సాక్షి, రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. హైకోర్టుకు ఈ నెల 19 లోపు ప్రభుత్వం వాస్తవాలను చెప్పుకునే అవకాశం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై గతంలోనే ఫొటోలతో సహా సీఎం చంద్రబాబుకు లేఖ పంపించామన్నారు. చంద్రన్న మాల్స్ అనేవి ప్రభుత్వం పేరుతో జరుగుతున్న ప్రైవేట్ వ్యాపారమని విమర్శించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బెయిల్ ఇన్ చట్టం దారుణమైందని మండిపడ్డారు. ఆ చట్టం అమలైతే ప్రజలకు బ్యాంకులపై ఉన్న నమ్మకం పోతుందని తెలిపారు. జాతీయ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును చట్టంతోనే కొట్టేసే యత్నం చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే పటిష్టమైన మన బ్యాంకింక్ వ్యవస్థను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు.
కాగా, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన ఆర్ధిక బాధ్యతను 1.4.2014కే పరిమితం చేయడం రాజ్యాంగానికి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, ఇచ్చిన హామీ మేర మొత్తం వ్యయాన్ని భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో గత వారం పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment