సమైక్య ఉద్యమం మళ్లీ తీవ్ర రూపం దాల్చనుంది. నేటి నుంచి అసెంబ్లీలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థకీరణ బిల్లు’పై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో సమైక్యం కోసం నిరంతపోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాల కార్యాచరణ ప్రకటించింది. ఏపీ ఎన్జీవోలు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విభజన అంశం చివరి అంకానికి చేరడంతో ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమబాటలో నడిచి సమైక్యకాంక్షను నెరవేర్చుకునేందుకు పిడికిలి బిగించనున్నారు.
సాక్షి, కడప: సమైక్య తెలుగు రాష్ట్రంలో రగిలిన విభజన చిచ్చును చల్లార్చేందుకు అన్ని వర్గాల ప్రజలు దాదాపు మూన్నెళ్లపాటు అలుపెరుగని పోరు సాగించారు. అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీల వైఖరి కారణంగా విభజన బిల్లు అసెంబ్లీ దాకా వచ్చింది. నేటి నుంచి బిల్లుపై అభిప్రాయసేకరణ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనన్న ఏకైక డిమాండ్‌తో నిరంతరపోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఏపీ ఎన్జీవోలు కూడా వైఎస్సార్‌సీపీ పోరుకు సంపూర్ణమద్దతు ప్రకటించారు. నేడు జిల్లా బంద్‌లో ఎన్జీవోలు కూడా పాల్గొననున్నారు.
విభజన అంశం...చివరి అంకం:
రాష్ట్ర విభజనపై గత ఏడాది జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో ప్రకటించారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా సమైక్య జ్వాలలు మిన్నంటాయి.
వందరోజులకుపైగా బలమైన ఉద్యమం నడిచింది. కొద్దిరోజుల పాటు నాయకత్వ లోపంతో సమైక్య ఉద్యమం చుక్కాని లేని నావలా నడిచింది. అయితే వైఎస్ జగన్‌మోహ న్‌రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తి సమైక్యవాదాన్ని భుజాన వేసుకుని పోరు సాగిస్తున్నారు. దీంతో సమైక్యవాదుల్లో కూడా ఉద్యమస్ఫూర్తి మరింత రెట్టించింది. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోగలమనే సంకల్పం బలపడింది. అందుకు జిల్లాలో రోజూ ఏదో ఒక నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ‘సమైక్య శంఖారావం’ పేరుతో జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. విభజనవల్ల వాటిల్లే నష్టాలను వివరిస్తున్నారు. ఇప్పటికే కడప, ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగులో సభలు విజయవంతమయ్యాయి. అలాగే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కూడా కడప సెవెన్‌రోడ్స్, కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమాలు సాగిస్తున్నారు. గతంలో సకలజనుల సమ్మె వల్ల ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు, ఏపీ ఎన్జీవోల సమ్మెవల్ల ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం అంసెబ్లీలో బిల్లుపై చర్చ జరిగే తీరు, పరిణామాల ఆధారంగా మళ్లీ ఉద్యమం గత ఏడాది ఆగస్టు నెల పరిస్థితిని తలపించే అవకాశం ఉంది. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూర్తిగా చేతులెత్తేసిన కాంగ్రెస్, టీడీపీ
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నా, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీలు ఉద్యమానికి అండగా నిలువలేకపోయాయి. సమైక్యవాదమో, విభజనవాదమో రెండుపార్టీలు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాయి.
పార్టీ నాయకత్వం సమైక్యవాదంపై ప్రకటన చేయకపోవడంతో జిల్లాలోని టీడీపీ నేతలు పూర్తిగా ఉద్యమానికి దూరమయ్యారు. కేవలం ప్రజల్లో ఉనికిని కాపాడుకునేందుకు అప్పుడప్పుడు పదిమంది రోడ్లపైకి రావడం మినహా సమైక్యం కోసం పోరాడలేకపోతున్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేవనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఏకాభిప్రాయంతో ముందుకెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగసంఘాలు నేటి వైఎస్సార్‌సీపీ బంద్‌కు మద్దతు పలుకుతున్నాయి. అలాగే వారం రోజులపాటు జరిగే నిరసన కార్యక్రమాలకు కూడా ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది.
అశోక్‌బాబు చెప్పలేదు...అయినా మద్దతు: గోపాల్‌రెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు.
శుక్రవారం బంద్ చేయాలని ఇప్పటి వరకూ అశోక్‌బాబు నుంచి సమాచారం రాలేదు. అయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మేం బంద్‌లో పాల్గొంటున్నాం. సమైక్యకాంక్షను కోరే ప్రతి ఒక్కరితో కలిసి నడుస్తాం.
శాంతియుతంగా నిరసనలు చేయాలి: జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ,
శుక్రవారం నుంచి అసెంబ్లీలో విభజనబిల్లుపై చర్చ జరగనుంది. దీంతో జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో బందోబస్తును పటిష్టం చేశాం. శాంతియుతంగా నిరసనలు తెలియజేయవచ్చు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించకూడదు.
సమైక్య ప్రకటన వచ్చే వరకూ పోరు :
సురేష్‌బాబు, జిల్లా కన్వీనర్, వైఎస్సార్‌సీపీ
సమైక్య ప్రకటన వచ్చే వరకూ ఉద్యమాన్ని సాగిస్తాం. అందులోభాగంగా శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాం. అలాగే వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. అసెంబ్లీలోని పరిణామాలను బట్టి, రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఉద్యమంపై కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ప్రజలు, ఉద్యోగులు అందరూ సహకరించాలి.
వైఎస్సార్‌సీపీ ఉద్యమ కార్యాచరణ
ఈ నెల 3న జిల్లా బంద్ -4న బైకు ర్యాలీ
6న మానవహారాలు
7 నుంచి 10 వరకు నియోజకవర్గ
కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు
మళ్లీ సమైక్య జోరు
Published Fri, Jan 3 2014 2:30 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement