=నేడు జిల్లా బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపు
=పొలిటికల్ జేఏసీ మద్దతు
సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో జిల్లావ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా బంద్ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 121 రోజులుగా ప్రజలు సమైక్యం కోసం ఉద్యమం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.
ఓట్లు, సీట్ల కోసం సోనియాగాంధీ రాష్టాన్ని ముక్కలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాలో ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తన కుమారుడిని ప్రధానిని చేయడం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం దారుణమని విమర్శించారు.
శుక్రవారం జరిగే బంద్‌కు వ్యాపార, వర్తక, వాణిజ్యంతో పాటు విద్యాసంస్థలు, ఉద్యోగులు బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపును పొలిటికల్ జేఏసీ బలపరిచింది. పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కొలనుకొండ శివాజీ ఒక ప్రకటన చేస్తూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా వేర్వేరు ప్రకటనలలో బంద్‌కు పిలుపిచ్చాయి.
ఇక సమరమే..
Published Fri, Dec 6 2013 1:04 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement