కృపారాణిపై కోపాగ్ని
Published Wed, Oct 2 2013 2:02 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సదనంపైకి ప్రజా సమూహం దండెత్తింది. కేంద్ర మంత్రి పదవీ కాంక్షను ఎం డగట్టింది. సమైక్యాంధ్ర ఆకాంక్షను ఎందుకు పట్టించుకోరంటూ నిగ్గదీసింది. సముదాయించడానికి రెండుసార్లు యత్నించినా ఏమాత్రం కృప చూపలేదు.. ఆందోళనపథం వీడకపోగా.. ఆగ్రహాగ్నితో కృపారాణి దిష్టిబొమ్మను దహనం చేసింది. సుమారు మూడుగంటల సేపు కేంద్రమంత్రికి ముచ్చెమటలు పట్టిం చింది. ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయమైన ప్రజా సదనం భవనాన్ని మంగళవారం సమైక్యవాదులు ముట్టడించి నినాదాలు, బైఠాయింపులు, శవయాత్రతో హల్‌చల్ చేశారు. ఈ సంఘటనలతో మంత్రి కార్యాలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత అలుముకుంది. పోలీసులు భారీ ఎత్తున మోహరించినా సమైక్యవాదులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.
సమైక్య రాష్ర్ట పరిరక్షణ కమిటీ, జిల్లా జేఏసీ నేతల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు ఎన్జీవో హోం నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటల సమయంలో మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి, ఎంపీ పదవులకు రాజీనామా చే సి ఉద్యమంలోకి రావాలని నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించడం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటికి కృపారాణి భవనం పైఅంతస్తు బాల్కనీలోకి వచ్చి సమైకవాదులను సమూదాయించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరంలేదన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పలుమార్లు కాంగ్రెస్ ఆధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడానికి మంత్రి పదవి అవసరమని అన్నారు. తను కూడా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మంత్రి స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేసిన సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ చైర్మన్ హనుమంతు సాయిరాం, కన్వీనర్లు జామి భీమశంకర్, దుప్పల వెంకట్రావు, కొంక్యాన వేణుగోపాలరావు, ఎం.అప్పలనాయుడు, ఇతర ప్రతినిధులు కిలారి నారాయణరావు, కె.వి. అప్పలనాయుడు, దుప్పల శివరాంప్రసాద్ తదితరుల నాయకత్వంలో ఉద్యమకారులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. కార్యాలయం ముందు బైఠాయించారు. కొందరు రోడ్డుపైనే పడుకున్నారు. ఇంకొందరు చొక్కాలు విప్పేసి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మంత్రి కృపారాణి డౌన్‌డౌన్, సోనియా డౌన్‌డౌన్ అని నినాదాలతో హోరెత్తించారు. దీంతో కృపారాణి బయటకు వచ్చి మరోసారి వారిని సముదాయించడానికి ప్రయత్నించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను ఎందుకు గౌరవించరని నిలదీశారు.
60 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా రాజకీయ లబ్ధి కోసం పదవులను అంటిపెట్టుకొని ఉన్నారని ఆరోపించారు. శ్రీకాకళం నుంచి అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు పంపిన ప్రజలకే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కట్టుకథలు, పిట్టకథలు చెప్పకుండా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఇలాగే కొససాగితే సమైక్య ద్రోహులుగా మిగిలిపోతారని, రాజకీయ భవిషత్తు ఉండదని హెచ్చరించారు. ఐటీ శాఖ మంత్రి ఉండి లక్షల కోట్ల భారీ ప్రాజెక్టు అయిన ఐటీఐఆర్‌ను సీమాంధ్ర ప్రాంతానికి తెచ్చుకోలేని మీరు రాష్ర్ట విభజనను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. ఆధిష్ఠానం వద్ద మాట్లడే ధైర్యం లేని మీరు విభజనను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాజకీయ సంక్షోభంతోనే విభజనను అడ్డుకోగలమని, వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఏ ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా మౌనం వహించిన కృపారాణి, అలాగే లోనికి వెళ్లిపోయారు. దీంతో ఉద్యమకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యాలయం బయట మంత్రి ఫొటోతో ఉన్న గ్లోసైన్ బోర్డును చించేశారు. వాటి కర్రలతోనే పాడె, దిష్టిబొమ్మ తయారు చేసి పీఎస్‌ఎన్‌ఎం పాఠశాల వరకు శవయాత్రను నిర్వహించి, దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బమ్మిడి నర్సింగరావు, గీతాశ్రీకాంత్, గురుగుబెల్లి రాజులు, ఎం.కాళీ ప్రసాద్, బి.శ్రీహరి, వి.హరిశ్చంద్రుడు, పద్మావతి, సుబ్బలక్ష్మి, బి.సూర్యనారాయణ, ప్రభావతి, శోభారాణి, ఎస్.వి.ఎస్.ప్రకాష్, వై.ఉమామహేశ్వరరావు, శేషగిరిరావు, జయరాం, డిఆర్‌కె దాస్, ఎం.వి.రమణ, పైడి అప్పారావు, నానాజీ, పప్పల రాధాకృష్ణ, కె.వి.అప్పలనాయుడు, బి.రుషి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement