ప్రజాసంక్షేమానికి తూట్లు | Undermined public welfare | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమానికి తూట్లు

Published Mon, Aug 4 2014 1:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రజాసంక్షేమానికి తూట్లు - Sakshi

ప్రజాసంక్షేమానికి తూట్లు

  •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుబాట పట్టండి
  •   కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి కృషిచేయండి
  •   ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
  • మచిలీపట్నం : ‘‘రుణమాఫీ లేదు.. కనీసం రీ షెడ్యూలు చేయలేదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అసలే లేదు.. ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోకుండా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పందెం కోళ్ల మాదిరిగా కత్తులు కట్టుకొని కొట్లాడుకుంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది’’ అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు.

    జిల్లా కాంగ్రెస్ పార్టీ విసృ్తతస్థాయి సమావేశం ఆదివారం మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రుణాలను పూర్తిగా మాఫీచేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మాటతప్పి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులను రోడ్డున పడేశారని విమర్శిం చారు. కనీసం రైతు రుణాలను రీషెడ్యూలు కూడా చేయలేదని పేర్కొన్నారు.

    డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి, అది కూడా చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే రెండు నెలలు గడిచినా కృష్ణాడెల్టాకు సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఖరీఫ్ సీజన్‌కు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదని, దీంతో రైతులు పంట బీమా కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.

    తెలంగాణలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పేద విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ చేయకుండా అక్కడి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీ నాయకులు దేశంలో, రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పిదంగా ప్రచారం చేశారన్నారు. రైల్వే చార్జీలు, డీజీల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచబోమని ప్రజలను నమ్మించి అధికారం చేతికొచ్చాక అన్ని ధరలను పెంచేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద గంట పాటు నిరసన కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు

    రాజశేఖర్‌రెడ్డిలాంటి నేత ఇప్పుడు లేరు
     
    కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్.రాజశేఖరరెడ్డి వంటి నాయకుడు లేడన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తించాలన్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు జిల్లా, నియోజకవర్గస్థాయిల్లో త్వరలో కమిటీలు వేస్తామన్నారు.

    ఆతరువాత గ్రామ, వార్డుల వారీగా నియామకాలు చేపట్టి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ రాష్ట్ర విభజన చారిత్రక తప్పిదమన్నారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో హైదరాబాదును యూటీగా ఉంచాలని కోరినా ఫలితం దక్కలేదన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని పటిష్టంచేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

    జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా పరిశీలకుడు కె.దుర్గేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌బాబు, నాయకులు కొలనుకొండ శివాజీ, అడపా శివనాగేశ్వరరావు, సుంకర పద్మశ్రీశోభ, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఒక్కొక్క నియోజకవర్గ కార్యకర్తలతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై రఘువీరారెడ్డి, ఇతర పార్టీ నాయకులు సమీక్ష  నిర్వహించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement