ఉదయగిరిలో ఫ్యాన్‌ ప్రభంజనమే | - | Sakshi
Sakshi News home page

ఉదయగిరిలో ఫ్యాన్‌ ప్రభంజనమే

Published Thu, May 9 2024 4:45 AM | Last Updated on Thu, May 9 2024 1:07 PM

-

వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికే మెండుగా విజయావకాశాలు

ఆది నుంచి ఈ కుటుంబానికే పట్టు

ఈ దఫా ఫ్యాన్‌ హవానేనంటున్న విశ్లేషకులు

నియోజకవర్గ ఆవిర్భావం నుంచి

రెండుసార్లే టీడీపీ విజయం

మిగిలిన అన్ని సార్లు ఇతర పార్టీలకే జై

ఈ సారి బరిలో ఇద్దరూ కొత్తవారే

జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎనిమిది మండలాలతో అతి పెద్ద వైశాల్యం గల ప్రాంతంగా పేరు గడించింది. విలక్షణ తీర్పునివ్వడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. గడిచిన ఆరు ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఇక్కడి ఓటర్లు ఎక్కువగా మేకపాటి కుటుంబం వైపే మొగ్గు చూపారు. నాటి నుంచి 2019 ఎన్నికల వరకు కేవలం రెండుసార్లే టీడీపీ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి పాలన.. మేకపాటి కుటుంబానికి ఉన్న ఆదరణతో ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఉదయగిరి: ఈ ఎన్నికల్లోనూ ఉదయగిరిధారణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమర్థ పాలన.. పేదల ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చర్యలు.. పదవుల్లో బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట.. ఇలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనను సాగించారు. మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో 40 ఏళ్లుగా మేకపాటి కుటుంబానికి పట్టుంది. పై రెండు కారణాలతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డికే విజయం వరించే అవకాశాలు మెండుగా మారాయి.

సైకిల్‌కు అన్నీ మైనస్సులే..
ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కాకర్ల సురేష్‌ ఎన్నారై. రాజకీయ అనుభవలేమి.. పార్టీ నేతల మధ్య కొరవడిన సఖ్యత.. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించకపోవడం.. గ్రూపు తగాదాలు.. వెరసి కాకర్లకు మైనస్సుగా మారాయి. కేవలం డబ్బునే నమ్ముకొని విజయ తీరాలకు చేరాలని ఆయన చేస్తున్న యత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. కాకర్ల ట్రస్ట్‌ పేరిట కొన్ని కార్యక్రమాలను చేపట్టినా.. టికెట్‌ వచ్చేంత వరకు ప్రజలతో సత్సంబంధాల్లేకపోవడం ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. టీడీపీ టికెట్‌ ఖరారయ్యాక సైతం ప్రజల్లో తిరిగేందుకు తగిన సమయం లేకపోవడంతో సుడిగాలి పర్యటనలకే పరిమితమయ్యారు.

మేకపాటి కుటుంబానికి సడలని పట్టు
ఉదయగిరి రాజకీయ ముఖచిత్రంలో మేకపాటి కుటుంబానికి దీర్ఘకాలంగా మంచి పట్టుంది. మేకపాటి కుటుంబానికి చెందిన రాజమోహన్‌రెడ్డి 1982లో రాజకీయ ప్రవేశం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఉదయగిరి ప్రజల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారు. 1985లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. 

తదుపరి 2004, 2009లో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం అనంతరం తన ఎమ్మెల్యే పదవి, కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన 2012 ఉప ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఉదయగిరి ప్రజలతో నిత్యం సత్సంబంధాలను కొనసాగిస్తుండటంతో మేకపాటి కుటుంబీకులు మన్ననలను పొందగలిగారు.

16 ఎన్నికల్లో రెండు సార్లే..
1955లో ఉదయగిరి నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 16 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి జనతా పార్టీ, మరోసారి బీజేపీ, రెండుసార్లు స్వతంత్రులు, రెండుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్‌, వైఎస్సార్సీపీకే విజయాలే దక్కాయి. 1999లో కంభం విజయరామిరెడ్డి.. 2014లో బొల్లినేని వెంకటరామారావు స్వల్ప మెజార్టీతో టీడీపీ తరపున విజయం సాధించారు. దీన్ని బట్టి వైఎస్సార్సీపీ విజయం నల్లేరుపై నడకేననే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఫ్యాన్‌కే జై..
ఉదయగిరి బరిలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ కొత్తవారే కావడం విశేషం. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి కుటుంబ బలం, ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉండటంతో విజయావకాశాలు ఆయనకే మెండుగా కనిపిస్తున్నాయి. 20 ఏళ్లుగా జరిగిన సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే నియోజకవర్గంలోని ఉదయగిరి, వింజమూరు, జలదంకి, కలిగిరి మండలాలు టీడీపీయేతర పార్టీలకే అనుకూలంగా ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు మండలాలతో పాటు సీతారామపురంలోనూ వైఎస్సార్సీపీకే స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో హోరాహోరీ తప్పేలా లేదు. ఉదయగిరి కోటలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నిరంతరం మమేకం
తొమ్మిది నెలలుగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గంలోని ప్రతి ఊరు, గడపకూ వెళ్లి సీఎం జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. తమ పార్టీకి అండగా ఉండాలంటూ విస్తృత ప్రచారం చేయడం.. ప్రజలతో మమేకమవ్వడం ఆయనకు కలిసొచ్చే అంశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement