
యూనిఫాం మార్పు వెనుక అవినీతి మడత
శ్రీకాకుళంలో గుర్తింపు పొందిన కళాశాల అది. అక్కడి ప్రిన్సిపాల్ సూర్యనారాయణ (పేరుమార్చాం). 1400 మందికిపైగా విద్యార్థులున్నారు. ఏటా ఆ కళాశాలలో యూనిఫాంను మార్చుతున్నారు. ప్రిన్సిపాల్ నేరుగా వస్త్ర దుకాణం యజమానితో బేరసారాలకు దిగి తనకు కొంత మొత్తం ముట్టచెబితే యూనిఫాంను మార్పించే ఏర్పాట్లు చేస్తానని ఒప్పందం చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో ఒకే షాప్‌లో ఆ యూనిఫాం లభ్యమయ్యేలా చూస్తున్నారు. ఇలాంటి కళాశాల ప్రిన్సిపాళ్లు జిల్లాలో ఎక్కువ మందే ఉన్నారు. వీరివల్ల ఏటా యూనిఫాం మారి తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోయూల్సి వస్తోంది.
* ఏడాదికో యూనిఫాం మార్చుతున్న విద్యాసంస్థలు
* వస్త్ర వ్యాపారులతో నేరుగా ఒప్పందాలు
* ప్రభుత్వ కళాశాలల్లోను ప్రిన్సిపాళ్లు చేతివాటం
* ఏటా తల్లిదండ్రులపై ఆర్ధిక భారం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో 6500 వరకు వివిధ యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలు, 700 వరకు కార్పొరేట్, చిన్నాచితకా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 72 వివిధ యాజమాన్యాల జూనియర్ కళాశాలలు, మరో 95 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, మరో 82 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. వీటన్నింటిలో ఏడాదికి సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసాలు సాగిస్తున్నారు. ఇందులో కనీసం 60 శాతం మంది విద్యార్థులు ఏటా యూనిఫాం మార్చుకోవాల్సి వస్తోంది. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాల నిర్ణయూలకు బాధితులవుతున్నారు. దుస్తులను రెట్టింపు ధరలకు కొంటూ ఆర్ధికంగా నష్టపోతున్నారు.
ప్రభుత్వ కళాశాలల్లోనూ ఇదే తీరు..
ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు అక్కడి యాజమాన్యాల విధానాలతో నష్టపోతున్నారు. వ్యాపారులతో ముందస్తుగా కుదర్చుకున్న లోపారుుకారీ ఆర్ధిక ఒప్పందాలకు వీరంతా మూల్యం చెల్లిస్తున్నారు. ఈ తంతు ప్రైవేటు విద్యాసంస్థలకే పరిమితం కావటం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోను అక్కడి హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు మూడో వ్యక్తికి తెలియకుండా (రెండో వ్యక్తి వస్త్ర వ్యాపార యజమాని) యూనిఫాంను మార్చుతూ తమ మార్క్ మాయాజాలన్నా ప్రదర్శిస్తున్నారు.
ఒకే యూనిఫాం అమలుచేయాలి..
రాష్ట్రవ్యాప్తంగా ఒకే యూనిఫాం విధానాన్ని అమలు చేయాలని జేఎల్స్ సంఘం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లోను ఏడాదికొక యూనిఫాంను మార్చుచూ కొందరు ప్రిన్సిపాళ్లు అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
- జి.వెంకటేశ్వరరావు, ప్రభుత్వ జేఎల్స్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి
ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటాం
కొన్ని విద్యాసంస్థల్లో, కళాశాలల్లో ఏడాదికొక యూనిఫాం మార్చుతున్నట్లు సమాచారం అయితే ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. విద్యార్థులను ఆర్థికంగా ఇబ్బందిపాలు చేయడం సరికాదు. ఫిర్యాదుచేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం.
- పాత్రుని పాపారావు, ఆర్‌ఐవో, ఇంటర్మీడియెట్ బోర్డు