రాష్ట్రపతికి నివేదించిన కేంద్ర హోంశాఖ
నేడో, రేపో గడువు పొడిగింపు సమాచారం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర పున ర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు మరో రెండు వారాల గడువు ఇచ్చేందుకు కేంద్ర హోం శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రపతి వాస్తవంగా ఇచ్చిన గడువు ఈ నెల 23తో ముగియనుండగా.. చర్చకు మరో నెల రోజులు సమయం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అరుుతే రెండు వారాలు మాత్రమే గడువు పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ హోం శాఖ సోమవారం రాష్ట్రపతికి నివేదించినట్లు రాష్ట్ర అధికారులకు సమాచారం అందింది.
గడువు పొడిగించాలని కోరుతూ సీఎస్ రాసిన లేఖతో పాటు మరో అనుబంధ లేఖను కూడా రాష్ట్రపతికి పంపింది. గడువు పెంచుతూ మంగళ లేదా బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఇలావుండగా.. మంగళవారం ఢిల్లీలో జరగనున్న సిబ్బంది శిక్షణ విభాగం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎస్, ఆ సమావేశానంతరం గడువు అంశంపై హోంశాఖ ముఖ్య అధికారులతో సమావేశమవుతారని తెలిసింది.
రాజ్యసభ ఎన్నికల కోసమేనా..!
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల గండాన్ని గట్టెక్కించుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్చ గడువు పొడిగించాలన్న ఆలోచన చేసినట్టు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. బిల్లుపై చర్చకు గడువును 2 వారాలు పొడిగిస్తే అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 6 వరకు కొనసాగే అవకాశాలున్నాయని సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురికంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉంటే వచ్చే నెల 7న పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతల మద్దతు తప్పనిసరి. అందువల్లే వారు కోరిన విధంగా బిల్లుపై చర్చకు గడువు పొడిగించాలని అధిష్టానం నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.