మంత్రి చెప్పినా పలకని ధర | union minister nirmala sitharaman about tobaco rate | Sakshi
Sakshi News home page

మంత్రి చెప్పినా పలకని ధర

Published Sun, Jul 12 2015 3:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

union minister nirmala sitharaman about tobaco rate

సాక్షి ప్రతినిధి, ఒంగోలు :  కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పినా పొగాకుకు మద్దతు ధర అమలు కావడం లేదు. గత వారంలో కేంద్రమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఒక్కో గ్రేడ్‌కు సగటున ఎంత ధర ఇవ్వాలో నిర్ణయించారు. దీని ప్రకారం నాణ్యమైన పొగాకు (ఏ గ్రేడ్)కు రూ.114 తగ్గకుండా ఇవ్వాలని సూచించగా రూ.100 కూడా రావడం లేదు. మిడిల్ గ్రేడ్ పొగాకుకు రూ.102లకు తగ్గకుండా ధర వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చినా రూ.80 నుంచి రూ. 90 మధ్యనే నడుస్తోంది. ఇక లోగ్రేడ్ విషయానికి వస్తే కిలోకు రూ.67 ఇస్తామని చెప్పగా రూ.50 నుంచి రూ. 60 మధ్యనే నడుస్తోంది.

జిల్లాలో సగటున రూ.99 ధర వచ్చే బాధ్యత మాదని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకూ సగటు ధర రూ.93  కూడా దాటడం లేదు. ప్రస్తుతం పొగాకు బోర్డు వేలం కేంద్రాలకు వస్తున్న పొగాకులో 50 నుంచి 60 శాతం మంచి నాణ్యత ఉన్న పొగాకు వస్తోంది. నాణ్యమైన పొగాకు వస్తుంటేనే సగటు ధర రూ.93 దాటడం లేదని, లో గ్రేడ్ పొగాకు వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ఉత్పత్తైన పొగాకులో 75 శాతం వరకూ మీడియం - లో గ్రేడ్ పొగాకే వచ్చింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతులు తమ వద్ద పొగాకును బోర్డు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బోర్డు మాత్రం దీనికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు.  గత ఏడాది ఈ ప్రాంతంలో 213 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తయితే సగటు ధర రూ.116 పలికింది. ఈ ఏడాది అది వంద రూపాయలలోపే ఉండటంతో ఒక్కో బ్యారన్‌కు రెండు లక్షల రూపాయల వరకూ రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

 విస్తీర్ణం తగ్గింపుపై ఆగ్రహం
     వచ్చే ఏడాది పొగాకు పంట లక్ష్యం తగ్గింపుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాగాకు బోర్డు కర్ణాటకపై ప్రేమ చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌పై శీతకన్ను వేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.  కర్ణాటకలో నాలుగు మిలియన్ కేజీల లక్ష్యాన్ని తగ్గించిన పొగాకు బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 52 మిలియన్ కేజీల లక్ష్యాన్ని తగ్గించింది. సుమారు 30 శాతం ఏరియాలో పంటను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దక్షిణ తేలిక నేలలు 58 మిలియన్ కిలోలకుగాను ఎనిమిది మిలియన్ కిలోలు, నల్లరేగడి నేలల్లో 47 మిలియన్ కిలోలకు గాను 10 మిలియన్ కిలోలు లక్ష్యం  తగ్గించారు.

జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. ఈ ఏడాది లక్ష్యం తగ్గించడం వల్ల సుమారు 30 వేల ఎకరాల్లో పొగాకు పంటను తగ్గించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఈ 30 వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంట ఏది వేయాలనే సందిగ్ధత ఉంది. పొగాకు వేసే ప్రాంతమంతా వర్షాధారం కావడంతో శనగ, మిర్చి తదితర పంటలు పండే అవకాశం లేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం పట్ల  రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement