
చంద్రబాబు అందుకే నోరెత్తలేదా?
రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబు ప్రతి చిన్న విషయానికి ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. అసెంబ్లీలోకి వర్షపునీరు లీకేజీ వ్యవహారాన్ని కవర్ చేసేందుకు మీడియాను అనుమతించకపోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు సీనియర్ అని చెప్పుకుంటున్నారని, టీడీపీలో ఆయన కంటే బుచ్చయ్య చౌదరి సీనియర్ అని గుర్తు చేశారు. చంద్రబాబులో ఏర్పడే ఆత్మన్యునతాభావం రాష్ట్రానికి ప్రమాదమన్నారు.
రాహుల్ గాంధీ గుంటూరు వస్తే టీడీపీ నాయకులతో నిరసన వ్యక్తం చేయించడాన్ని ఉండల్లి తప్పుబట్టారు. విభజన జరిగినప్పుడు టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్ పార్లమెంట్‌లోనే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో నోరెత్తని చంద్రబాబు రాహుల్ ఏపీకి వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేయడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రూ. 4 వేల కోట్లు విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి రావాల్సివున్నా ఇప్పటివరకు నోరెత్తకపోవడానికి కారణం ఓటు కోట్లు కేసేనా అని నిలదీశారు.