ఎం.వెంకయ్యనాయుడు, ఎం.రాజమోహన్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): ఉదయగిరి నియోజకవర్గ ఓటర్లు తీర్పు భిన్నంగా ఉంటుంది. ఎన్ని ప్రభంజనాలు వచ్చినా ప్రజలు తిప్పికొడుతూ ఇంతవరకు స్థానిక నాయకత్వాలకే బ్రహ్మరథం పట్టారు. 2012 ఉప ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజలు పట్టంగట్టారు. 1983లో టీడీపీ ఆవిర్భావంలో రాష్ట్రమంతా ఆ పార్టీ ప్రభంజనం సృష్టించగా, ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గణపం బాలకృష్ణారెడ్డి మాత్రం ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేనప్పటికీ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బొల్లినేని రామారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై విజయం సాధించారు. మరోమారు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ అభిమానులు, క్యాడర్ బలంతో బరిలోకి దిగారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 15 అసెంబ్లీ ఎన్నికల్లో(ఉప ఎన్నికతో కలిపి) కాంగ్రెస్ ఏడు సార్లు, బీజేపీ, జనతా, ప్రజాపార్టీ, స్వతంత్ర, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందగా, టీడీపీ రెండుసార్లు విజయం సాధించింది. ఎందరో ఉద్దండులకు ఉదయగిరి ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారు.
60 ఏళ్ల క్రితం నియోజకవర్గ స్వరూపం
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో నందిపాడు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బెజవాడ గోపాలరెడ్డి, ప్రజాపార్టీ నుంచి కోవి రామయ్య, సీపీఐ నుంచి కేజీ రెడ్డి తలపడ్డారు. ప్రజాపార్టీ అభ్యర్థి కోవి రామయ్య 2,379 ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత రెండు ఎన్నికలు నందిపాడు నియోజకవర్గం పేరుతోనే జరగ్గా.. ఈ రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. 1965లో పునర్విభజన చోటుచేసుకుని ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉదయగిరి అసెంబ్లీ కేంద్రంగా ఉంది. ఈ నియోజకవర్గ కేంద్రానికి 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోవి రామయ్య, స్వతంత్ర అభ్యర్థిగా ధనేంకుల నరసింహులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నరసింహులు 9,674 ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కంభం విజయరామిరెడ్డి రెండుసార్లు గెలుపొందారు. (అయితే ఒకసారి మాత్రం టీడీపీకి బి–ఫారం రాకపోవడంతో ఆ పార్టీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు).
ఉద్దండులను అందించిన ఘనత ‘గిరి’దే
ఉదయగిరి ఓటర్లు జాతీయ, రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన ఎందరో ఉద్దండులకు రాజకీయ భిక్ష పెట్టారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అలాగే వైఎస్సార్‌సీపీలో కీలకపాత్ర నిర్వహిస్తున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డికి రాజకీయ ప్రస్థానం అందించింది ఇక్కడి ఓటర్లే. అలాగే బెజవాడ గోపాలరెడ్డి, పులి వెంకటరెడ్డి, దనేంకుల నరసింహులు, మాదాల జానకిరాం, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వంటి రాజకీయ నేతలు ఇక్కడి నుంచే తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుని సఫలీకృతులయ్యారు.
నిలకడ లేని ఓటర్ల సంఖ్య
2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలకు విస్తరించింది. ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, సీతారామపురం, వరికుంటపాడు మండలాలతో పాటు అదనంగా కొండాపురం, కలిగిరి, జలదంకి మండలాలు చేరాయి. అంతకుముందు ఈ నియోజకవర్గంలో ఉన్న మర్రిపాడు మాత్రం ఆత్మకూరులో కలిసింది. 2004లో ఈ నియోజకవర్గంలో 1.2 లక్షల మంది ఓటర్లుండగా, 2009 పునర్విభజన అనంతరం ఆ సంఖ్య రెండు లక్షలకు చేరింది. ప్రస్తుతం 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోనే అత్యంత పెద్ద నియోజకవర్గంగా ఉదయగిరి మారింది.
వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీ
సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చుట్టూ అవినీతి ఆరోపణలు, విదర్భ ఇరిగేషన్ బోర్డులో చేసిన అవినీతి పనులకు సంబంధించి ఏసీబీ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈయన సిటింగ్ స్థానం నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి బరిలో నిలిచారు. రామారావుతో పాటు నియోజకవర్గంలో ముఖ్య నేతల అవినీతి తారస్థాయికి చేరటం, ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవటం, క్యాడర్‌లో గందరగోళాలు తదితర ఇబ్బందులతో టీడీపీ సతమతమవుతోంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి మాత్రం రెట్టించిన ఉత్సాహంతో నూతన చేరికలతో అదనపు బలం పెంచుకుని ప్రచారం చేస్తున్నారు.
హ్యాట్రిక్ విజయం మేకపాటిదే
నియోజకవర్గ చరిత్రలో హ్యాట్రిక్ విజయాన్ని చేజిక్కించుకున్న ఘనత మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. ఈయన ఇక్కడి నుంచి ఐదుసార్లు పోటీ చేయగా మూడుసార్లు విజయం సాధించారు. 2004, 2009, 2012(ఉపఎన్నిక)లో వరుసగా మేకపాటి విజయదుందుభి మోగించి హ్యట్రిక్ కొట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఏడుసార్లు పోటీచేసిన ఘనత కంభం విజయరామిరెడ్డికి దక్కుతుంది. ఈయన రెండు పర్యాయాలు మాత్రమే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం బొల్లినేని వెంకటరామారావు టీడీపీ తరఫున విజయం సాధించారు. ఇక్కడి ఓటర్లు అనేక సార్లు రాష్ట్ర పరిస్థితులకన్నా స్థానిక అంశాల ప్రాతిపదికనే తమ తీర్పును వెలువరించారు. ఎప్పుడు కూడా ఈ ప్రాంత ఓటర్లు భిన్నమైన తీర్పు చెప్పేందుకు ఉత్సాహంగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వలస ఓటర్లు కావడంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ ఈ నియోజకవర్గ కేంద్రంపై స్పష్టంగా కనిపిస్తాయి.
సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | సమీప అభ్యర్థి | గెలిచిన పార్టీ | ఓట్ల ఆధిక్యత |
1952 | కోవి రామయ్య చౌదరి | బెజవాడ గోపాల్‌రెడ్డి | ప్రజాపార్టీ | 2,379 |
1955 | షేక్ మౌలాసాహెబ్ | కె.గురుస్వామిరెడ్డి | కాంగ్రెస్ | 571 |
1962 | పులి వెంకటరెడ్డి | ఎస్.పి.రెడ్డి | కాంగ్రెస్ | 6,394 |
1967 | ధనేంకుల నరసింహులు | కోవి రామయ్యచౌదరి | ఇండిపెండెంట్ | 9,674 |
1972 | పి.చెంచురామయ్య | ఎం.తిమ్మయ్య | కాంగ్రెస్ | 14,214 |
1978 | ఎం.వెంకయ్యనాయుడు | మాదాల జానకిరాం | జనతా | 20,500 |
1983 | ఎం.వెంకయ్యనాయుడు | మేకపాటి రాజమోహన్‌రెడ్డి | బీజేపీ | 20,500 |
1985 | మేకపాటి రాజమోహన్‌రెడ్డి | కంభం విజయరామిరెడ్డి | కాంగ్రెస్ | 15,513 |
1989 | మాదాల జానకిరాం | కంభం విజయరామిరెడ్డి | కాంగ్రెస్ | 3,760 |
1994 | కంభం విజయరామిరెడ్డి | మాదాల జానకిరాం | ఇండి | 24,919 |
1999 | కంభం విజయరామిరెడ్డి | మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి | టీడీపీ | 4775 |
2004 | మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి | కంభం విజయరామిరెడ్డి | కాంగ్రెస్ | 23,075 |
2009 | మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి | కంభం విజయరామిరెడ్డి | కాంగ్రెస్ | 13,482 |
2012 | మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి | బొల్లినేని రామారావు | వైఎస్సార్‌సీపీ | 30,598 |
2014 | బొల్లినేని రామారావు | మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి | టీడీపీ | 3,622 |
Comments
Please login to add a commentAdd a comment