు దోచుకున్నారు. గుంటూరు లక్ష్మీపురం ప్రాంతంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదురుగా ఈ సంఘటన జరిగింది. గుంటూరు ఎస్వీఎన్ కాలనీ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు ఓ మిర్చి కంపెనీలో ఉద్యోగి. అతడు కంపెనీకి సంబంధించిన చెక్కు తీసుకుని ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ 6 లక్షల రూపాయలు డ్రా చేసుకుని బయటకు వచ్చి, డబ్బులున్న బ్యాగును బైకు ముందు భాగంలో పెట్టుకుని బయల్దేరుతుండగా, పక్కనే నల్లటి పల్సర్ వాహనం మీద ఇద్దరు యువకులు వచ్చారు. వారిద్దరూ హెల్మెట్లు పెట్టుకునే ఉన్నారు.
వెంకటేశ్వరరావు తన వాహనం స్టార్ట్ చేసుకుని వెళ్లబోతుండగా వెనక ఉన్న యువకుడు బ్యాగ్ లాక్కున్నాడు. వెంటనే ఇద్దరూ తమ వాహనంపై దూసుకెళ్లిపోయారు. వారిని పట్టుకోడానికి వెంకటేశ్వరరావు కొంతదూరం వెళ్లినా, వాళ్లను అందుకోలేకపోయాడు. తిరిగి బ్యాంకుకు వచ్చి అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజి పరిశీలించినా, అక్కడ బ్యాంకు వద్ద పార్కు చేసిన వాహనాలు కనిపించాయే తప్ప.. రోడ్డుమీద ఉన్నవేవీ కనిపించలేదు. మూడు నెలల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఇలాగే రెండు మూడు దొంగతనాలు జరిగాయి. పట్టాభిపురం పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.