ఇక భూంఫట్!
- వుడా పరిధిలోకి పర్యాటక శాఖ
- అస్మదీయులకు భూపందేరానికి మార్గం సుగమం
- ఇక ప్రైవేటు గుప్పెట్లోకి ఎర్రకొండ, సీతకొండలు!
ఇదీ ఉత్తర్వు
పర్యాటక శాఖను వుడా పరిధిలోకి ప్రభుత్వం తీసుకువస్తూ ప్రభుత్వం జీవో 146ను మంగళవారం జారీ చేసింది. వుడా వీసీ ఇక నుంచి ప్రాంతీయ పర్యాటక కమిషనర్‌గా వ్యవహరిస్తారు. పర్యాటక శాఖలోని అధికారులు, సిబ్బంది నేరుగా ఆయన నియంత్రణలోకి వస్తారు. ప్రాజెక్టుల రూపకల్పన, అందుకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు, డీపీఆర్‌లు రూపొందించడం, భూ కేటాయింపు అన్ని కూడా ఆయన పరిధిలోకి చేర్చింది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రాజు తలచుకుంటే... అన్న చందంగా మారింది విశాఖ నగరంలో ప్రభుత్వ భూపందేరం బాగోతం. పర్యాటకాభివృద్ధి ముసుగులో తమ అస్మదీయులకు భారీ భూ సంతర్పరణకు ప్రభుత్వం కార్యరంగాన్ని సిద్ధం చేసింది. నగరంలో ఎర్రకొండ, సీతకొండలతోసహా 2వేల ఎకరాలను తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేసింది. పర్యాటక శాఖను ఏకంగా వుడా పరిధిలోకి తీసుకువచ్చింది. వుడా వీసీకి విశేష అధికారాలు కల్పిస్తూ పర్యాటక ప్రాజెక్టులపేరిట తమ అనుయాయులకు భూ పందేరానికి మార్గం సుగమం చేసింది.
భూంఫట్!... ఇదీ పన్నాగం
భారీ భూపందేరానికి మార్గం సుగమం చేయడానికే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసింది. పర్యాటక ప్రాజెక్టు పేరిట నగరంలో 1,854 ఎకరాలను తమ అస్మదీయులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివార్లలోని ఎర్రకొండ(893 ఎకరాలు) , సీతకొండ(212 ఎకరాలు), పెద్దగంట్యాడలో నరవ(275 ఎకరాలు), నాగుపూర(446 ఎకరాలు), మధురవాడలో గుడ్లవానిపాలెం(28 ఎకరాలు) భూములపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. అటవీ భూములుగా ఉన్నవాటిని డీనోటిఫై చేయాలని వుడా కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎర్రకొండ, సీతకొండలపై 1,105 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌లు రూపొందించాలని టెండర్లు పిలిచింది. కానీ ప్రభుత్వ భూములు, కొండలు వుడా పరిధిలో ఉన్నాయి. పీపీపీ విధానంలో పర్యాటక ప్రాజెక్టుల బాధ్యత పర్యాటక శాఖ చూస్తుంది.
వేర్వేరు అధికారిక వ్వవస్థల వల్ల తమ వారికి భూములు కట్టబెట్టడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిచింది. పర్యావరణ, సీఆర్‌జెడ్ చట్టాలు, వుడా మాస్టర్‌ప్లాన్ నిబంధనలను బేఖాతరు చేస్తుండటంతో ఏమైనాఅవరోధాలు తలెత్తవచ్చని కూడా సందేహించింది. ఒకే వ్యవస్థ ఉంటేఅనుకున్న విధంగా పనికానిచ్చేయొచ్చని యోచించింది. పర్యాటక శాఖను పూర్తిగా వుడా పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో ఎర్రకొండ, సీతకొండలతోసహా 1,850ఎకరాల ధారాదత్తానికి మరో అడుగు వేసింది.