ప్రస్తుతం ఏపీపీఎస్సీ అనుసరిస్తున్న విధానం ప్రకారం రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థి ఒకరు గ్రూప్–1 రిక్రూట్‌మెంట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించారనుకుందాం. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించటానికి రిజర్వేషన్ వాడుకున్నాడనే నెపంతో ఇతనికి బీసీ కేటగిరీలో పోస్ట్ ఉంటేనే ఇస్తారు. లేదంటే ఇవ్వరు. టోటల్‌గా ఫస్ట్ ర్యాంక్ సాధించినప్పటికీ ఫలితం శూన్యం.
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుపై నిరుద్యోగులు, ఆయా ఉద్యోగ సంఘాలు ఆందోళనలు వ్యక్తపరుస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. రిజర్వేషన్లపై కమిషన్‌కు ఎలాంటి అధికారం లేకపోయినా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రిజర్వుడు అభ్యర్థులకు న్యాయబద్ధంగా, రాజ్యాంగ పరంగా దక్కాల్సిన అవకాశాలను కాలరాస్తోందని కొద్ది రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకొని మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థి కేవలం తన రిజర్వుడ్ కోటాకు మాత్రమే పరిమితం కావాలని ఏపీపీఎస్సీ ఇటీవల కొత్త నిబంధన తేవడం తెలిసిందే.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర ముఖ్యుల దృష్టికి తీసుకెళితే వారు చూసీ చూడనట్లు మౌనం వహించడంతో నిరుద్యోగుల ఆందోళ మరింత తీవ్రరూపం దాలుస్తోంది. స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకున్న వారు ఆతరువాత వారి కేటగిరీకే పరిమితం అవుతారని ప్రభుత్వం జారీ చేసిన జీఓ5లో ఎక్కడా లేదు. స్క్రీనింగ్ టెస్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు నిర్ణీత నిష్పత్తి సంఖ్య కన్నా తక్కువగా ఉంటే వారికి కటాఫ్ మార్కులు తగ్గించి ఎంపిక చేయడం ద్వారా ఆయా పోస్టులు భర్తీ చేయాలని మాత్రమే సూచించింది. అయితే వారు రిజర్వుడ్ పోస్టులకే అర్హులని ఏపీపీఎస్సీ చెప్పడం సరికాదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు కూడా ఇచ్చిందని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీపీఎస్సీకి లేఖ కూడా రాశారు. నోటిఫికేషన్లో పెట్టిన నిబంధన తొలగించి స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్‌కు ఎంపికైన రిజర్వుడ్ అభ్యర్థులందరినీ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ లేఖను ఏపీపీఎస్సీ పెద్దగా పట్టించుకోకపోగా, దీనిపై న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్లాలని తాజాగా భావిస్తుండడం మరింత వివాదంగా మారుతోంది.
నిర్ణయాధికారం లేకున్నా అత్యుత్సాహం
రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల అంశం చట్ట సభలు, ప్రభుత్వ పరిధిలోనిది. అధికరణ 320 ప్రకారం ఈ అంశాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరిధి బయట ఉంచారని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల విషయంలో చట్ట సభలు, ప్రభుత్వ విధానాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అమలు పరచడం తప్ప, నిర్ణయాలు మార్చేందుకు ఎటువంటి అధికారం రాజ్యాంగం కల్పించ లేదు. ప్రభుత్వ సర్వీస్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలో స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే వివిధ దశలు ఉన్నప్పటికీ అంతిమంగా వచ్చిన ర్యాంకులను బట్టి సర్వీసులను కేటాయించి రిజర్వేషన్లను అనుసరిస్తూ ఎంపిక చేయాల్సి ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. కానీ పరీక్షల ప్రక్రియ మధ్యలో ఉన్న వివిధ దశలను వాడుకుని రిజర్వేషన్లను వ్యతిరేక వైఖరితో (నెగటివ్ అప్రోచ్)తో అమలు చేయకూడదని చెబుతున్నారు. అయినా ఏపీపీఎస్సీ అత్యుత్సాం ప్రదిర్శిస్తోందని విమర్శిస్తున్నారు.
యూపీఎస్సీ విధానమంటూ తప్పుదోవ
యూపీఎస్సీ విధానమంటూ ఏపీపీఎస్సీ తప్పుదోవ పట్టిస్తోందని అభ్యర్ధులు వాపోతున్నారు. 2006 వరకు యూపీఎస్సీ రిజర్వేషన్లను సానుకూల వైఖరితో (పాజిటివ్ అప్రోచ్) అమలు చేసింది. 2007లో మద్రాస్ హైకోర్టు నిర్ణయం తర్వాతి నుంచి యూపీఎస్సీ వ్యతిరేక వైఖరి (నెగటివ్ అప్రోచ్)ని అనుసరించడంతో అభ్యర్థులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. యూపీఎస్సీకి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు వర్తించవు. ఆయా ప్రభుత్వాలు అయినా ఉత్తర్వులు ఇవ్వాలి లేదా కోర్టు నుంచి అయినా ఉత్తర్వులుండాలి. అవేవీ లేకపోగా ఇక్కడ కొత్త విధానం సరికాదని ఇక్కడి హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. సాధారణ పరిపాలనా శాఖ వద్దని చెప్పింది. అయినా ఏపీపీఎస్సీ తనంతట తానే ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి లక్షలాది మంది రిజర్వుడ్ అభ్యర్థులకు అన్యాయం చేస్తోంది. యూపీఎస్సీ రాష్ట్రాల కమిషన్లకు అధిపతి కానేకాదు. అయినా యూపీఎస్సీ విధానం అంటూ ఏపీపీఎస్సీ మెలిక పెడుతోంది. ప్రిలిమ్స్ అనేది కేవలం మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్ పరీక్షలో, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తున్నామని చెబుతున్న ఏపీపీఎస్సీ, ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ ఉపయోగించుకున్నాడని మెరిట్ అభ్యర్థికి పోస్టు ఇవ్వబోమని చెబుతుండడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment